Harivarasanam Song: అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేది క్రైస్తవ గాయకుడి స్వరమా..! ఆ గాయకుడు ఎవరో తెలుసా?
శబరిమల అయ్యప్ప స్వామికి రాత్రి వేళ వినిపించే హరివరాసనం పాటను యేసుదాస్ ఎందుకు ఆలపించారు? ఈ గీతం వెనుక ఆసక్తికరమైన కథ తెలుసుకోండి.
Harivarasanam Song
శబరిమల అయ్యప్ప స్వామిని కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి రోజూ వేలాది మంది భక్తుల శరణుఘోషతో మారుమోగే శబరిమల ఆలయం.. రాత్రి వేళ ప్రశాంతంగా మారుతుంది. ఆ సమయంలో వినిపించే ఓ మధురమైన గీతం స్వామివారి పవళింపు సేవకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అదే 'హరివరాసనం విశ్వమోహనం'. ఈ పాట పూర్తయిన తర్వాతే ఆలయ గర్భగుడి తలుపులు మూసివేస్తారు. అయితే ఈ పవళింపు గీతాన్ని ఆలపించిన గాయకుడు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కావడం విశేషం. ఆయనే కేజే యేసుదాస్.
హరివరాసనం.. అయ్యప్ప స్వామి పవళింపు గీతం
సాధారణంగా ఆలయాల్లో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, రాత్రి పవళింపు సేవతో నిద్రపుచ్చుతారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ రాత్రి వేళ ఇదే తరహాలో ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. రోజంతా భక్తులకు దర్శనమిచ్చే అయ్యప్ప స్వామికి చివరగా 'హరివరాసనం విశ్వమోహనం' కీర్తనతో పవళింపు పలుకుతారు.
ఈ గీతాన్ని 'హరిహరాత్మజాష్టకం' అని కూడా పిలుస్తారు. హరిహరాత్మజుడు అంటే విష్ణువు, శివుడి అంశాల కలయికగా భావించే అయ్యప్ప స్వామి అని అర్థం. ఈ కీర్తనలో స్వామివారి దైవిక స్వరూపాన్ని, మహిమను వర్ణిస్తారు. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉండటంతో దీనికి అష్టకం అనే పేరు వచ్చింది.
ప్రతిరోజూ రాత్రి ఆలయంలో చివరి పూజ అయిన అత్తాళ పూజ ముగిసిన తర్వాత ఈ గీతాన్ని ఆలపిస్తారు. పాట పూర్తయ్యే సమయానికి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. అందుకే భక్తులు దీనిని అయ్యప్ప స్వామి జోలపాటగా భావిస్తారు.
యేసుదాస్ స్వరంలోనే ఎందుకు వినిపిస్తుంది?
శబరిమలలో ప్రస్తుతం వినిపించే హరివరాసనం గీతం వెనుక 1975 నాటి సినిమా కథ ఉంది. ఆ ఏడాది విడుదలైన మలయాళ చిత్రం 'స్వామి అయ్యప్పన్'లో ఈ కీర్తనను పొందుపరిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి. దేవరాజన్ దీనికి స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ ఆలపించారు.
సినిమా ద్వారా ఈ పాట దక్షిణ భారతదేశంలో విశేష ప్రజాదరణ పొందింది. అనంతరం యేసుదాస్ పాడిన ఈ గీతాన్ని శబరిమల ఆలయంలో రాత్రి వేళ ప్రసారం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే రికార్డింగ్ ఆలయ పవళింపు సమయంలో వినిపిస్తోంది.
అయితే ఆలయంలో వినిపించేది యేసుదాస్ గాత్రం మాత్రమే కాదు. ఆయన పాట ప్రసారమవుతున్న సమయంలో గర్భగుడి వద్ద పూజారులు కూడా సంప్రదాయ పద్ధతిలో ఈ కీర్తనను ఆలపిస్తారు. పూజారులు పాడే రూపంలో ప్రతి పాదం చివర 'స్వామి' అనే పదం కూడా ఉంటుంది.
మధ్యమావతి రాగంలో మధురమైన గానం
హరివరాసనం పాటకు ఇంతటి ఆదరణ రావడానికి దాని భక్తిభావంతో పాటు సంగీతం కూడా ఓ ముఖ్యమైన కారణం. సంగీత దర్శకుడు జి. దేవరాజన్ ఈ గీతాన్ని మధ్యమావతి రాగంలో స్వరపరిచారు. కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి చెందిన ఈ రాగం ప్రశాంతమైన భావాన్ని, భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది.
