Moral Story: సాధువుల పట్ల మనిషి ప్రవర్తన దురుసుగా ఉంటే... ఈ వ్యాపారి కథే నిదర్శనం

వ్యాపారంలో లాభం ఉండాలి కానీ, అది తోటి మనిషిని లేదా దైవ స్వరూపులైన సాధువులను అవమానించేలా ఉండకూడదు. అతిగా ఆశపడితే ఉన్నది కాస్తా ఊడిపోతుందని నిరూపించే ఒక చక్కని ఆధ్యాత్మిక కథ ఇది.

Balachander
Published on: 1 May 2026 12:51 PM IST
Moral Story: సాధువుల పట్ల మనిషి ప్రవర్తన దురుసుగా ఉంటే... ఈ వ్యాపారి కథే నిదర్శనం
X

Moral Story: వ్యాపారంలో లాభం ఉండాలి కానీ, అది తోటి మనిషిని లేదా దైవ స్వరూపులైన సాధువులను అవమానించేలా ఉండకూడదు. అతిగా ఆశపడితే ఉన్నది కాస్తా ఊడిపోతుందని నిరూపించే ఒక చక్కని ఆధ్యాత్మిక కథ ఇది. మనం చేసే ఏ పనైనా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఏమీ ఆశించని సాధువులను, నిరుపేదలను కించపరిస్తే ఆ దైవం మనల్ని ఎలా హెచ్చరిస్తాడో ఈ చిన్న ఉదాహరణ చదివితే అర్థమవుతుంది. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఒక ప్రసిద్ధ హనుమాన్ ఆలయం ఉంది. ప్రతి ఏటా అక్కడ జరిగే జాతర ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఆ జాతరలో ఒక మిఠాయి వ్యాపారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దుకాణం తెరిచాడు.

అవమానం - అహంకారం

ఒక సాధువు ఆ దుకాణం వద్దకు వచ్చి, తన వద్ద ఉన్న 25 పైసల నాణెం ఇచ్చి కొన్ని పేడాలు అడిగాడు. ఆ కాలంలో పావు కిలో పేడాల ధర 12 అణాలు అంటే ఇప్పటి రోజుల్లో 75 పైసలన్నమాట. 25 పైసలు అంటే నాలుగు అణాలు. నాలుగు అణాలకు పేడాలు అడిగితే లేదని చెప్పడమే కాకుండా, ఆ నాణేన్ని విసిరి కొడతాడు. అక్కడితో ఆగకుండా సాధువును దూషిస్తాడు. దేవుడు కరుణిస్తాడని చెప్పినా వినలేదు సరికదా...దేవుడిని కూడా దూషిస్తాడు. వ్యాపారి చేష్టలను చూసి... సాధువు శాంతంగా చిరునవ్వు చిందిస్తూ వెళ్లి దూరంగా ఒక బండరాయిపై కూర్చున్నాడు.

దురాశ తెచ్చిన చేటు

ఆ రోజంతా వ్యాపారం బాగానే సాగింది. సాయంత్రానికి వ్యాపారి వద్ద 490 రూపాయలు జమయ్యాయి. అయితే, "మరో 10 రూపాయలు వస్తే 500 పూర్తి అవుతాయి కదా!" అనే దురాశ అతడిని నిలువనీయలేదు. సరిగ్గా అదే సమయంలో నాలుగు బలమైన కోతులు అక్కడికి వచ్చాయి. వ్యాపారి కళ్ళ ముందే అతని డబ్బుల సంచిని లాక్కున్నాయి, దుకాణాన్ని చిందరవందర చేశాయి. ఎంత ప్రయత్నించినా ఆ కోతులు సంచిని వదల్లేదు. దుకాణంలో జరుగుతున్న తంతును చూసి సాధువు బిగ్గరగా నవ్వాడు. అప్పటి వరకు కోతల నుంచి ఎలాగైనా సంచిని లాక్కోవాలని చూసిన వ్యాపారికి విషయం బోధపడింది. వెంటనే పరుగు పరుగున సాధువు వద్దకు వెళ్లి కాళ్లపై పడతాడు. తప్పు మన్నించమని వేడుకుంటాడు. తన డబ్బుసంచిని ఇప్పించమని వేడుకుంటాడు. సాధువు శాంతించి కోతులవైపు చూడగా అవి సంచిని తెచ్చి ఇస్తాడు. వెంటనే ఆ వ్యాపారి తన వద్ద మిగిలిన పేడాలను సాధువు ఇవ్వడమే కాకుండా, విసిరిగొట్టిన 25 పైసల నాణేన్ని కూడా తిరిగి ఇస్తాడు. ఇందులో నీతి ఏమంటే మనిషి దైవం పట్ల భక్తిభావం, సాధువుల పట్ల దయాభావంతో ఉండాలి. వారిని గౌరవించాలి, వారికి సహాయం చేయాలి. అప్పుడే భగవంతుడు మనపట్ల దయను చూపుతాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story