Garuda Purana Hell Secrets: గరుడపురాణం చెప్పిన నరకం రహస్యం... భయాన్ని కలిగించే ఊహించని శిక్షలు

గరుడపురాణం ప్రకారం యమలోకంలో మొత్తం 4 లక్షలకు పైగా నరకాలు ఉండగా అందులో 28 అత్యంత భయంకరంగా ఉంటాయి.

Balachander
Published on: 18 May 2026 8:27 AM IST
Garuda Purana Hell Secrets: గరుడపురాణం చెప్పిన నరకం రహస్యం... భయాన్ని కలిగించే ఊహించని శిక్షలు
X

Garuda Purana Hell Secrets: మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. మానవ జన్మ అత్యంత అరుదుగా లభిస్తుంది. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తిన తరువాత లభించే మానవ జన్మను సార్థకం చేసుకోవాలని అంటారు. అయితే, తెలిసి తెలియక మనం చేసే పాప పుణ్యాలే మన మరణానంతర జీవితాన్ని నిర్ణయిస్తాయని గరుడపురాణం స్పష్టం చేస్తోంది. విశ్వాసాల ప్రకారం యమలోకంలో మొత్తం 4,000,000 నరకాలు ఉండగా, వాటిలో అత్యంత భయంకరమైన నరకాలు 28 ఉన్నట్టుగా చెబుతారు. ఈ 28 రకాలైన నరకాల్లో శిక్షలు కూడా అంతే భయంకరంగా, ఊహించని విధంగా ఉంటాయట.

కర్మఫలం అంటే ఏమిటి?

మనం నోటితో పలికే చెడు మాటలు, మనసుతో తలచే కుతంత్రాలు, శరీరంతో చేసే దుశ్చర్యలు.. ఇలా ప్రతి ఒక్క దానికి విడివిడిగా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. సత్కర్మలు చేసిన వారికి ఉత్తమ లోకాలు లభిస్తాయి. కానీ, అధర్మ మార్గంలో నడిచిన వారికి నరకయాతన తప్పదు.

ప్రధాన నరకాలు – వాటి వెనుక ఉన్న కఠిన శిక్షలు

గరుడపురాణం ప్రకారం సమాజంలో బతుకుతూ ఇతరులకు అన్యాయం చేసే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. వేరొకరి భార్యను ఆశించడం, మోసంతో పరుల ఆస్తులను దొంగిలించడం వంటి పనులు చేసేవారిని యమదూతలు చెవుల నుండి రక్తం వచ్చేలా ముళ్ళతో ఘోరంగా హింసిస్తారు. దీనినే తామిస్ర నరకం అని పిలుస్తారు. పవిత్రమైన బంధంలో ఉంటూ ఒకరినొకరు వంచించుకునే వారిని కటిక చీకటి నిండిన నరకకూపంలో పడేస్తారు. దీనిని అంధతామిస్ర నరకం అని పిలుస్తారు. ఇతరుల సంసారాలను ముక్కలు చేసి, స్వార్థం కోసం వేరే కుటుంబాలను హింసించే వారికి ఈ నరకాలలో 'గురు' అనే వికారమైన కౄర మృగాలు, పదునైన ముళ్ళు గుచ్చుతూ రక్తం త్రాగుతాయి. దీనినే రౌరవం, మహారౌరవ నరకం అని చెబుతారు.

కేవలం జిహ్వచాపల్యం కోసం నోరు లేని మూగజీవులను చంపి తినే పాపులను యమలోకంలో మరుగుతున్న నూనె కుండలలో వేసి వేయిస్తారు. ఇలాంటి నరకమే కుంభీపాకం. కన్నవారిని, వృద్ధులను అన్నపానీయాలు లేకుండా ఏడిపించే వారికి, వారు భూమిపై ఏ విధంగానైతే పెద్దలను హింసించారో, అదే రీతిలో ఇక్కడ నరకయాతన ఉంటుంది. ఈ నరకయాతన కలిగిన నరకాన్ని కాలసూత్రం అని చెబుతారు. దైవదూషణ చేసేవారిని దయ్యాలు వేధిస్తాయి. అధికారం అండతో పేదల భూములను, వస్తువులను లాక్కునే వారిని ఎర్రగా కాలిన ఇనుప స్తంభాలకు కట్టేసి అగ్నిలో తోసేస్తారు. ఇలాంటి శిక్షలు విధించే నరకం పేరు అసిపత్రం, అగ్నిగుండం. సక్రమమైన మార్గాన్ని విడిచి బతికేవారిని చీము, నెత్తురు, మలమూత్రాలతో నిండిన వైతరిణి నదిలోకి నెట్టి, అక్కడి కీటకాలతో కుట్టిస్తారు. దీనినే వైతరిణి నరకం అని చెబుతారు. దీనిని దాటటం చాలా కష్టం. కోర్టుల్లో లేదా సమాజంలో నిజాలు దాచి, తప్పుడు సాక్ష్యాలు చెప్పి అవతలి వారి జీవితాలను నాశనం చేసేవారిని ఎత్తైన ప్రదేశాల నుండి నీటి గుండాల్లోకి విసిరేసి శిక్షిస్తారు. ఇటువంటి నరకానికి అవీచి నరకమని పేరు.

గరుడపురాణం చెప్పే ఈ నరకాల కథలు కేవలం భయపెట్టడానికే కాదు. మనిషి ధర్మమార్గంలో నడవాలని, పాపాలకు దూరంగా ఉండాలని గుర్తు చేసే ఆధ్యాత్మిక బోధనగా భావించాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు మనిషిని పుణ్యమార్గంలో నడిపిస్తాయని ఈ పురాణ సందేశం చెబుతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story