Ganesh Chaturthi: వినాయకచవితి స్పెషల్... చవితి పూజలో పాలవెల్లి ప్రాముఖ్యత... చంద్రుడిని దర్శిస్తే
వినాయకచవితి పూజలో పాలవెల్లి ప్రాముఖ్యత ఏమిటి? చవితి రోజున చంద్రుడిని చూస్తే అపవాదు వస్తుందా? గొడుగు, మట్టి గణపతి, అష్టద్రవ్యాల విశేషాలను తెలుసుకుందాం.
Ganesh Chaturthi: వినాయకచవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడే. గణపతి విగ్రహం ఏర్పాటు చేయడం, పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవడం, ఉండ్రాళ్లు, మోదకాలు నైవేద్యంగా పెట్టడం వంటి సంప్రదాయాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే గణపతి పూజలో కొన్ని ఆచారాల విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలున్నాయి. చవితి రోజున చంద్రుడిని చూస్తే అపవాదు వస్తుందా? పాలవెల్లిని ఎందుకు కడతారు? గొడుగు ఎందుకు పెడతారు? మట్టి గణపతినే పూజించాలా? పాత విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? వంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
చంద్రుడిని చూస్తే అపవాదు వస్తుందా?
వినాయకచవితి రోజున చంద్రుడిని చూడకూడదనే మాట చిన్నప్పటి నుంచే చాలామంది వింటుంటారు. పొరపాటున చంద్రుడిని చూసేస్తే ఏదైనా అపవాదు వస్తుందేమోనని కొందరు భయపడుతుంటారు. అయితే అలా భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. ఇక, భాద్రపద మాసంలో రాత్రివేళలు ఎక్కువగా ఉండే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆధ్యాత్మికంగా మనస్సును భగవంతుడిపై నిలిపేందుకు కొన్ని నియమాలు ఏర్పడ్డాయని ఆయన వివరిస్తున్నారు. ఈ ఆచారమే కాలక్రమంలో వినాయక వ్రత కథతో అనుసంధానమైందని చెబుతున్నారు. ఒకవేళ అనుకోకుండా చంద్రుడిని చూసినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, శమంతకోపాఖ్యానంలోని శ్లోకాన్ని చదివి, అనంతరం శిరస్సుపై అక్షింతలు వేసుకోవడం పరిహారంగా చెబుతారు.
పాలవెల్లి ఎందుకు కడతారు?
వినాయకచవితి పూజలో ప్రత్యేకంగా కనిపించే అలంకరణల్లో పాలవెల్లి ఒకటి. చాలామంది దీనిని కేవలం పూజా అలంకరణగా భావిస్తారు. కానీ దీనికి సంప్రదాయపరమైన ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెబుతున్నారు. 27 నక్షత్ర మండలాలకు పాలవెల్లి ప్రతీకగా భావిస్తారు. భాద్రపద శుక్ల చవితి సందర్భంగా గణపతి మండలం, మూషిక మండలానికి సంబంధించిన విశ్వాసాలను గుర్తు చేసుకుంటూ దీనిని ఏర్పాటు చేసే సంప్రదాయం ఉందని చెబుతున్నారు. వీలైనంత వరకు వెదురు బద్దలతో తయారు చేసిన పాలవెల్లిని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.
గణపతికి గొడుగు ఎందుకు?
వినాయకుడి పూజలో కొన్ని ప్రాంతాల్లో గొడుగును కూడా అలంకరణగా ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది పురాణాల్లో విస్తృతంగా కనిపించే అంశం కాదని, జానపద కథల్లో దీనికి సంబంధించిన కథనం ఉందని చెబుతున్నారు. ఓ భక్తురాలు ఎండ నుంచి వినాయకుడికి రక్షణ కల్పించేందుకు తన భక్తితో గొడుగు రూపాన్ని ధరించిందనే కథ ప్రచారంలో ఉంది. ఆమె భక్తికి మెచ్చిన గణనాథుడు తన శిరస్సుపై గొడుగుగా ఉండే వరం ఇచ్చాడనే విశ్వాసంతో ఈ ఆచారం కొనసాగుతున్నట్లు పండితులు చెబుతున్నారు.
పూజలో ఎనిమిది రకాల నైవేద్యాలు
గణపతి పూజలో అష్టద్రవ్యాలకు కూడా ప్రాధాన్యం ఉంది. మోదకం, అటుకులు, సత్తుపిండి, పేలాలు, చెరకుగడ, ఎండుకొబ్బరి, పండ్లు, నువ్వులు వంటి వాటిని స్వామికి సమర్పించే సంప్రదాయం ఉంది. ప్రాంతాన్ని బట్టి నైవేద్యాల్లో స్వల్ప మార్పులు కనిపించినా, గణపతికి ఇష్టమైన పదార్థాలను భక్తితో సమర్పించడమే ప్రధాన ఉద్దేశం.
పాత గణపతి విగ్రహాన్ని ఉంచుకోవచ్చా?
కొన్ని ఉత్తర భారత ప్రాంతాల్లో కొత్తగా పూజించిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచి, గత సంవత్సరం పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే పద్ధతి కనిపిస్తుంది. అయితే ఈ విధానం సాంప్రదాయబద్ధంగా సరైనది కాదని పండితులు చెబుతున్నారు. వినాయక పూజలో మూడు రూపాలకు ప్రాధాన్యం ఉంటుంది. పూజ కోసం తీసుకొచ్చిన వరసిద్ధి వినాయకుడు, పసుపుతో రూపొందించే గణపతి, మనలోనే ఉన్న ఆత్మరూప గణపతి. పూజ పూర్తయిన తర్వాత ప్రతిష్ఠించిన గణపతికి ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయడం సంప్రదాయమని చెబుతున్నారు.
మట్టి గణపతినే పూజించాలా?
ఇప్పటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి గణపతి విగ్రహాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. అయితే పురాణ కథనాల్లో గణపతి సృష్టికి సంబంధించిన వివరణలు పసుపుతో రూపొందించిన రూపంతోనూ అనుసంధానమై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
కాలక్రమంలో భారీ విగ్రహాల ఏర్పాటు, సామూహిక ఉత్సవాలు పెరిగాయి. మట్టితో గణపతిని తయారు చేసి పూజించి, అనంతరం అదే మట్టిలో కలపడం ద్వారా దేహం శాశ్వతం కాదనే భావనను గుర్తుచేసే ఆధ్యాత్మిక సందేశం కూడా ఉందని వివరిస్తున్నారు.
అందుకే వినాయకచవితి అంటే కేవలం విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించడం మాత్రమే కాదు. ప్రతి ఆచారం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే ఈ పండుగలోని అసలు ప్రత్యేకత. గణపతిని ఇంటికి ఆహ్వానించడం ఎంత ముఖ్యమో, ఆయన చెప్పే జ్ఞానం, వినయం, వివేకం, విఘ్నాలను ఎదుర్కొనే ధైర్యాన్ని జీవితంలో ఆచరించడం కూడా అంతే ముఖ్యమని పెద్దలు చెబుతారు.




