Ghost Month 2026: ఆగస్టులో భూమి మీదకు ఆత్మలు... 15వ రోజు అద్భుతమైన జాతర

ఆసియా ఖండంలోని కొన్ని దేశాలు ఆగస్టు నెలలో విచిత్రమైన సంప్రదాయాలను పాటిస్తాయి. ఈ ఆగస్టులో ఆత్మలు భూమి మీదకు వస్తాయని, వాటికోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

Balachander
Published on: 8 Aug 2026 10:29 AM IST
Ghost Month 2026: ఆగస్టులో భూమి మీదకు ఆత్మలు... 15వ రోజు అద్భుతమైన జాతర
X

Ghost Month 2026: ఆసియా ఖండంలోని చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, వియత్నాం వంటి దేశాలలో ప్రతి ఏటా ఆగస్టు మాసంలో అత్యంత విచిత్రమైన, ఆధ్యాత్మికమైన సంప్రదాయం వెల్లివిరుస్తుంది. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన చైనీస్ లూనార్ క్యాలెండర్ ప్రకారం ఏడో నెలను 'ఘోస్ట్ మంత్' లేదా 'ఆత్మల మాసం' అని పిలుస్తారు. ఈ సమయంలో పాతాళ లోకానికి, భూలోకానికి మధ్య ఉన్న ద్వారాలు తెరుచుకుని, పూర్వీకుల ఆత్మలతో పాటు దిక్కులేని ఆకలి ఆత్మలు భూమిపైకి స్వేచ్ఛగా వస్తాయని అక్కడి ప్రజల బలమైన విశ్వాసం.

'ఘోస్ట్ మంత్' ముఖ్యమైన తేదీలు

ఈ సంప్రదాయం చైనీస్ చంద్రమాన క్యాలెండర్ ఆధారంగా సాగుతుంది. 2026 సంవత్సరంలో ఈ ఘోస్ట్‌ మంత్‌ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. 2026 ఆగస్టు 13వ తేదీన ఈ మాసం ప్రారంభం అవుతంఉది. చైనీస్‌ క్యాలెండర్ ప్రకారం లూనార్‌ మాసం మొదటిరోజున అంటే ఆగస్టు 13వ తేదీన పాతాళలోక ద్వారాలు తెరుచుకుంటాయి. అదేవిధంగా ఆగస్టు 27వ తేదీన హంగ్రీ ఘోస్ట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. దీనినే జోంగ్యువాన్‌ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు. ఆరోజున ఆత్మలకు విశేషమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక ఈ ఏడో లూనార్‌ మాసం సెప్టెంబర్‌ 10తో ముగుస్తుంది. ముగింపు సమయంలో పాతాళ లోక ద్వారాలు మూసివేయబడతాయని, ఆ సమయంలో ఆత్మలు తమ లోకాలకు వెళ్లిపోతాయని నమ్ముతారు.

పౌరాణిక నేపథ్యం ... బౌద్ధ, తాంత్రిక మూలాలు

ఈ ఆచారం వెనుక బౌద్ధ, త్యావోయిస్ట్ ధార్మిక కథలు ఉన్నాయి. గౌతమ బుద్ధుని ప్రియ శిష్యుడైన మూలియన్ తన దివ్యదృష్టితో చూసినప్పుడు, మరణించిన తన తల్లి ఆకలి ఆత్మగా అలమటించడం గమనించాడు. బుద్ధుని ఉపదేశం మేరకు ఏడో నెల 15వ రోజున భిక్షువులకు, ఆత్మలకు అన్నదానం చేసి తన తల్లిని కష్టాల నుంచి విముక్తి చేశాడు. ఇదే బౌద్ధంలో ఉల్లంబన ఫెస్టివల్‌గా మారింది. త్యావోయిజం ప్రకారం పాతాళ లోకాధిపతి ఈ మాసంలో ఆత్మల పాపాలను క్షమించి భూమిపైకి పంపుతాడని నమ్ముతారు.

ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు

ఈ కాలంలో ఆత్మల సంచారం ఎక్కువగా ఉంటుందని భావించి కొన్ని నియమాలను పాటిస్తారు. వివాహాలు, నిశ్చితార్థాలు చేసుకోవడం, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం నిషిద్ధం. రాత్రి వేళల్లో ఈత కొట్టడం, ఈలలు వేయడం చేయరు. అదేవిధంగా, ఇంటి ముందు వీధుల్లో పూర్వీకులకు, అనాథ ఆత్మలకు ఆహారం, ధూపం సమర్పిస్తారు. 'జోస్ పేపర్' కాల్చి వారికి నివేదిస్తారు. ఈ సంప్రదాయం కేవలం భయంతో కూడుకున్నది కాదు... మరణించిన పూర్వీకులను స్మరించుకోవడం, దిక్కులేని ఆత్మల పట్ల కరుణ చూపించడం ఈ పవిత్ర మాసం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అంతరార్థం. వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడి వారు పాటించే ఈ ఆచారం ఎంతో గొప్పదని చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story