Kadapa Gandi Temple: కడపలో హనుమంతుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు... ఈ క్షేత్రమే నిదర్శనం

హనుమంతుడు చిరంజీవి అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అందులో ఒకటి కడప జిల్లాలో ఉన్న గండి క్షేత్రం. ఇక్కడ స్వామివారిని భక్తితో ఆరాధించినవారికి ఆయన మహిమలు సజీవంగా కనిపిస్తాయి.

Balachander
Published on: 21 July 2026 10:09 AM IST
Kadapa Gandi Temple: కడపలో హనుమంతుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు... ఈ క్షేత్రమే నిదర్శనం
X

Kadapa Gandi Temple: రాయిగా చెక్కిన విగ్రహం నుంచి సజీవంగా రక్తం కారడం, రెండు కొండల నడుమ కనిపించీ కనిపించని దివ్య బంగారు తోరణం.. ఇవన్నీ ఏవో కల్పిత కథలు కావు, కడప జిల్లాలోని ప్రముఖ గండి క్షేత్రంలో నేటికీ ప్రత్యక్షంగా చోటుచేసుకుంటున్న నిత్య సత్యాలు! భగవంతుడు లేడని భావించే నాస్తికులకు సైతం స్వామివారి ఉనికిని చాటిచెప్పే అత్యంత అద్భుతమైన, మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఇది. వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి వారు ఇప్పటికీ సజీవంగా కొలువై ఉన్నారని విశ్వాసంతో పాటు చారిత్రక ఆధారాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడే స్వయంగా బాణంతో చెక్కిన ఈ ఆంజనేయస్వామి విగ్రహం పాదానికి చిటికెన వేలు ఉండదు. కాలక్రమంలో ఆ వేలిని చెక్కడానికి ఎవరు ప్రయత్నించినా విగ్రహం నుంచి నిజమైన రక్తం ధారగా కారడం ఇక్కడి మహత్తర విశేషం.

శ్రీరాముడి హస్తకళ ... సజీవ ప్రతిమ

రావణ సంహారం అనంతరం సీతాదేవితో కలసి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో శ్రీరాముడు వాయుదేవుడి ప్రార్థన మన్నించి ఈ క్షేత్రంలో ఆతిథ్యం స్వీకరించాడు. స్వామివారికి సహకరించిన హనుమంతుడిపై ఉన్న ప్రేమతో రామయ్య ఒక కొండ బండపై తన బాణంతో హనుమంతుడి రూపాన్ని చెక్కాడు. యోధ్యకు వెళ్లే ముహూర్తం దాటిపోతుండటంతో ఎడమ కాలి చిటికెన వేలును చెక్కడం పూర్తికాకుండానే రాముడు నిష్క్రమించాడు. అనంతర కాలంలో శిల్పులు ఆ వేలిని పూర్తి చేయాలని ఉలి పట్టుకోగా, రాతి నుండి రక్తం ధారగా కారడంతో శిల్పులు భయపడి వెనక్కు తగ్గారు.

చారిత్రక నిదర్శనం... సర్ థామస్ మన్రో

18వ శతాబ్దంలో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీ దత్తమండలాల కలెక్టర్‌గా పనిచేసిన 'సర్ థామస్ మన్రో'కు రెండు కొండల మధ్య మెరిసిపోయే దివ్య బంగారు తోరణం అదృశ్య రూపంలో దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని నాటి కడప జిల్లా రికార్డులలో ఆయన స్వయంగా నమోదు చేయడం విశేషం. హనుమంతుడు చిరంజీవి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది. విశేషమేమంటే... అటు మధుర మీనాక్షి అమ్మవారికి, ఇటు గండి క్షేత్రంలో సర్‌ థామస్‌ మన్రోకు దైవం స్వయంగా సాక్షాత్కరించింది. విదేశీయులకు ఇలా దర్శనం ఇవ్వడం ఇక్కడ విశేషం. భరతభూమి దేవతలు నడయాడే పవిత్రమైన భూమి అని చెప్పడమే దీని వెనుకనున్న ఆంతర్యం.

శ్రావణ వేడుకలు ... సజీవ దర్శనం

ఈ దివ్య క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో, ముఖ్యంగా శ్రావణ శనివారాలలో అత్యంత వైభవంగా విశేష పూజలు జరుగుతాయి. నిజమైన భక్తిప్రపత్తులతో స్వామివారిని ధ్యానించే భక్తులకు హనుమంతుడు సజీవంగా దర్శనమిచ్చి, సకల ఆపదలను తొలగిస్తాడని క్షేత్ర పురాణం చాటుతోంది. ఎవరైనా సరే కడప జిల్లా వెళ్లినపుడు తప్పకుండా చక్రాయపేట మండలంలో ఉన్న ఈ గండి క్షేత్రాన్ని దర్శించకుండా రాకండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story