Garuda Purana Sacred Baths: గరుడపురాణం చెప్పినట్టు ఇలా స్నానం చేస్తే... మృత్యువు కూడా భయపడుతుంది
గరుడపురాణంలో చెప్పిన ఈ స్నానాలు ఆచరిస్తే... మృత్యువు నుంచి నరకయాతన నుంచి సులభంగా బయటపడోచ్చు.
Garuda Purana Sacred Baths: మన సనాతన ధర్మంలో స్నానం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, అది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక పవిత్ర ప్రక్రియ. గరుడ పురాణం ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నీటితో పనిలేకుండానే మనం స్నాన ఫలితాన్ని పొందవచ్చు. ఇలా చేసే స్నానం పుణ్యనదుల్లో చేసిన ఫలితాన్ని కూడా ఇస్తుందని పురాణం చెబుతోంది. గరుడపురాణం పేర్కొన్న ఆరు రకాలైన స్నానాల్లో గోధూళి స్నానం ద్వారా నరకయాతనల నుంచి విముక్తి పొందవచ్చని అంటారు.
నీటితో పనిలేకుండానే పుణ్య స్నానం ఎలా?
అనారోగ్యం వల్లనో లేదా ఇతర అనివార్య కారణాల వల్లనో తలారా స్నానం చేయలేనప్పుడు, మన మహర్షులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. అందులో ఒకటి బ్రహ్మస్నానం. అంటే పాత్రలో నీరు తీసుకొని అందులో దర్భలను ఉంచి, ఆ నీటిని తలపై చల్లుకుంటే అది 'బ్రహ్మ స్నానం' అవుతుంది. ఇది పురుషులకు అత్యంత శ్రేష్ఠం. ఇక రెండోది భస్మస్నానం. స్వచ్ఛమైన గోమయం మండించగా వచ్చిన విభూతిని శిరస్సుపై ధరిస్తే, అది స్నానంతో సమానమైన పవిత్రతను ఇస్తుంది. మూడోది దివ్యస్నానం. సూర్యోదయం అయిన రెండు గంటల లోపు సూర్య కిరణాల కింద నిలబడి, సూర్య భగవానుడి ద్వాదశ నామాలను స్మరిస్తే దానిని 'దివ్య స్నానం' అంటారు. నాలుగోది యోగిక స్నానం. కదలలేని స్థితిలో ఉన్నవారు మనస్ఫూర్తిగా "నారాయణ.. నారాయణ" అని నామస్మరణ చేస్తే, అది వారి అంతరాత్మను శుద్ధి చేసి స్నాన ఫలితాన్ని ఇస్తుంది.
గోధూళి స్నానం - తలరాతను మార్చే శక్తి
గరుడపురాణం చెప్పిన విధంగా అత్యంత శక్తివంతమైన స్నానం "గోధూళి స్నానం" లేదా "వాయవ్య స్నానం". ఆవులు నడుస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి ఎగిరే ధూళి మన శరీరంపై పడితే, అది కోటి పుణ్య నదుల స్నానంతో సమానం. గరుడ పురాణంలోని కథ ప్రకారం, నరకాసురుడు తన పాపకర్మల వల్ల నరకంలో యాతన అనుభవిస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడి సూచన మేరకు భూదేవి బృందావనంలోని ఆవుల గిట్టల మట్టిని తెచ్చి అతనిపై చల్లుతుంది. ఆ మట్టి స్పర్శ తగలగానే నరకాసురుడి 'యాతన శరీరం' పోయి 'దివ్య శరీరం' ప్రాప్తించి స్వర్గానికి చేరుకుంటాడు. నరకాసురుడు అనుభవించిన యాతననే మనం నరకయాతన అంటాం. మనం కూడా ఈ నరకయాతన నుంచి బయటపడాలంటే గోధూళి స్నానం ఒక్కటే సులువైన మార్గం.
వైజ్ఞానిక - ఆధ్యాత్మిక విశేషం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆవు పాలు, గోమయం, గోమూత్రంలో గంగా, యమునా, నర్మదా నదుల శక్తి దాగి ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆవు పాలు కలుపుకుంటే గంగా స్నాన ఫలితం, ఆవు పేడ నీరు కలిపితే యమునా నది ఫలితం లభిస్తాయి. భౌతిక స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే, గరుడ పురాణం చెప్పిన ఈ 'మానసిక, ఆధ్యాత్మిక స్నానాలు' మన కర్మ దోషాలను తొలగిస్తాయి. మృత్యువుకు సైతం భయం కలిగించేలా మనలో ప్రాణశక్తిని పెంచే ఈ సంప్రదాయాలను పాటించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.




