Hanuman Jayanti: ఆంజనేయుడి జన్మరహస్యం... కలియుగంలో గట్టెక్కించే కపిధ్వజుడు
మనకు ఏదైనా ఆపద వచ్చినపుడో లేదా భయం వేసినపుడో వెంటనే జై హనుమాన్ అని తలచుకుంటాం. వెంటనే భయం మన నుంచి దూరం అవుతుంది.
Hanuman Jayanti: మనకు ఏదైనా ఆపద వచ్చినపుడో లేదా భయం వేసినపుడో వెంటనే జై హనుమాన్ అని తలచుకుంటాం. వెంటనే భయం మన నుంచి దూరం అవుతుంది. అటువంటి హనుమంతుడి జయంతి మే 12న వచ్చింది. అంతేకాదు, హనుమంతుడికి అత్యంత ఇష్టమైన మంగళవారం రోజునే హనుమజ్జయంతి రావడం అరుదైన విషయం. రామదాసుగా, అంజనీపుత్రుడిగా, సువర్చలా సమేతుడిగా వెలుగొందుతున్న ఆంజనేయుని జన్మరహస్యం వెనుకనున్న గంభీరమైన అర్థాన్ని తెలుసుకుందాం.
ఒకే రోజున రెండు విశేషాలు - మే 12 మంగళవారం
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన వారం మంగళవారం. మే 12న హనుమజ్జయంతి పండుగ, మంగళవారం నాడు కలిసి రావడం విశేషం. ఇలాంటి రోజున స్వామివారిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం చూసినా, మే 12వ తేదీ గురు గ్రహానికి సంకేతం కాగా, మంగళవారం కుజుడికి సంకేతం. జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీకలైన ఈ రెండు శక్తుల కలయికే ఈనాటి జయంతి విశేషం. హనుమను ఆరాధించేవారు ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో లేదా ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అత్యుత్తమం.
అంజనీ పుత్రుడు - జన్మ వెనుక ఉన్న శివతత్వం
ఆంజనేయుని జన్మరహస్యం గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. హనుమ కేవలం వానరుడు మాత్రమే కాదు. హనుమ మాతృమూర్తి అంజనాదేవి అస్సరస అయిన పుంజికస్థల...ముని శాపం కారణంగా భూమిపై జన్మించింది. శివుని అంశతో, వాయుదేవుని అనుగ్రహంతో హనుమ జన్మించాడు. అందుకు హనుమయ్యను ఏకాదశ రుద్రావతారం అని పిలుస్తారు. ఇక బాల్యంలో సూర్యుడిని పండుగా భావించి ఆయన్ను తినాలని చూసినపుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించడంతో దవడ దెబ్బతింటుంది. అందుకే ఆంజనేయుడిని హనుమంతుడు అని పిలుస్తారు.
సువర్చలా సమేత హనుమ - బ్రహ్మచర్యమా? వివాహమా?
సాధారణంగా హనుమంతుడు అంటే ఆజన్మ బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. మరి ఆలయాల్లో 'సువర్చలా సమేత హనుమంతుడు' అని ఎందుకు కనిపిస్తాడు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశం ఏమిటంటే.. అది భౌతిక సుఖాల కోసం చేసుకున్న వివాహం కాదు, అది కేవలం విద్య కోసం జరిగిన వివాహం. బాల్యంలో ఎవరినైతే పండు అనుకొని తినాలని చూశాడో...ఆ తరువాత ఆ సూర్యుడినే గురువుగా చేసుకొని విద్యను నేర్చుకున్నాడు. ఈ క్రమంలో 8 వ్యాకరణాలు పూర్తి చేశాడు. కానీ, చివరిదైన తొమ్మిదో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే గృహస్థుడై ఉండాలి. హనుమ నిష్టను భంగపరచకుండా సూర్యుడు తన తేజస్సు నుంచి సువర్చల అనే కన్యను సృష్టిస్తాడు. ఆమె అయోనిజ. అంటే భౌతికమైన శరీరం ఉండదు. తేజోరూపంగా మాత్రమే ఉంటుంది. అలా తేజోమయ రూపంలో ఉన్న సువర్చలను హనుమ వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత చివరి వ్యాకరణం నేర్చుకుంటాడు. వివాహం చేసుకున్నా ఆయన బ్రహ్మచర్య వ్రతానికి ఎలాంటి లోటు రాలేదు. అందుకే హనుమను పూజించిన వారికి విద్య, బుద్ధి రెండు సిద్దిస్తాయని అంటారు.
కలియుగంలో గట్టెక్కించే కపిధ్వజుడు
రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత, శ్రీరాముడు వైకుంఠానికి వెళ్తూ హనుమంతుడిని భూమిపైనే ఉండి రామనామ ప్రచారం చేయమని ఆదేశించాడు. భూమిపై చిరస్థాయిగా రామనామం ప్రచారం చేయాలంటే హనుమ చిరంజీవిగా ఉండాలి. ఆయన చిరంజీవిగా ఉండే వరాన్ని రాముడు ప్రసాదిస్తాడు. ఇప్పటికీ హనుమ గంధమాదవ పర్వతంపై తపస్సు చేస్తుంటారని భక్తుల నమ్మకం. కలౌ కపి వినాయకః అని అంటారు. అంటే కలియుగంలో హనుమంతుడు, గణపతి భక్తులను మొరను త్వరగా ఆలకిస్తారు. వారి కోరికలు నెరవేరుస్తారు. శనిగ్రహంతో బాధించబడేవారు హనుమను ఆరాధిస్తారు. హనుమ ఆరాధనతో గ్రహపీడల నుంచి విముక్తి లభిస్తుంది. రావణాసురుడి చెర నుంచి శనీశ్వరుడిని విడిపించినందుకు ఆయన ఈ వరం ఇస్తాడు.
హనుమజ్జయంతి అంటే కేవలం పూజలు చేయడం కాదు, హనుమలోని నిస్వార్థ భక్తిని, అపారమైన శక్తిని మనసులోకి ఆహ్వానించడం. ఏ సమస్య వచ్చినా, భయం వేసినా 'హనుమాన్ చాలీసా' పఠిస్తే కలిగే మానసిక స్థైర్యాన్ని వర్ణించలేం. హనుమాన్ చాలీసా పఠించలేకపోయినా.. ఆయన నామాన్ని నిరంతరం జపించడం వలన కూడా మనకు ధైర్యం కలుగుతుంది. భవసాగరాన్ని దాటే శక్తి లభిస్తుంది.




