Hanuman Immortal: హనుమయ్య చిరంజీవుడే...ఈ తెగే అందుకు సాక్ష్యం... ఇవే ఆధారాలు
ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోని మహతాంగ్ తెగ. విభీషణుడి చివరి వారసులుగా వీరిని చెబుతారు. ప్రతి 41 ఏళ్లకు ఒకసారి భజరంగబలి వీరిని కలుస్తారని అంటారు.
Hanuman Immortal: సనాతన ధర్మంలో చిరంజీవులుగా ప్రసిద్ధి చెందిన దైవ స్వరూపులలో శ్రీ హనుమంతుడు అత్యంత ప్రధానుడు. ఆపదలో ఉన్నప్పుడు భజరంగబలి నామాన్ని స్మరిస్తే భయాలన్నీ పటాపంచలై ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అభయంతో అమరత్వాన్ని పొందిన వాయుపుత్రుడు, ద్వాపరయుగంలో పాండవులను కలుసుకున్నట్లు మహాభారత ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. సకల లోక కళ్యాణం కోసం ఈ కలియుగాంతం వరకు భూమిపైనే సజీవంగా ఉంటారని పురాణ శాస్త్రాలు బోధిస్తున్నాయి. అయితే, ఆధునిక కాలంలోనూ మారుతి ఉనికిని రుజువు చేసే విచిత్రమైన, ఆధ్యాత్మిక ఆధారాలు శ్రీలంకలో లభిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
గంధమాదన పర్వతం నుండి లంక వైపు...
శాస్త్రాల ప్రకారం, కలియుగంలో కపీంద్రుడు రామేశ్వరం సమీపంలోని పవిత్రమైన గంధమాదన పర్వతంపై అదృశ్య రూపంలో నివసిస్తున్నారు. అక్కడ నిరంతరం రామనామ ధ్యానంలో మునిగితేలే ఆంజనేయుడు, ఒక ప్రత్యేకమైన వరం ప్రకారం శ్రీలంకలోని అరణ్యాలకు వెళ్తుంటాడని విశ్వసిస్తారు. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ఆధునిక ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న 'మాహతాంగ్' అనే తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు రాక్షస రాజు విభీషణుడి చివరి వారసులని పరిశోధనలు ద్వారా తెలుస్తోంది. రామావతార పరిసమాప్తి సమయంలో ఈ తెగ ప్రజలు హనుమంతుడికి అందించిన సేవలకు మెచ్చి, ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వారిని కలుసుకుంటానని ఆంజనేయుడు వరం ఇచ్చినట్లు చెబుతారు.
విచిత్రమైన లాగ్‌బుక్ రహస్యం
శ్రీలంకకు చెందిన 'సేతువు' అనే ఆధ్యాత్మిక పరిశోధనా సంస్థ ఈ తెగపై లోతైన అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం పవనపుత్రుడు వచ్చిన ప్రతిసారీ ఆ తెగ నాయకుడు స్వామివారి రాకను, ఆయన అందించే దివ్య సందేశాలను తమ సొంత భాషలో ఒక ప్రత్యేకమైన లాగ్‌బుక్‌లో భద్రంగా రాసి పెడతారు. సేతువు సంస్థ సమాచారం ప్రకారం, హనుమంతుడు 2014 మే 27న మాహతాంగ్ తెగ వద్దకు వచ్చి వారితో సమయం గడిపారు. సరిగ్గా 41 సంవత్సరాల కాలక్రమాన్ని అనుసరించి మళ్లీ 2055లో అంజనీపుత్రుడు ఈ తెగను కలుసుకోనున్నారు. ప్రకృతితో, పక్షులతో, కోతులతో కలిసిమెలిసి జీవించే ఈ మాహతాంగ్ తెగ రాసిన ప్రాచీన భాషా ప్రతులను డీకోడ్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశ్వమంతటా నిండి ఉన్న రామనామ శక్తితో, మారుతి ఇప్పటికీ చిరంజీవిగా ఈ భూమిపైనే కొలువై ఉన్నారని చెప్పడానికి ఇవి గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.




