Digambara Yogini Achamma: దిగంబర యోగిని అచ్చమ్మ...కథవింటే మనసు కరిగిపోతుంది

సంసారంలో కష్టాలనే సుడిగుండాలను దాటుకొని, ఆధ్యాత్మికంగా యోగసాధన చేసి, అవధూతగా మారిన దిగింబర మాత అచ్చమ్మ జీవితం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 8 Jun 2026 10:57 AM IST
Digambara Yogini Achamma: దిగంబర యోగిని అచ్చమ్మ...కథవింటే మనసు కరిగిపోతుంది
X

Digambara Yogini Achamma: సంసారమే ఓ పెద్ద సాగరం. అందులో మునిగినవారు బయటకు రావడం చాలా కష్టం. సంసార సాగరం నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారంటే వారి జీవితం ధన్యమైనట్టే. ఎన్నో ఆటుపోట్లు, సుడిగుండాలను ఎదుర్కొన్న తరువాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరుకున్నారు. ఎంతో మందికి దారి చూపించారు. అలాంటి వారిలో పరమసాధ్వి, అవధూత మాత చివటం అచ్చమ్మ. భర్త పెట్టిన కష్టాలను భరిస్తూనే సంసార బాధ్యతలను నెరవేర్చి, ఆ తరువాత సర్వస్వాన్ని త్యజించి దిగంబర యోగినిగా మారిన అచ్చమ్మ కథ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి వేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆమెతో కలిసి నడవాలనిపిస్తుంది.

గృహిణి నుంచి యోగినిగా ప్రయాణం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని చివటం గ్రామంలో అచ్చమ్మగారి లీలావిశేషాలు ప్రారంభమయ్యాయి. సాధారణ గృహిణిగా, బాధ్యతారహితంగా తిరిగే భర్తను భరిస్తూ, పిల్లలను సాకుతూనే ఆమె నిరంతరం రామనామ స్మరణలో గడిపేవారు. ఒకానొక దశలో సంసార బంధాలను వీడి, మన్నెం జగన్నాధపురంలో 12 సంవత్సరాల పాటు కఠినమైన మౌనదీక్షను ఆచరించారు. అనంతరం చివటం చేరుకుని బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయి, తన్మయస్థితిలో దిగంబర అవధూతగా మారిపోయారు. అక్కడి శ్మశానవాటికలో, జమ్మిచెట్టు కింద ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు. ఎవరైనా అడిగితే, "కాయలు కాయని చెట్టు కిందే కూర్చోవాలి" అంటూ సంసార కోరికలు లేని వైరాగ్యాన్ని బోధించేవారు.

అమ్మ చెప్పిన అద్భుతమైన ధ్యాన రహస్యం

అచ్చమ్మగారు భక్తులకు ఆధ్యాత్మికతను చాలా సులువైన పద్ధతిలో, పుస్తక శైలిలో వివరించారు. ఆమె చెప్పిన సూత్రాలు నిత్య జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఇంటి వాకిలిని చీపురుతో తుడిస్తే ఎంత శుభ్రంగా మారుతుందో, ధ్యానానికి ముందు వెనుక ఓంకారం జపిస్తే మనసులోని మాలిన్యాలు కూడా అంతలా తొలగిపోతాయని అవధూత మాత అచ్చమ్మ పేర్కొన్నారు. మనం భోజనంలో కూరను కొంచెంగా, అన్నాన్ని ఎక్కువగా తింటాం. అదే విధంగా ఉపన్యాసాలు వినడం కూరంత అయితే, ధ్యానం చేయడం అన్నమంత ఉండాలి. ధ్యానమే బంగారు ముద్ధ అని ఆమె ప్రవచించారు. దేవుని కోసం తపించడం అనేది కేవలం ధన సంపాదనపై ఉండే ధ్యాస కంటే ఎక్కువగా ఉండాలని మాతాజీ చెబుతారు.

మహోన్నత వినమ్రత... మహాసమాధి

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది దిగంబర మాతాజీ జీవన సూత్రం. సాధువులు, హఠయోగులు తనను దర్శించడానికి వచ్చినపుడు వారి పాదాలను తాకి దిగంబర మాత నమస్కరించేవారు. జ్ఞానం పెరిగేకొలది ఒదిగి ఉండటం ఎలాగో ఆచరించి చూపించారు. రామాలయంలో ఉంటూ భక్తులకు స్వయంగా వంటచేసి ఓ తల్లిగా వడ్డించేంఆరు. తాను మహాసమాధి కాబోతున్నానని ముందుగానే తెలుసుకున్న సాధ్వి అచ్చమ్మ... వారం రోజులు ముందుగానే తన పంటిని పీకి ఓ భక్తురాలికి ఇచ్చి భద్రంగా ఉంచుకోమని చెప్పారట. ఆ తరువాత చివటంలోనే ఆమె మహాసమాధి చెందారు. నేటికి ప్రతిరోజూ వందలాదిమంది చివటం గ్రామానికి వచ్చి దిగింబరమాత అచ్చమ్మ మహాసమాధిని దర్శించుకొని తరిస్తుంటారు. తణుకు నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చివటం చేరుకోవడానికి నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు మాతాజీ ఆశ్రమంలో అన్నప్రసాదాలు లభిస్తాయి. అమ్మ మహాసమాధిని మనస్పూర్తిగా దర్శిస్తే మనసు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story