Guruvayur Elephant Race: గురువాయూర్ క్షేత్రంలో అద్భుతం... కన్నయ్యను మోసే గజరాజులకు విచిత్రమైన పోటీ
కుంభం ఉత్సవంలో విజేతగా నిలిచిన ఏనుగు గురువాయూర్ శ్రీకృష్ణస్వామిని అంబారీపై మోసే భాగ్యం కలుగుతుంది.
Guruvayur Elephant Race: సాధారణంగా మనకు శ్రీకృష్ణుడి ఆలయాలు అనగానే మనకు గోమాత గుర్తుకు వస్తుంది. గోవులంటే ఆయనకు ప్రాణం. కాళఙంది నది, మురళిగానం గుర్తుకు వస్తాయి. కృష్ణ మందిరాలు ఎక్కడుంటే అక్కడ మనకు గోవులు కనిపిస్తుంటాయి. కానీ, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్‌కు వెళ్తే మాత్రం గోవులు కాకుండా గజరాజులు దర్శనం ఇస్తారు. ఇక్కడి గజరాజులను చూసి భక్తులు పరవశించిపోతారు. ఇక ప్రతీ ఏడాది ఈ ఆలయంలో కుంభం అనే ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగానే అనయోట్టం అనే పవిత్రమైన, అద్భుతమైన ఉత్సవం నిర్వహిస్తారు. దీన్ని ఉత్సవం అనే కంటే పరుగుపందెం అని పిలవవచ్చు. పదుల సంఖ్యలో ఏనుగులో ఈ పోటీలో పాల్గొంటాయి. ఇందులో విజేతగా నిలిచిన ఏనుగు ఆ ఏడాది స్వామివారిని అంబారీగా మోసే భాగ్యం కలుగుతుంది. దీనికోసమే ఈ పరుగు పందెం నిర్వహిస్తారు.
భూమి దద్దరిల్లేలా గజరాజుల పరుగు పందెం
ఒకటి రెండు ఏనుగులు పరిగెత్తుతుంటేనే అక్కడ ఒకరకమైన ప్రకంపనలు కలుగుతుంటాయి. ఇక పదుల సంఖ్యలో ఏనుగులు ఒకేసారి పరుగులు తీస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. పున్నత్తూర్ కోట దేవస్థానం నుంచి గురువాయూర్ ఆలయ తూర్పు గోపురం వరకు మూడు కిలోమీటర్ల మేర ఈ పరుగుపందెం జరుగుతుంది. ఈ పోటీలో ‘రవికృష్ణన్’ అనే ఏనుగు ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా నిలిచింది. కాగా, ‘బాలు’ ద్వితీయ స్థానాన్ని, ‘కృష్ణ నారాయణ్’ అనే ఏనుగు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. విజేతగా నిలిచిన రవికృష్ణన్ ఆలయంలోకి ప్రవేశించి, స్వామివారికి నివేదనగా ఏడు ప్రదక్షిణలు చేసింది. అనంతరం జరిగే ‘సీవేలి’ ఆచారంలో భాగంగా గురువాయురప్పన్ బంగారు విగ్రహాన్ని (తిడంపు) తనపై మోసే మహద్భాగ్యాన్ని దక్కించుకుంది.
చరిత్రగా నిలిచిన పద్మనాభన్, కేశవన్ భక్తి కథలు
గురువాయూర్ చరిత్రలో ఏడు దశాబ్దాల క్రితం జీవించిన పద్మనాభన్, కేశవన్ అనే ఏనుగుల భక్తి కథలు నేటికీ భక్తుల నోళ్లలో నానుతుంటాయి. 1931లో సాధు స్వభావం కలిగిన పద్మనాభన్ అనే ఏనుగు మరణించినపుడు శ్రీకృష్ణుడి నుదిటిపై ఉన్న గంధపు బొట్టు రాలిపడిందని చెబుతారు. ఆ తరువాత వచ్చిన కేశవన్ అనే గజరాజు భక్తి మరింత అద్భుతమనే చెప్పాలి. స్వామివారి విగ్రహాన్ని తన వీపుపై ఉంచేంత వరకు భక్తితో తన ముందుకాలిని పైకి ఎత్తి ఉంచేదట. దీని భక్తికి మెచ్చిన సంస్థానం ఈ ఏనుగుకు గజరాఉ అనే బిరుదును ప్రధానం చేశారు. ఇలా ఎంతోకాలం స్వామివారికి సేవలు అందించిన కేశవన్ 1976లో ఏకాదశి రోజు ఉదయం స్వామివారి ఆలయానికి అభిముఖంగా నిలబడి ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం పున్నత్తూర్‌కోటలోని ఏనుగుల శాలలో భక్తుల సందర్శనార్థం కేశవన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏనుగుల ఘీంకారాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య సాగే ఈ ఉత్సవం భక్తి ని పెంపొందిస్తుంది.




