God's Blessings: ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు... ఇలా ఉంటేనే భగవంతుని దర్శనం

ప్రపంచంలో అత్యంత విలువైనది సంపద కాదు.. భగవంతుడే అని తెలిపే అద్భుతమైన ఆధ్యాత్మిక కథ ఇది. ఐదేళ్ల చిన్నారి చూపిన మార్గం ద్వారా భగవద్దర్శన రహస్యాన్ని తెలుసుకుందాం.

Balachander
Published on: 22 Aug 2026 9:02 AM IST
Gods Blessings: ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు... ఇలా ఉంటేనే భగవంతుని దర్శనం
X

God's Blessings: ఈ మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏవో ఒక వస్తువుల కోసం, ప్రాపంచిక హోదాల కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. ఒక కోరిక తీరగానే మరొక దాని కోసం తాపత్రయపడటం మనిషి నైజంగా మారింది. కానీ, మనలోనే ఉంటూ సమస్త విశ్వాన్ని నడిపించే భగవంతుడి కంటే అత్యంత విలువైనది మరొకటి లేదనే పరమ సత్యాన్ని మనం మరచిపోతున్నాం. ఈ ఆంతరికాన్ని వివరించే అద్భుతమైన కథ ఒకటి ఉంది.

సారంగధరుడి కోట .... రాజ ఆదేశం

పూర్వం సారంగధరుడు అనే మహారాజు తన ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన రాజ్యంలో ఒక విచిత్రమైన దండోరా వేయించాడు. రేపు ఉదయం కోట ప్రధాన ద్వారాలు తెరుచుకుంటాయి. లోపలికి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్న ఏ వస్తువును తాకితే ఆ వస్తువు ఉచితంగా వారికే చెందుతుంది అని ప్రకటించాడు. ఈ ప్రకటన వినగానే రాజ్యంలోని ప్రజలంతా రాత్రికి రాత్రే కోట తలుపుల ముందుకు చేరుకున్నారు. తెల్లవారగానే తలుపులు తెరుచుకున్నాయి. కోట నిండా బంగారం, రత్నాలు, విలువైన వస్త్రాలు, రాశిగా పోసిన అపూర్వమైన ఆభరణాలు ఉన్నాయి. లోపలికి వెళ్లిన ప్రజలంతా చిన్న వస్తువు పట్టుకుంటే పెద్దది దొరకదేమో, పెద్ద వస్తువు వైపు వెళ్తే అంతకంటే విలువైనది మిగిలిపోతుందేమోనని ఆశతో అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు.

ఐదేళ్ల పాప చూపిన దివ్యమైన మార్గం

రాజు సారంగధరుడు తన సింహాసనంపై కూర్చుని ప్రజల ఆశలను, పరుగులను చూస్తూ చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. ఆ సమయంలో ఐదేళ్ల చిన్నారి ఆ కోటలోని ఏ విలువైన ఆభరణాన్ని, రత్నాన్ని తాకకుండా నేరుగా రాజు ఉన్న సింహాసనం వైపు నడిచింది. ఆ పాప అమాయకంగా వెళ్లి స్వయంగా రాజుగారిని తాకింది. వెంటనే రాజు నవ్వి, "ఈ పాప నన్ను తాకింది కాబట్టి, రాజ నియమం ప్రకారం నేను, నా రాజ్యంతో పాటు ఈ కోటలోని సమస్త సంపదలు ఈ పాపకే చెందుతాయి" అని ప్రకటించాడు.

ఆధ్యాత్మిక అన్వయం ... భగవద్దర్శన రహస్యం

ఈ కథలోని రాజు భగవంతుడికి, కోటలోని సంపదలు ప్రాపంచిక సుఖాలకు సంకేతం. భగవంతుడు మనకు ఈ ప్రపంచంలో అనేక భోగభాగ్యాలను అందుబాటులో ఉంచాడు. కానీ మనం ఆ వస్తువుల వెనుక పడి సృష్టికర్తయైన దేవుడిని మరిచిపోతున్నాం. ఆ ఐదేళ్ల పాప నేరుగా రాజును తాకినట్లుగా, మనం కూడా సంపదల వైపు కాకుండా నేరుగా భగవంతుడిని పట్టుకోవాలి. చిన్నపిల్లలు తల్లిని పట్టుకున్నంత సేపూ సురక్షితంగా ఉన్నట్లే, మనం కూడా భగవంతుడి నామాన్ని, చరణాలను గట్టిగా పట్టుకుంటే ఆయన సృష్టించిన సుఖ శాంతులు, ఐశ్వర్యాలు అన్నీ మనకు అనుగ్రహంగా లభిస్తాయి. సమస్యలను చూసి కుంగిపోకుండా, సకల సమస్యలకు పరిష్కారమైన పరమాత్మను చేరుకోవడమే మానవ జన్మకు సార్థకత.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story