Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14నా? 15నా? క్లారిటీ ఇదిగో
వినాయక చవితి 2026లో సెప్టెంబర్ 14నా, 15నా అనే సందేహం ఉంది. చవితి తిథి, పూజా సమయం, పండుగ తేదీ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Ganesh Chaturthi 2026
Ganesh Chaturthi 2026: వినాయక చవితి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సందర్భంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే 2026లో వినాయక చవితి ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో భక్తుల్లో సందేహాలు నెలకొన్నాయి.
సెప్టెంబర్ 14న వినాయక చవితి
పంచాంగ వివరాల ప్రకారం.. 2026లో భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం 7:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయం 7:44 గంటల వరకు కొనసాగుతుంది.
చతుర్థి తిథి ఎక్కువ సమయం ఉండటంతో సెప్టెంబర్ 14, 15 తేదీలపై భక్తుల్లో గందరగోళం నెలకొంది. అయితే సాధారణంగా చతుర్థి తిథి ఆధారంగా సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి ఎక్కువ మంది భక్తులు సిద్ధమవుతున్నారు.
సెప్టెంబర్ 15న పూజ చేయవచ్చా?
సెప్టెంబర్ 14న పండుగను నిర్వహించుకోలేని భక్తులు సెప్టెంబర్ 15 ఉదయం తిథి ముగిసే సమయం వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. అయితే పూజా సమయం, పండుగ తేదీ విషయంలో ప్రాంతాన్ని బట్టి పంచాంగాల్లో స్వల్పంగా తేడాలు ఉండొచ్చు. అందువల్ల స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిది.
గణపతిని ప్రతిష్ఠించి పూజలు
వినాయక చవితి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఇళ్లలో, పూజా మండపాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పలు ప్రాంతాల్లో వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత నిత్య పూజలు కొనసాగించి అనంత చతుర్దశి సందర్భంగా నిమజ్జనం చేస్తారు.
2026లో వినాయక చవితి సోమవారం రావడంతో పండుగకు మరింత ప్రత్యేకత ఏర్పడిందని భక్తులు భావిస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలోని పండుగ తేదీ, తిథి, పూజా సమయాల సమాచారం పంచాంగాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ప్రాంతాన్ని బట్టి సమయాల్లో మార్పులు ఉండవచ్చు. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.




