Toli Ekadashi: పితృదేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే...తొలి ఏకాదశి రోజున ఇలా చేయండి
తొలి ఏకాదశి రోజున పితృదేవతలకు పేలాలపిండిని సమర్పిస్తారు. ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధించడం వలన ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుంది.
Toli Ekadashi: ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే తొలి ఏకాదశి మన సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. పితృదేవతల అనుగ్రహం పొందడానికి, వారి ఆశీస్సులతో కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధించడానికి ఈ రోజున చేసే పూజలు, దానాలు విశేష ఫలితాలను ఇస్తాయి.
తొలి ఏకాదశి ప్రాశస్త్యం ... విశేషాలు
ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజు నుంచే 4 నెలల పవిత్రమైన 'చాతుర్మాస్య దీక్ష' మొదలవుతుంది. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు క్షీరాబ్ధిలో యోగనిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే కాలం ఇది. అందుకే శరీరాన్ని, మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికి తొలి ఏకాదశి ఉపవాసం ఎంతో దోహదపడుతుంది.
పితృదేవతల ప్రీత్యర్థం... పేలాల పిండి నైవేద్యం
ఏకాదశి పర్వదినాన శ్రీమహావిష్ణువు ఆరాధనతో పాటు పితృదేవతలను స్మరించుకోవడం ముఖ్యమైన ఆచారం. ఈ రోజున సమర్పించే సమర్పించవలసిన నైవేద్యం పేలాల పిండి. వేయించిన జొన్నలు లేదా వరి పేలాలను పొడి చేసి, అందులో తగినంత బెల్లం, యాలకులు, శొంఠి, మిరియాల పొడి కలిపి తయారుచేస్తారు. ఈ పేలాల పిండిని విష్ణుమూర్తికి నివేదించి, అనంతరం పితృదేవతలను మనసారా స్మరిస్తూ నైవేద్యంగా భావించి స్వీకరిస్తారు.
ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు
పేలాల పిండిని పితృదేవతలకు ప్రియమైనదిగా భావిస్తారు. దీనిని నివేదించడం వల్ల పితృదోషాలు తొలగి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా తీసుకుంటే... రుతుమార్పుల వల్ల వచ్చే మూడు ప్రధాన సమస్యలైన కఫం, వాతం, పిత దోషాలను శొంఠి, మిరియాలు కలిపిన ఈ పిండి సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా ఉపయోగపడే ఈ పేలాల పిండిని తీసుకోవడం ఉత్తమం.
ఆచరించాల్సిన ఆధ్యాత్మిక నియమాలు
ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇక, రోజంతా ఉపవాసముండి, ఆధ్యాత్మిక చింతనతో గడపడం శ్రేష్ఠం. అంతేకాదు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల వంశాభివృద్ధి, కుటుంబంలో సౌఖ్యం లభిస్తాయి. తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీహరిని, పితృదేవతలను స్మరించి పేలాల పిండిని సమర్పించడం ద్వారా సమస్త దోషాలు తొలగి, సకల శుభాలు చేకూరుతాయి.