యేసుదాస్ గాత్రంలోని మాధుర్యం, మధ్యమావతి రాగంలోని ప్రశాంతత కలిసిపోవడంతో ఈ పాట వినేవారికి ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ఈ గీతం ఎంతో ఆత్మీయంగా మారింది.
హరివరాసనం పాటను రాసిందెవరు?
ఈ కీర్తన రచయిత విషయంలో చాలాకాలంగా చర్చ కొనసాగుతోంది. హరివరాసనాన్ని కంబంకుడి కులత్తూర్ శ్రీనివాస అయ్యర్ రచించినట్లు ప్రచారంలో ఉంది. అయితే 2014లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమ పూర్వీకురాలు కొన్నకత్తు జానకీ అమ్మ 1923లో ఈ పాటను రచించారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
జానకీ అమ్మ శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా పనిచేసిన అనంతకృష్ణ అయ్యర్ కుమార్తె. ఆమె చేతిరాతతో ఉన్న ప్రతులు తమ వద్ద ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రీనివాస అయ్యర్ ఈ కీర్తనను రచించలేదని, కేవలం సంకలనం చేశారని వారి వాదన. అయితే ఈ పాట అసలు రచయిత విషయంలో ఇప్పటికీ పూర్తి ఏకాభిప్రాయం లేదు.
పాట పూర్తయ్యే వరకు గర్భగుడిలో ఏం జరుగుతుంది?
హరివరాసనం కేవలం ఓ భక్తి గీతం మాత్రమే కాదు.. శబరిమల ఆలయంలో రాత్రి పూజల ముగింపును సూచించే సంప్రదాయం కూడా. ఈ పాట వినిపిస్తున్న సమయంలో గర్భగుడిలోని పూజారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. చివరగా ప్రధాన పూజారి మాత్రమే లోపల ఉంటారు.
ఆయన గర్భగుడిలోని దీపాలను ఒక్కొక్కటిగా ఆర్పుతూ స్వామివారికి నమస్కరిస్తారు. కీర్తన ముగిసే సమయానికి చివరి దీపాన్ని కూడా ఆర్పి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఇలా రోజంతా భక్తులకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామికి పవళింపు పలుకుతారు.
1950ల నుంచే కొనసాగుతున్న సంప్రదాయం
యేసుదాస్ పాడిన సినిమా వెర్షన్ కంటే ముందే శబరిమలలో హరివరాసనం ఆలపించే సంప్రదాయం ఉన్నట్లు కొన్ని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. 1950లో ఆలయంలో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అనంతరం 1955లో స్వామి విమోచనానంద ఈ అష్టకాన్ని ఆలయంలో మొదటిసారిగా ఆలపించినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే ఈ సంప్రదాయం ప్రారంభానికి సంబంధించి భిన్నమైన కథనాలు కూడా ఉన్నాయి.
2017లో హరివరాసనం పాత రికార్డింగ్లోని కొన్ని పదాల ఉచ్చారణ, పాఠాంతరాలను సరిచేసేందుకు కొత్తగా రికార్డు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. పూజారులు ఆలపించే సంప్రదాయ రూపంలో ప్రతి పాదానికి 'స్వామి' అనే పదం ఉంటుందని, ప్రసిద్ధ రికార్డింగ్లో అది లేదని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో యేసుదాస్ గాత్రంలోని ప్రసిద్ధ వెర్షన్ను మార్చే ప్రయత్నం ముందుకు సాగలేదు.
మతాలకు అతీతంగా మనసులను కలిపే గానం
ఒక హిందూ దేవాలయంలో అయ్యప్ప స్వామి పవళింపు గీతంగా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన యేసుదాస్ గాత్రం వినిపించడం మతసామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. సంగీతానికి మతం, కులం, ప్రాంతం అనే హద్దులు ఉండవని ఈ సంప్రదాయం మరోసారి గుర్తుచేస్తోంది.
అయ్యప్ప దర్శనం కోసం భక్తులు ఎన్ని కిలోమీటర్లు నడిచినా, ఎన్ని రోజుల పాటు దీక్ష చేపట్టినా.. రాత్రి వేళ వినిపించే హరివరాసనం వారి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ గీతాన్ని కేవలం సినిమా పాటగా కాకుండా అయ్యప్ప స్వామి పవళింపు గీతంగా కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తున్నారు.




