Headless Ganesha Temple: ఇక్కడ గణపతికి తల ఉండదు... ఈ విచిత్రాలయం విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఉత్తరాఖండ్‌లోని శ్రీ ముండా కటియా గణేశ ఆలయంలో తలలేని రూపంలో వినాయకుడిని పూజిస్తారు. ఈ ఆలయ విశిష్టత, పురాణగాథ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, చేరుకునే మార్గం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 15 Sept 2026 9:26 AM IST
Headless Ganesha Temple: ఇక్కడ గణపతికి తల ఉండదు... ఈ విచిత్రాలయం విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
X

Headless Ganesha Temple: వినాయకుడి పేరు వినగానే మన కళ్ల ముందు ఏనుగు తలతో, తొండంతో, బొజ్జతో కనిపించే రూపమే గుర్తుకొస్తుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని ఓ ఆలయంలో మాత్రం గణపతి ఆ రూపంలో కనిపించరు. తలలేని మొండెం రూపంలో ఉన్న గణేశుడిని ఇక్కడ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఆలయమే శ్రీ ముండా కటియా గణేశ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ లోయ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం గణపతి క్షేత్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. పురాణ విశ్వాసాల ప్రకారం.. వినాయకుడు ఏనుగు తలను పొందడానికి ముందు ఉన్న రూపానికి ఈ క్షేత్రం ప్రతీకగా భావిస్తారు. అందుకే మిగతా గణేశ ఆలయాలకు భిన్నంగా ఇక్కడి ఆరాధన భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

పార్వతీదేవి ముద్దుల కుమారుడిగా..

గణేశుడి జన్మకు సంబంధించిన పురాణగాథ అందరికీ తెలిసిందే. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్లే సమయంలో తనకు కాపలాగా ఉండేందుకు పసుపు ముద్దతో ఒక బాలుడిని తయారు చేసి అందులోకి ప్రాణం పోశారని కథనం. ఆ బాలుడినే తన కుమారుడిగా భావించి.. తాను బయటకు వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. అదే సమయంలో అక్కడికి శివుడు వచ్చారు. తన తల్లిమాటను శిరసావహించిన బాల గణేశుడు శివుడిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను వేరు చేశారని పురాణగాథ చెబుతుంది.

కుమారుడి దుస్థితిని చూసిన పార్వతీదేవి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన కుమారుడికి తిరిగి ప్రాణం పోయకపోతే సృష్టినే నాశనం చేస్తానని హెచ్చరించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న శివుడు తన గణాలను ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న మొదటి జీవి తలను తీసుకురావాలని ఆదేశించారు. వారికి ఓ ఏనుగు కనిపిస్తుంది. దాని తలను తీసుకొచ్చి గణేశుడి శరీరానికి అమర్చి శివుడు తిరిగి ప్రాణం పోశారని పురాణం చెబుతుంది. ఆ తర్వాత గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, ఏ శుభకార్యమైనా ముందుగా పూజించాల్సిన దేవుడిగా ప్రత్యేక స్థానం పొందారు.

తల కోల్పోయిన ప్రదేశంగా విశ్వాసం

శ్రీ ముండా కటియా ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఇక్కడే మొదలవుతుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం గణేశుడు తల కోల్పోయిన ప్రదేశం ఇదే. అందుకే ఏనుగు తలతో కూడిన గణపతి రూపానికి బదులుగా.. ఆ సంఘటనకు ముందు ఉన్న తలలేని రూపాన్ని ఇక్కడ పూజిస్తారని చెబుతారు. ఆలయంలోని నారింజ రంగు గణేశ విగ్రహం సాధారణంగా కనిపించే వినాయక విగ్రహాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రూపం విచిత్రంగా అనిపించినా.. భక్తులకు మాత్రం ఇందులో గణపతి దైవశక్తి కనిపిస్తుంది. దేవుడి రూపం ఎలా ఉన్నా భక్తి, విశ్వాసమే ప్రధానమనే భావన ఈ క్షేత్రంలో బలంగా కనిపిస్తుంది.

ఎలా చేరుకోవాలి?

ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ లోయలో ఉంది. సోన్‌ప్రయాగ్ నుంచి గౌరీకుండ్, కేదార్‌నాథ్ వెళ్లే మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. విమానంలో వెళ్లేవారికి డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీప ప్రధాన విమానాశ్రయం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 226 కిలోమీటర్లు ప్రయాణించి సోన్‌ప్రయాగ్ చేరుకోవాలి. రైలు మార్గంలో రిషికేశ్ లేదా డెహ్రాడూన్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం కొనసాగించవచ్చు. సోన్‌ప్రయాగ్ నుంచి చివరి 3 కిలోమీటర్ల ప్రయాణాన్ని వాహనంలో పూర్తి చేయవచ్చు. అయితే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడకన వెళ్లే భక్తులకు మందాకిని నది పరిసరాల ప్రయాణం మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. సాధారణ గణపతి ఆలయాల కంటే పూర్తిగా భిన్నమైన రూపంలో స్వామిని దర్శించాలనుకునే భక్తులకు ఈ క్షేత్రం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. గణపతికి ఏనుగు తల ఎలా వచ్చింది అనే కథను గుర్తు చేసే ఈ ఆలయం.. పురాణం, ప్రకృతి, భక్తి కలిసిన అరుదైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.