Dhvajastambha Ganapati: బుద్ధిని ప్రసాదించే ధ్వజస్తంభ గణపతి... విద్యార్థులకు ప్రత్యేకం
శృంగేరిలోని ధ్వజస్తంభ గణపతి విశేషం ఏంటి? ధ్వజస్తంభంపైనే గణపతి రూపం ఎలా ఏర్పడిందనే కథ, విద్యార్థులు ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం.
Dhvajastambha Ganapati: వినాయకుడి విగ్రహం సాధారణంగా ఆలయ ప్రాంగణంలోనో, గర్భగుడి సమీపంలోనో కనిపిస్తుంది. కానీ ఒక ఆలయంలో మాత్రం గణపతి ప్రత్యేకంగా ధ్వజస్తంభంపైనే దర్శనమిస్తాడు. అంతేకాదు.. ఆ రూపం వెనుక ఉన్న కథ కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. శృంగేరిలోని ఈ అరుదైన ధ్వజస్తంభ గణపతిని విద్యార్థులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. బుద్ధి, జ్ఞానం ప్రసాదించే గణపతిగా ఆయనను భక్తులు కొలుస్తారు.
శృంగేరిలో ప్రత్యేకమైన గణపతి
కర్ణాటకలోని శృంగేరి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శారదాదేవి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శారదాదేవిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అక్కడితో తమ యాత్రను ముగించకుండా సమీపంలోని కొండపై ఉన్న శివాలయాన్ని కూడా సందర్శిస్తుంటారు. ఈ శివాలయంలోనే ధ్వజస్తంభంపై గణపతి ప్రత్యేక రూపంలో దర్శనమిస్తాడు. సాధారణంగా ఆలయాల్లో ధ్వజస్తంభం అంటే ప్రధాన దేవతకు సంబంధించిన పవిత్ర స్థంభం. అయితే ఇక్కడ దానిపైనే గణపతి రూపం ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
చిత్రంగా మొదలై.. విగ్రహంగా మారిన రూపం
ఈ గణపతి రూపానికి సంబంధించిన కథ శృంగేరి పీఠం 24వ జగద్గురువు అభినవ నృసింహ భారతి స్వామివారితో ముడిపడి ఉంది. ఒక సందర్భంలో ఆయన కొండపై ఉన్న ఈ శివాలయానికి వెళ్లారు. అక్కడ శివుడిని అర్చిస్తున్న సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా గణపతి ఆలయం లేదనే విషయాన్ని గమనించినట్లు చెబుతారు. గణపతిని ఆరాధించాలనే భావంతో ధ్వజస్తంభంపై ఆయన స్వయంగా గణపతి రూపాన్ని చిత్రంగా గీశారు. మొదట అది ఒక సాధారణ బొమ్మలా కనిపించింది. అయితే కొంతకాలం తర్వాత ఆ చిత్రంలో గణపతి రూపం క్రమంగా విగ్రహంలా కనిపించిందని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం చెబుతుంది. ధ్వజస్తంభంపై గణపతి రూపం ఏర్పడటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని సాధారణ పరిణామంగా కాకుండా దైవ సంకేతంగా భావించే భక్తులు కూడా ఉన్నారు. గణపతే తన రూపాన్ని తానే ఆవిష్కరించుకున్నాడని స్థానిక విశ్వాసం.
విద్యార్థులు ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారు?
గణపతిని సంప్రదాయంగా విద్య, జ్ఞానం, వివేకానికి అధిదేవతగా భావిస్తారు. ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం వెనుక ఇదే విశ్వాసం ఉంది. అందుకే శృంగేరి ధ్వజస్తంభ గణపతిని విద్యార్థులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. చదువులో ఏకాగ్రత, మంచి జ్ఞాపకశక్తి, పరీక్షల్లో విజయం కలగాలని కోరుకుంటూ విద్యార్థులు గణపతికి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో శారదాదేవి క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యతతో పాటు ఈ గణపతి దర్శనం కూడా భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
శారదాదేవి దర్శనం తర్వాత..
శృంగేరికి వచ్చే భక్తులకు శారదాదేవి దర్శనం ప్రధాన ఆకర్షణ. అయితే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా అనుభవించాలనుకునే వారు సమీపంలోని కొండపై ఉన్న శివాలయానికి కూడా వెళ్తుంటారు. అక్కడ శివుడిని దర్శించుకుని, ధ్వజస్తంభంపై ఉన్న గణపతి రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఒక చిత్రంగా ప్రారంభమైన రూపం కాలక్రమంలో విగ్రహంలా కనిపించిందనే కథ, దాని చుట్టూ ఏర్పడిన భక్తి విశ్వాసం.. ఈ ధ్వజస్తంభ గణపతిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. శృంగేరి వెళ్లే భక్తులకు ఇది కేవలం మరో దేవాలయ దర్శనం మాత్రమే కాదు.. ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అనుభవంగా కూడా నిలుస్తోంది.
గణపతి రూపం ఎక్కడ ఉంటే అక్కడ భక్తులకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. కానీ ధ్వజస్తంభంపైనే గణపతి దర్శనమివ్వడం మాత్రం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. అందుకే శారదాదేవి దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలామంది ఈ ధ్వజస్తంభ గణపతిని కూడా దర్శించుకుని తమ యాత్రను పూర్తి చేసుకుంటారు.




