Drona and Drupada Story: కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఈ ఇద్దరే...లక్షల మందిని పొట్టనపెట్టుకున్న అవమానం పిశాచి
మహాభారత మహాయుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది ద్రౌపదీ వస్త్రాపహరణం, రాజ్య కాంక్ష, లేదా శకుని మాయాజూదం. కానీ, ఇవన్నీ పైకి కనిపించే కారణాలు మాత్రమే.
Drona and Drupada Story: మహాభారత మహాయుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది ద్రౌపదీ వస్త్రాపహరణం, రాజ్య కాంక్ష, లేదా శకుని మాయాజూదం. కానీ, ఇవన్నీ పైకి కనిపించే కారణాలు మాత్రమే. వీటన్నింటికీ వెనుక, కోట్ల మంది వీరుల ప్రాణాలను బలిగొన్న కురుక్షేత్ర సంగ్రామానికి అసలైన బీజం ఇద్దరు బాల్య స్నేహితుల మధ్య జరిగిన తీవ్ర అవమానాల్లోనే దాగి ఉంది. ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజుల మధ్య రేగిన పంతాలు, ప్రతీకార జ్వాలలే కాలక్రమేణా మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలుగా మారాయి. అవమానాల ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉన్నదో చెప్పేందుకు ఈ కథే ఓ నిదర్శనం
ద్రోణ...ద్రుపదుల కథ
భరద్వాజ మహర్షి కుమారుడైన ద్రోణుడు, వృషతుని కుమారుడైన ద్రుపదుడు ఒకే ఆశ్రమంలో వేదాలను, విలువిద్యను అభ్యసించారు. ఆ రోజుల్లో వారి మధ్య ఉన్న ప్రాణస్నేహం ఎంత గొప్పదంటే... తానే గనుక భవిష్యత్తులో పాంచాల దేశానికి రాజైతే, తన రాజ్యంలో సగాన్ని ద్రోణుడికి ఇస్తానని ద్రుపదుడు మాట ఇచ్చాడు. బాల్యంలో స్నేహం నిర్మలంగా, స్వచ్చంగా ఉంటుంది. కానీ, కాలం మారేకొలది స్నేహాల్లో ఇచ్చిన మాటల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దానికి ద్రుపద, ద్రోణులు విరుద్దం కాదు. ద్రుపదుడు మహారాజు అయ్యాడు, ద్రోణుడు పేదరికంలో మగ్గిపోయాడు. ఎంతగా అంటే, తన కుమారుడైన అశ్వత్థామకు కనీసం పాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితి ద్రోణుడిది. ఆకలితో ఏడుస్తున్న బిడ్డను చూసి తట్టుకోలేక, పూర్వ స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ద్రుపదుని ఆస్థానానికి వెళ్లాడు ద్రోణుడు. కానీ, సింహాసనంపై ఉన్న ద్రుపదుడు అహంకారంతో...."దారిద్రుడికి, ధనవంతుడికి స్నేహం ఎక్కడిది? రాజుతో బ్రాహ్మణుడికి మైత్రి కుదరదు" అంటూ నిండు సభలో ద్రోణుడిని అవమానించి పంపించివేశాడు. సామాన్యులమైన మనమైతే దానిని పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే తనకంటే బలవంతుడు తనని సూటిపోటి మాటలతో బాధించడం సహజమే. కానీ, ద్రోణుడు అలా అనుకొని అక్కడితో ఆగిపోలేదు.
గురుదక్షిణ... ప్రతీకార దావానలం
ఆ తీవ్ర అవమాన భారంతో ద్రోణుడు హస్తినాపురానికి చేరి, కౌరవ-పాండవులకు అస్త్ర విద్యాచార్యుడిగా మారాడు. దారిద్య్రం తీరినా, మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాల చల్లారలేదు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, తన శిష్యులైన పాండవులను, ముఖ్యంగా అర్జునుడిని ద్రుపదునిపైకి యుద్ధానికి పంపాడు. అర్జునుడు తన అసాధారణ పరాక్రమంతో ద్రుపదుడిని ఓడించి, కట్టి తెచ్చి ద్రోణుడి పాదాల ముందు పడేశాడు. అప్పుడు ద్రోణుడు, ద్రుపదుడిని వెటకరిస్తూ... పాంచాల రాజ్యంలో సగాన్ని తాను ఉంచుకుని, మిగిలిన సగ భాగాన్ని ద్రుపదుడికి భిక్షగా ఇచ్చాడు. రాజుకు ఇది ప్రాణం పోయినంత అవమానంగా అనిపించింది. ఇచ్చిన మాటను ద్రుపదుడు నిలుపుకోలేకపోయినా... ద్రోణుడు భిక్షగా ఇచ్చిన దాన్ని పుచ్చుకున్న ఆ రాజుకు ప్రాణంపోయినంత పనైంది. అవమానానికి బదులు తీర్చుకోవాలనుకున్నాడు.
యజ్ఞకుండం నుండి ఉద్భవించిన వినాశనం
క్షత్రియుడైన ద్రుపదుడు ఈ పరాభవాన్ని భరించలేకపోయాడు. ద్రోణుడిని అంతం చేసే కుమారుడు, అర్జునుడిని వరించే కుమార్తె కోసం ‘పుత్రకామేష్టి’ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండం నుంచే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ఇలా ఒకేఒక అవమానంతో మొదలైన ఈ కథ...చివరకు కురుక్షేత్రుంలో 18 అక్షౌహిణుల సైన్యం నశించడానికి కారణమైంది. యజ్ఞంలో పుట్టిన ద్రౌపది పాండవుల ఇల్లాలై కురువంశ నాశనానికి కారకురాలైంది. ద్రోణుడిని వధించడానికే జన్మించిన దృష్టద్యుమ్నుడు మహాభారతంలో పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా మారి ద్రోణాచార్యుడిని సంహరిస్తాడు.
వ్యక్తిగత అహంకారం, అవమానాలు ఒక సమాజాన్ని, దేశాన్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఈ ఇద్దరి బాల్య స్నేహితుల కథే నిదర్శనం. ద్రోణ..ద్రుపదుల మధ్య రేగిన అగ్ని, ద్రౌపది అవమానం ద్వారా మరింత పెద్దదై, చివరికి లక్షలాది మంది వీరులను కురుక్షేత్ర హోమగుండంలో పొట్టనబెట్టుకుంది. ఎక్కడైనా ఎరికైనా అవమానం జరిగితే... దానిని ప్రతీకారంగా తీసుకోకుండా...ఎదగడానికి ఓ మెట్టుగా భావించి అవమానాన్ని అవకాశంగా మార్చుకుంటే గొప్ప స్థాయికి ఎదగవచ్చు. అలా కాకుండా పరతీకారంగా మార్చుకుంటే వినాశనానికి దారితీయవచ్చు.




