Feng Shui Love Tips: మీరు సింగిల్‌గా ఉన్నారా...2026లోపు వివాహం కావాలంటే...ఫెంగ్ షూయి చెబుతున్న రహస్యాలు ఇవే
2026లోపు వివాహం కావాలనుకునే సింగిల్స్ కోసం ఫెంగ్ షూయి ప్రేమ చిట్కాలు. డబుల్ హ్యాపీనెస్ చిహ్నం, పియోనీ పూలు, వెదురు మొక్క, ఫొటోలపై ఆసక్తికరమైన సూచనల గురించి తెలుసుకుందాం.
Feng Shui Love Tips: ఇంట్లోని కొన్ని వస్తువులు, వాటిని ఉంచే ప్రదేశం కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుందని ఫెంగ్ షూయి చెబుతుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం విషయంలో కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలు, పూలు, ఫొటోలు ఇంట్లోని శక్తిని ప్రభావితం చేస్తాయని నమ్మకం. 2026 ముగిసేలోపు జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్న సింగిల్స్ కోసం ఫెంగ్ షూయి నిపుణురాలు మేరీ డైమండ్ సూచించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మనకు ఎంత బలమైన కోరిక ఉన్నా, ఆ కోరిక నెరవేరడానికి మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలని కొందరు నమ్ముతారు. ఇలాంటి ఆలోచనలకే ఫెంగ్ షూయి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రకృతి, మనిషి నివసించే ప్రదేశం మధ్య సమతుల్యత ఏర్పడితే జీవితం మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుందని ఈ పద్ధతి చెబుతుంది. ప్రేమ, వివాహం విషయానికి వస్తే ఫెంగ్ షూయిలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలకు ప్రాధాన్యం ఉంది.
‘డబుల్ హ్యాపీనెస్’ చిహ్నం
చైనీస్ సంస్కృతిలో వివాహం, ప్రేమకు సంబంధించిన ప్రముఖ చిహ్నాల్లో ‘డబుల్ హ్యాపీనెస్’ ఒకటి. ఇది 囍 అనే ఆకారంలో కనిపిస్తుంది. రెండు ఆనందాలను కలిపేలా ఉండే ఈ చిహ్నం దంపతుల మధ్య పరస్పర అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. నిపుణుల సూచన ప్రకారం, ఈ చిహ్నాన్ని బెడ్‌కి పైన ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఫ్రేమ్ లేదా పెయింటింగ్ రూపంలో కొనుగోలు చేయవచ్చు లేదా స్వయంగా గీసి ఫ్రేమ్ చేయవచ్చు. వ్యక్తిగతంగా తయారు చేసుకున్న చిహ్నానికి మరింత భావోద్వేగ అనుబంధం ఉంటుందని ఫెంగ్ షూయి నమ్మకం. అయితే చిహ్నాల విషయంలో ఆసక్తి లేని వారు మరో సులభమైన మార్గాన్ని ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రేమకు పియోనీ పూలు?
చైనీస్ సంప్రదాయంలో పియోనీ పువ్వులను ‘పూల రాణి’గా పిలుస్తారు. అందం, ప్రేమ, ఆకర్షణకు ఇవి ప్రతీకగా భావిస్తారు. ఫెంగ్ షూయి ప్రకారం పియోనీ పూలకు లక్కీతో సంబంధం ఉందని, అంటే ప్రేమను ఆకర్షించే అదృష్టాన్ని పెంచుతాయని నమ్మకం. దీనికోసం వీటిని బెడ్‌రూమ్‌లోని నైరుతి దిశలో ఉంచవచ్చని చెబుతున్నారు. నిజమైన పూలు అందుబాటులో లేకపోతే వాటి చిత్రాన్ని కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకే పువ్వు కాకుండా జతగా రెండు పియోనీ పూలను ఉంచాలని ఫెంగ్ షూయి నమ్మకం చెబుతోంది. జంటగా ఉండటం అనేది భాగస్వామ్యానికి ప్రతీకగా భావించడమే ఇందుకు కారణం.
పురుషులకు వెదురు మొక్క
పురుషుల విషయంలో పియోనీలకు బదులుగా వెదురు మొక్క లేదా దాని చిత్రాన్ని బెడ్‌రూమ్ నైరుతి మూలలో ఉంచవచ్చని మేరీ డైమండ్ సూచిస్తున్నారు. వెదురు మొక్క ఎదుగుదల, స్థిరత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. అయితే, ప్రేమ, వివాహం కోసం ఇంటిని సిద్ధం చేసుకునేటప్పుడు ఫెంగ్ షూయి చెప్పే మరో ఆసక్తికరమైన అంశం ఫొటోల గురించి. ఇంట్లో ఒంటరి వ్యక్తుల ఫొటోలు ఎక్కువగా ఉండటం భాగస్వామ్య భావనకు అనుకూలంగా ఉండకపోవచ్చని ఈ నమ్మకం చెబుతోంది. అదే విధంగా దేవదూతలు, సన్యాసులు, జీసస్, ధ్యానం చేస్తున్న బుద్ధుడి వంటి ఒంటరి ఆధ్యాత్మిక ప్రతిరూపాలను కూడా ప్రేమ, భాగస్వామ్యాన్ని ఆకర్షించాలనుకునే ప్రదేశంలో తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. అయితే లాఫింగ్ బుద్ధ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఆయన నవ్వుతున్న రూపం ఆనందం, సమృద్ధికి ప్రతీకగా భావించబడుతుంది కాబట్టి దాన్ని ఉంచడంలో సమస్య లేదని ఫెంగ్ షూయి నమ్మకాలు చెబుతున్నాయి.
ప్రేమ కోసం ఇంట్లో చేసే మార్పులు పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదన్నదే ఈ సూచనల సారాంశం. ఒక చిహ్నం, రెండు పూలు లేదా సరైన ఫొటోను ఎంచుకోవడం వంటి చిన్న మార్పులకే ఫెంగ్ షూయిలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఇవన్నీ ఫెంగ్ షూయికి సంబంధించిన విశ్వాసాలు మాత్రమే.




