Lamp: కలలో వెలుగుతున్న దీపం కనిపించిందా? నిశ్చింతగా ఉండండి...అద్భుతాలు జరుగుతాయి

అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో మనకు తెలియకుండానే కొన్ని కలలు వస్తుంటాయి. ఆ కలలో వెలుగుతున్న దీపం కనిపిస్తే ఏమౌతుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 6 July 2026 8:28 AM IST
Lamp: కలలో వెలుగుతున్న దీపం కనిపించిందా?  నిశ్చింతగా ఉండండి...అద్భుతాలు జరుగుతాయి
X

Lamp: మన జీవితం ఆశలు, ఆశయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికోసం నిరంతరం శ్రమిస్తుంటాం. అయితే, ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించి అలసిపోయిన మనిషి నిద్రిస్తున్న సమయంలో అంతరంగంలో కొన్ని కలలు వస్తుంటాయి. ఆ కలలు రాబోయే కాలానికి సూచికలుగా ఉంటాయి. ఇక స్వప్నశాస్త్రం ప్రకారం, మన కలలో కనిపించే ప్రతి వస్తువుకూ కూడా ఒక నిర్థిష్టమైన సంకేతం ఉంటుంది. అయితే, కలలో మీకు వెలుగుతున్న దీపం కనుక కనిపిస్తే... ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయని, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని దీని సంకేతం. హైందవ సంప్రదాయంలో దీపం లక్ష్మీదేవికి మారు రూపంగా కూడా చెబుతారు.

స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

కలలో దీపం కనిపించే విధానాన్ని బట్టి ముఖ్యమైన ఆధ్యాత్మిక ఫలితాలను మన పెద్దలు గ్రంథాలలో పొందుపరిచారు. అవేంటో తెలుసుకుందాం. ఇంట్లో లేదా ఆలయంలో దీపం వెలుగుతున్నట్టుగా కనిపిస్తే మీ ఇంటిపై దేవతలు సానుకూల దృక్పదంతో ఉన్నారని, శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండబోతుందని అర్ధం. అదేవిధంగా దీపాలు వరసగా వెలుగుతున్నట్టుగా కలలో కనిపిస్తే... జీవితంలో మీరు చేసిన పాపాలు నశించి మానసిక ప్రశాంతత లభిస్తుందని అర్ధం చేసుకోవాలి. విద్యార్థులకు కలలో ఇలా కనిపించడం శుభసూచికం. అంతేకాదు, కలలో దీపం కదులుతున్నట్టుగా కనిపిస్తే, హారతి ఇస్తున్నట్టుగా కనిపిస్తే పితృదేవతల ఆత్మలు సంతోషంగా తృప్తికరంగా ఉన్నాయని అర్ధం. అయితే, దట్టమైన చీకట్లో దీపం వెలుగుతున్నట్టుగా కనుక కనిపిస్తే పెద్ద సమస్యలు, కోర్టు వివాదాలు, అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉందని అర్ధం చేసుకోవాలి.

ఇలా చేయండి

దీపో హరతి పాపాని.. దీపలక్ష్మీ నమోస్తుతే అంటుంది శాస్త్రం. కలలో కనిపించే జ్యోతి కేవలం కల కాదు, అది భగవంతుడు మనకు అందించే అభయ హస్తం. సమస్త సృష్టిలో చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగే జ్ఞానం. కలలో దీప దర్శనం కావడం అంటే మీ అంతరంగంలో భక్తిభావం పెరుగుతోందని, ఇన్నాళ్లూ మిమ్మల్ని వేధించిన మానసిక అశాంతి తొలిగిపోబోతోందని స్పష్టమవుతోంది. కాబట్టి, ఇలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి ఇష్టదైవానికి లేదా లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించుకుంటే ఆ కల యొక్క శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. నిత్యం దైవారాధనలో ఉన్న వారికి ఇలాంటి కలలు తరచుగా వస్తుంటాయి. దైవ చింతనతో గడిపేవారి జీవితం ధన్యం అవుతుందని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తుంటాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story