Srikalahasti: శ్రీకాళహస్తిని కాపాడిన జ్ఞాన ప్రసూనాంబ... అమ్మను ఇలా దర్శించుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది
నమ్మి కొలిస్తే అమ్మవారు తప్పక కాపాడతాడు అని చెప్పడానికి శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబనే సాక్ష్యం. రాజ్యాన్ని కాపాడేందుకు స్వయంగా తానే దిగివచ్చి తన చీరను అడ్డుగా పెడుతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఆలయ శాసనాల్లో భద్రంగా ఉన్నాయి.
Srikalahasti: భక్తుడు నమ్మి కొలిస్తే ఆపద ఎంతటిదైనా, శత్రువు ఎంతటి బలశాలి అయినా సరే ఆ పరమాత్ముడు రెప్పపాటులో రక్షిస్తాడనేది జగమెరిగిన సత్యం. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో సాలీడు, పాము, ఏనుగు భక్తికి మెచ్చి మోక్షమిచ్చిన పరమశివుని లీలలు మనకు తెలుసు. కానీ, శతృరాజుల ఆధునిక తుపాకీ గుళ్లు, ఫిరంగుల నుండి సాక్షాత్తూ తన పవిట చెంగును అడ్డం పెట్టి కాళహస్తి రాజ్యాన్ని, సైన్యాన్ని కాపాడిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్య మహిమ గురించి మీకు తెలుసా? ఇది ఏదో కల్పిత కథ కాదు... చరిత్రకు సాక్ష్యంగా నేటికీ శ్రీకాళహస్తి ఆలయ రాతి శాసనాలలో లిఖించబడిన అద్భుతమైన యథార్థ సంఘటన! ఈ లీలకు కృతజ్ఞతగా రాజు సమర్పించిన బంగారు చీరను ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి అలంకరిస్తారు. ఆ రోజున అమ్మను దర్శించుకుంటే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయని భక్తుల నమ్మకం.
ఊహించని దండయాత్ర
పూర్వం ఒకానొక కాలంలో శ్రీకాళహస్తి రాజ్యంపై పొరుగుదేశపు రాజు అత్యంత భారీ సైన్యంతో హఠాత్తుగా దండెత్తాడు. ఆ శతృరాజు వద్ద కత్తులు, ఈటెలే కాకుండా ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన ఫిరంగులు కూడా ఉన్నాయి. కాళహస్తి రాజు వద్ద ఉన్నది చాలా కొద్దిపాటి సైన్యం మాత్రమే. పైగా యుద్ధానికి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేవు. శతృవుల ఆయుధాల ముందు తమ కత్తులు నిలవవని, ఓటమి ఖాయమని అందరికీ అర్థమైపోయింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కాళహస్తి రాజు తన కులదైవమైన జ్ఞానప్రసూనాంబ అమ్మవారి పాదాల చెంత చేరి, రాజ్యాన్ని కాపాడమని కన్నీళ్లతో ప్రార్థించాడు.
సమరక్షేత్రంలో అద్భుతం.. అమ్మవారి కలలోని రహస్యం!
యుద్ధరంగానికి వెన్నుచూపడం రాజధర్మం కాదు కాబట్టి, రాజు తన స్వల్ప సైన్యంతోనే శతృవులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రణరంగంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాళహస్తి రాజే అఖండ విజయం సాధించాడు. శతృవుల తుపాకులు ఏవీ కాళహస్తి సైన్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ అనూహ్య విజయానికి కారణం తెలియక రాజు ఆ రాత్రి నిద్రపోతుండగా, అమ్మవారు అతని కలలో ప్రత్యక్షమైంది. "రాజా! నాకు ఒక నూతన వస్త్రాన్ని సమర్పించు" అని అడిగింది. సృష్టికే వస్త్రాలను ప్రసాదించే జగన్మాత తనను చీర అడగడం ఏమిటని రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అమ్మవారు తన పవిట చెంగును చూపిస్తూ.. "యుద్ధంలో శతృవులు కురిపించిన తుపాకీ గుళ్లు నీకు, నీ సైన్యానికి తగలకుండా నా పవిట చెంగును అడ్డం పెట్టాను. అందుకే నా చీర అంతా గుళ్ల దెబ్బలతో చిరిగిపోయింది" అని సెలవిచ్చింది.
రాతి శాసనాల సాక్ష్యం ... సువర్ణ వస్త్ర సేవ
నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన కాళహస్తి రాజు కళ్లవెంట ఆనందబాష్పాలు కారాయి. వెంటనే ఆ మహారాజు మందిమార్బలంతో ఆలయానికి తరలివెళ్లి, అమ్మవారికి కృతజ్ఞతగా అపరంజి బంగారంతో చేసిన బంగారు చీరను కానుకగా సమర్పించాడు. ఈ అద్భుత ఘట్టానికి నిదర్శనమైన చారిత్రక ఆధారాలు ఆలయంలోని రాతి శాసనంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. ఈ చారిత్రక సంప్రదాయాన్ని పురస్కరించుకుని, ఆలయ అర్చకులు ప్రతి వారం శుక్రవారం నాడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి ఈ దివ్యమైన బంగారు చీరను అలంకరిస్తారు. బంగారు వర్ణంలో ధగధగమెరిసిపోయే ఆ తల్లి స్వరూపాన్ని వీక్షించడానికి ప్రతి శుక్రవారం దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. గ్రహదోషాలతో, శత్రుపీడలతో బాధపడేవారు ఈ సువర్ణ వస్త్రాలంకృత రూపాన్ని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. నిత్యం అమ్మవారిని వేలాదిమందిభక్తులు దర్శించుకుంటారు. అయితే, శుక్రవారం రోజున అమ్మను దర్శించుకుంటే అన్ని కష్టాల నుంచి కూడా కాపాడుతుందని నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.




