Lakshmi Narasimha Swamy Temple: ఇల్లు లేనివారికి వరాలిస్తున్న గీసుకొండ నరసింహస్వామి
వరంగల్ జిల్లాలో కొలువైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, రైతుల పాలిటి కల్పవల్లిగా మాత్రమే కాకుండా, ఇల్లు లేని వారికి గృహ యోగాన్ని ప్రసాదించే శక్తిమంతమైన దైవంగా ప్రసిద్ధి చెందారు.
Lakshmi Narasimha Swamy Temple: వరంగల్ జిల్లాలో కొలువైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, రైతుల పాలిటి కల్పవల్లిగా మాత్రమే కాకుండా, ఇల్లు లేని వారికి గృహ యోగాన్ని ప్రసాదించే శక్తిమంతమైన దైవంగా ప్రసిద్ధి చెందారు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని స్థానిక భక్తులు గాఢంగా నమ్ముతారు. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య కొండపై వెలసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది.
రైతు బిడ్డగా వెలసిన స్వామి - అద్భుత క్షేత్ర పురాణం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో ఈ అద్భుత క్షేత్రం ఉంది. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఉన్న కథ అత్యంత ఆసక్తికరం. కొన్ని వందల ఏళ్ల క్రితం, ఒక రైతు పొలంలో పనివాళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, నరసింహ స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి రాత్రికి రాత్రే పంట కోత పూర్తి చేశారు. ప్రతిఫలంగా ఆ బాలుడు ఒక కట్టను తీసుకుని వెళ్తుంటే, పొలంలోని పంట అంతా ఆ బాలుడి వెంటే కదిలిందట! బాలుడు గుట్టపై అదృశ్యమయ్యాక, రైతుకు కలలో కనిపించి తాను 'నరసింహ స్వామి'నని, తనకు పూజలు చేయమని వెల్లడించారు. అందుకే నేటికీ ఈ ప్రాంత అన్నదాతలు తమ మొదటి పంటను స్వామికి సమర్పించిన తర్వాతే మార్కెట్‌కు తీసుకెళ్తారు. ఈ సంప్రదాయం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. స్వామికి మొదటి పంటను సమర్పిస్తే... పంట నష్టాల నుంచి బయటపడొచ్చని అంటారు.
సొంత ఇంటి కల - ముడుపుల మహిమ
ఈ క్షేత్రానికి ఉన్న మరో విశేషం 'గృహ యోగం'. సొంత ఇల్లు కట్టుకోవాలని తపించేవారు, ఇళ్ల స్థలాల వివాదాల్లో ఉన్నవారు ఇక్కడ స్వామిని దర్శించుకుని, గుట్టపై చిన్న చిన్న రాళ్లతో ఇళ్ల లాంటి ఆకృతులు కట్టి, మనస్ఫూర్తిగా ముడుపు కడితే.. త్వరలోనే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందరో భక్తులకు ఇది అనుభవపూర్వకం. మనస్ఫూర్తిగా ముడుపు కడితే ఏడాది తిరిగేలోగా సొంతింటి కల నెరవేరుతుందని అంటారు.
రాత్రి వేళ కల్యాణం.. ఎందుకు?
సాధారణంగా ఆలయాల్లో ఉదయం పూట కల్యాణాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రతి ఏకాదశి రాత్రి 10 గంటల తర్వాత కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక మానవీయ కోణం ఉంది. పగలంతా పొలం పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలు, తమ పనులు ముగించుకుని ప్రశాంతంగా స్వామి వారి వివాహ వేడుకను చూడాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రాత్రి 10 తరువాత నిర్వహించే ఈ కల్యాణాన్ని తిలకించేందుకు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు తరలివస్తారని చెబుతారు.
ఇక హోలీ పౌర్ణమి సమయంలో ఐదు రోజులపాటు అద్భుతంగా జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర సమయంలో పెద్ద సంఖ్యలో ప్రభలు తరలి వస్తాయి. రంగు రంగుల ప్రభలను కట్టి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. వరంగల్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని బస్సులు లేదా ఇతర వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. పూర్వం పాండవులు, ఆ తరువాత రాణి రుద్రమదేవి వంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చెబుతారు. ఈ క్షేత్రం నేడు వేలాది మంది భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. మీకూ సొంత ఇంటి కల ఉంటే, ఒక్కసారి కొమ్మాల స్వామిని దర్శించి ముడుపు కట్టి చూడండి!




