Ganesh Chaturthi: వినాయకచవితి స్పెషల్... వినాయకుడి పత్రికలో దాగున్న రహస్యాలు
వినాయకచవితి రోజున పూజలో తప్పని సరిగా 21 రకాలైన పత్రికలను వినియోగిస్తారు. ఈ 21 రకాల పత్రికలు ఏమిటి వాటి విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం.
Ganesh Chaturthi: వినాయకచవితి అంటే కొత్త మట్టి వినాయకుడి విగ్రహం, ఉండ్రాళ్లు, కుడుములు, పూజా సామగ్రి మాత్రమే చాలామందికి గుర్తొస్తాయి. కానీ గణపతి పూజలో అత్యంత ఆసక్తికరమైన సంప్రదాయాల్లో ఏకవింశతి పత్రి పూజ ఒకటి. గణపతికి 21 రకాల ఆకులను సమర్పించడం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ప్రకృతి, ఋతువులు, ఔషధ మొక్కలతో ముడిపడిన అనేక విషయాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అందుకే వినాయకచవితి రోజున పత్రి సేకరణ కూడా పూజలో ఒక ప్రత్యేక భాగంగా మారింది.
భాద్రపద శుక్లపక్ష చవితి రోజున జరుపుకునే వినాయకచవితి వర్షాకాలం నుంచి చలికాలం వైపు ప్రకృతి మారుతున్న సమయంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. పచ్చదనం ఎక్కువగా కనిపించే ఈ కాలంలో అనేక రకాల మొక్కలు, ఆకులు అందుబాటులో ఉంటాయి. వాటిని గుర్తించి పూజలో భాగం చేయడం ద్వారా ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సంప్రదాయం గుర్తుచేస్తుంది.
21 పత్రాలకు ఎందుకంత ప్రాధాన్యం?
గణపతి పూజలో 21 రకాల పత్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఒక్కో ఆకు ఒక్కో ప్రత్యేకతను సూచిస్తుందని శాస్త్ర, సంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. జ్యోతిష్యపరంగా కూడా కొన్ని పత్రాలకు గ్రహాలు, నక్షత్రాలు, రాశులతో సంబంధం ఉందని భావిస్తారు. ఆయా పత్రాలను గణపతికి సమర్పించడం ద్వారా గ్రహ సంబంధిత ప్రతికూలతలు తగ్గి శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఇక వినాయకచవితికి ముందు వచ్చే తదియ రోజున గౌరీదేవిని పూజించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన సంప్రదాయం. ఈ పూజలో 16 రకాల పత్రాలను సమర్పిస్తారు. అందులో ఉత్తరేణి ఆకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఒక్కో పత్రి.. ఒక్కో విశేషం
గణపతి పూజలో ఉపయోగించే పత్రుల్లో మాచీపత్రం లేదా దవనం ఒకటి. సంప్రదాయ ఆయుర్వేద విశ్వాసాల్లో దీనిని నరాల బలం, జీర్ణక్రియ, శ్వాస సంబంధిత సమస్యలకు ఉపయోగించే మొక్కగా పేర్కొంటారు. బృహతీ పత్రం అంటే నేలమునగ లేదా వాకుడు ఆకుకు కూడా పూజలో స్థానం ఉంది. దీనిని శ్వాసకోశానికి సంబంధించిన సమస్యల విషయంలో సంప్రదాయ వైద్యంలో ఉపయోగించినట్లు చెబుతారు. బిల్వపత్రం లేదా మారేడు దళం అంటే శివారాధనలో ముందుగా గుర్తొచ్చే ఆకు ఇది. గణపతి పూజలోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. మారేడు వృక్షాన్ని లక్ష్మీదేవి తపస్సుతో అనుసంధానించే పురాణ విశ్వాసం కూడా ఉంది.
దూర్వా యుగ్మం అంటే గరిక. గణపతికి అత్యంత ఇష్టమైన పత్రిగా భక్తులు భావిస్తారు. అందుకే గరిక లేకుండా వినాయక పూజను ఊహించడం చాలా మందికి సాధ్యం కాదు. అదేవిధంగా దత్తూర పత్రం లేదా ఉమ్మెత్త, బదరీపత్రం లేదా రేగి ఆకు, అపామార్గం లేదా ఉత్తరేణి, తులసి, మామిడి ఆకులు కూడా పూజలో ఉపయోగిస్తారు. వీటిలో ప్రతి మొక్కకు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఔషధ, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
కరవీర పత్రం లేదా గన్నేరు, విష్ణుక్రాంత, దాడిమి లేదా దానిమ్మ ఆకు, మరువకం, వావిలాకు, జాజి ఆకు, సీతాఫలం ఆకు, శమీపత్రం, అశ్వత్థం లేదా రావి ఆకు, అర్జున పత్రం, ఆర్కపత్రం లేదా జిల్లేడు వంటి పత్రాలు కూడా గణపతి పూజలో మనకు నిపిస్తాయి. వీటిలో కొన్ని మొక్కలను సంప్రదాయ వైద్యంలో వివిధ అవసరాలకు ఉపయోగించినప్పటికీ, వాటిని స్వయంగా ఔషధంగా తీసుకోవడం మాత్రం వైద్యుల సలహా లేకుండా చేయకూడదు. పూజలో పత్రులను సమర్పించడం ప్రధానంగా ఆధ్యాత్మిక సంప్రదాయం.
ప్రకృతిని పూజించే పండుగ
వినాయకచవితిలో దాగి ఉన్న అసలు ఆసక్తికరమైన విషయం ఇదే. ఒక దేవుడిని పూజించే సందర్భంలో 21 రకాల ఆకులను సేకరించి, వాటి పేర్లు తెలుసుకుని, ఒక్కో మొక్కను గుర్తించడం ద్వారా మనిషిని ప్రకృతికి దగ్గర చేసే సంప్రదాయంగా పత్రి పూజను చూడవచ్చు. అందుకే వినాయకచవితి కేవలం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించే పండుగ మాత్రమే కాదు. మొక్కను, ఆకును, ప్రకృతిని కూడా దైవ స్వరూపంగా చూసే భారతీయ సంస్కృతికి ఇది ఒక అద్భుతమైన ప్రతీక. గణపతికి సమర్పించే ప్రతి పత్రి వెనుక ఒక కథ, ఒక విశ్వాసం, ఒక సంప్రదాయం దాగి ఉండటమే ఈ పండుగ ప్రత్యేకత.




