Hanuman Chalisa: అద్భుతం అంటే ఇదే... తులసీదాస్ మాదిరిగానే మనల్ని కాపాడతాడు
తులసీదాస్ జైలులో హనుమాన్ చాలీసాను ఎందుకు రచించారనే కథ ఎంతో ఆసక్తికరం. హనుమాన్ చాలీసా ఆవిర్భావం, తులసీదాస్ భక్తి, అక్బర్‌తో జరిగిన ఘటన గురించి తెలుసుకుందాం.
Hanuman Chalisa:కలియుగంలో భక్తితో "హనుమా" అని స్మరిస్తే చాలు, ఆ భజరంగబలి భక్తుల చెంతనే నిలిచి రక్షణగా ఉంటాడని శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆంజనేయుడి దివ్య గుణాలను కీర్తిస్తూ పఠించే "హనుమాన్ చాలీసా" కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు. అది ఆపదల్లో ఉన్న మానవుడికి భగవంతుడు అందించే ఆధ్యాత్మిక అభయహస్తం. ప్రతికూల శక్తులను, భూతప్రేత భయాలను పటాపంచలు చేసే ఈ చాలీసా ఆవిర్భావం వెనుక ఒక అత్యంత అద్భుతమైన, రోమాంచితమైన పౌరాణిక ఘట్టం ఉంది. రామభక్తుడైన సంత్ తులసీదాస్‌ని అక్బర్ చక్రవర్తి బంధించినప్పుడు, ఆంజనేయుడిపై ఉన్న అపరిమితమైన ఆర్తితో ఈ దివ్య కావ్యానికి ప్రాణం పోశారు.
రాజు ఆజ్ఞకు ఎదురునిలిచిన రామభక్తి
సంత్ తులసీదాస్ గారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా 'శ్రీరామచరితమానస్' రూపంలో అవధి భాషలో రచించారు. ఈ గ్రంథం పండితుల నుండి పామరుల వరకు ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ కీర్తి ప్రతిష్టలు మొఘల్ చక్రవర్తి అక్బర్ చెవిన పడ్డాయి. తులసీదాస్ కవితా పాతవాన్ని విన్న అక్బర్, ఆయనను తన రాజసభకు పిలిపించాడు. శ్రీరాముడిని కీర్తించినట్లే తనపై కూడా ఒక ప్రశంసా కావ్యాన్ని రాయమని కోరాడు. దానికి తులసీదాస్ చిరునవ్వుతో "రామనామాన్ని పలికిన ఈ నోటితో ఏ ఇతర మానవుడిని, రాజాజ్ఞను పొగడలేను" అని తేల్చి చెప్పారు. భగవంతుడికంటే ఏ చక్రవర్తీ గొప్పవాడు కాదని స్పష్టం చేశారు. ఈ ధిక్కారానికి ఆగ్రహించిన అక్బర్, ఆయనను కఠినమైన జైలు శిక్షకు గురిచేశాడు.
జైలు గోడల మధ్య 40 ద్విపదుల దివ్య జపం
జైలులో కఠినమైన యాతనలను అనుభవిస్తున్న సమయాన, తులసీదాస్ గారు తన మనస్సును శ్రీరామభక్తుడైన హనుమంతునిపై లగ్నం చేశారు. తనను ఈ భౌతిక బంధనాల నుండి, ఆపద నుండి కాపాడాల్సిందిగా వేడుకుంటూ 40 ద్విపదులతో కూడిన స్తోత్రాన్ని ఆర్తితో ఆలపించారు. అదే నేడు మనం నిత్యం పఠించే 'హనుమాన్ చాలీసా'. తులసీదాస్ జైలులో నిత్యం ఈ 40 శ్లోకాలను పఠిస్తుండగా, ఆ ప్రార్థనా శక్తి రాజప్రసాదం దాటి బయటకు వ్యాపించింది. ఈ వార్త మళ్లీ అక్బర్ వద్దకు చేరి, హనుమాన్ చాలీసా విశిష్టతను పరీక్షించాలనుకున్నాడు. తులసీదాస్ ఆ స్థానంలో చాలీసాను పఠించడం ప్రారంభించగానే, అనూహ్యంగా వందలాది వానరాలు ఎక్కడికక్కడ రాజసభపైకి విరుచుకుపడ్డాయి. ఆ అద్భుతాన్ని చూసి హడలిపోయిన సైనికులు, సభసదులు పరుగు తీశారు.
అక్బర్ గర్వభంగం ... శాశ్వత అభయం
కళ్లముందు జరుగుతున్న ఈ దివ్య లీలను చూసి అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే తులసీదాస్ గారి చరణాలపై పడి క్షమాపణలు కోరాడు. ఆయనను సగౌరవంగా విడుదల చేసి, రాజమర్యాదలతో సాగనంపాడు. ఈ చారిత్రక ఘట్టం ద్వారా హనుమాన్ చాలీసా ఎంతటి శక్తివంతమైనదో జగత్తుకు వెల్లడైంది. నిత్యం భక్తిశ్రద్ధలతో ఈ 40 శ్లోకాలను పఠించే సాధకులకు ఎలాంటి కష్టనష్టాలు దరిచేరవని, వాయుపుత్రుడే స్వయంగా వచ్చి రక్షణగా నిలుస్తాడని పెద్దలు విశ్వసిస్తారు.




