Diwali 2026: దీపావళి 2026: ఐదు రోజుల పండుగల వెనుక ఉన్న పురాణ రహస్యాలివే!

దీపావళి 2026 వేడుకలు నవంబర్ 6 నుంచి 11 వరకు జరగనున్నాయి. ధన త్రయోదశి, కాళీ చౌదస్, నరక చతుర్దశి, లక్ష్మీపూజ, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వెనుక ఉన్న పురాణ విశేషాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 4 Nov 2026 12:49 PM IST
Diwali 2026: దీపావళి 2026: ఐదు రోజుల పండుగల వెనుక ఉన్న పురాణ రహస్యాలివే!
X

Diwali 2026: చీకటిని తొలగించి వెలుగును నింపే పండుగ దీపావళి. ఇంటి ముందు వెలిగించే దీపం నుంచి లక్ష్మీపూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధిక్యతను ఈ పండుగ గుర్తుచేస్తుంది. అందుకే దీపావళి అంటే కేవలం దీపాలు, మిఠాయిలు, కొత్త బట్టల వేడుక మాత్రమే కాదు.. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధర్మానికి సంబంధించిన ఐదు రోజుల పవిత్ర పర్వదినాల సమాహారం. 2026లో నవంబర్ 6న ధన త్రయోదశితో ప్రారంభమయ్యే దీపావళి వేడుకలు నవంబర్ 11న భాయ్ దూజ్‌తో ముగుస్తాయి. ఈ ఐదు ప్రధాన పర్వదినాల వెనుక ఉన్న పురాణ విశేషాలను తెలుసుకుందాం.

ధన త్రయోదశి- నవంబర్‌ 6

దీపావళి వేడుకలకు ధన త్రయోదశి నాంది పలుకుతుంది. సముద్ర మథనం సమయంలో అమృత కలశంతో శ్రీమహావిష్ణువు అంశగా ధన్వంతరి భగవానుడు ఆవిర్భవించారని పురాణ కథనం. ఆయనే ఆయుర్వేదానికి ఆదిదేవుడిగా పూజలందుకుంటారు. అందుకే ఈ రోజున సంపదతో పాటు ఆరోగ్యం కూడా కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం, బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. యమధర్మరాజును స్మరిస్తూ దీపం వెలిగించే యమ దీపానికి కూడా ఈ రోజున ప్రత్యేకత ఉంది.

కాళీ చౌదస్ - నవంబర్ 7

కాళీ చౌదస్‌ను ముఖ్యంగా గుజరాత్‌తో పాటు పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఈ రోజున కాళీమాతను, హనుమంతుడిని పూజించి దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించాలని భక్తులు కోరుకుంటారు. మనసులోని భయం, ప్రతికూల ఆలోచనలు, చెడు అలవాట్లను తొలగించుకోవాలనే ఆధ్యాత్మిక భావన ఈ పండుగలో కనిపిస్తుంది. వెలుగుల పండుగకు ముందు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలనే సందేశాన్ని ఈ రోజు అందిస్తుంది.

నరక చతుర్దశి, దీపావళి - నవంబర్ 8

నరకాసురుడి సంహారం నరక చతుర్దశి వెనుక ఉన్న ప్రధాన పురాణగాథ. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించి ప్రజలకు విముక్తి కల్పించాడని కథనం. అహంకారం, దుర్మార్గం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మం ముందు నిలవలేవని ఈ ఘట్టం చెబుతుంది. అదే రోజు సాయంత్రం దీపావళి లక్ష్మీపూజ నిర్వహిస్తారు. లక్ష్మీదేవితో పాటు గణపతిని పూజించి ఇంట్లో సుఖసంతోషాలు, సంపద, వివేకం కలగాలని కోరుకుంటారు. రామాయణ సంప్రదాయం ప్రకారం 14 ఏళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఆ ఆనందానికి ప్రతీకగానూ దీపావళిని జరుపుకుంటారు.

గోవర్ధన పూజ - నవంబర్ 10

బృందావన ప్రజలను ఇంద్రుడి ఆగ్రహం నుంచి కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తాడని పురాణగాథ. ప్రకృతిని గౌరవించడం, పశుసంపదను కాపాడుకోవడం, అహంకారానికి దూరంగా ఉండటం ఈ పండుగ ఇచ్చే సందేశాలు. ఈ రోజున అన్నకూటం పేరుతో వివిధ రకాల ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

భాయ్ దూజ్ - నవంబర్ 11

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక భాయ్ దూజ్. యమునాదేవి తన సోదరుడైన యమధర్మరాజును ఇంటికి ఆహ్వానించి నుదుట తిలకం దిద్దిందని పురాణ కథనం. ఆమె ఆతిథ్యానికి సంతోషించిన యముడు, ఈ రోజున సోదరి ఆశీర్వాదం పొందిన సోదరులకు శుభం కలగాలని వరమిచ్చినట్లు చెబుతారు. అందుకే సోదరీమణులు సోదరులకు తిలకం దిద్ది, వారి ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తారు. దీపావళి ఐదు రోజుల పర్వదినాలు మనకు ఐదు ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సంపదను సద్వినియోగం చేసుకోవడం, చెడును విడిచిపెట్టడం, ప్రకృతిని గౌరవించడం, కుటుంబ బంధాలను నిలబెట్టుకోవడం. ప్రతి ఇంట్లో వెలిగించే దీపం మన జీవితాల్లోనూ జ్ఞానం, ధర్మం, ప్రేమ అనే వెలుగులు నింపాలని ఈ పండుగ సందేశం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.