Temples in India: నూటికి 90శాతం మందికి తెలియని నిజం..ప్రతి లక్ష మందికి ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలుసా?
భారతదేశంలో ఆలయాల సంఖ్య ఎంత అంటే లెక్కించడం కష్టమే. ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఆలయాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఈ డేటా ప్రకారం దేశంలో సుమారు 6.60 లక్షల ఆలయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Temples in India: భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతికి, సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యాలు మన దేశంలోని దేవాలయాలు. మన దేశంలో ప్రసిద్ధ ఐఐటీ బాంబే నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం సమగ్ర దేశవ్యాప్తంగా దాదాపు 6.60 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి లక్ష జనాభా ప్రాతిపదికన చూస్తే, అత్యధికంగా గోవా, తమిళనాడు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలవగా, దేశమంతటా విస్తరించిన ఈ దేవాలయాల నిర్మాణం భక్తి చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దేవాలయాల సంఖ్య, ప్రాంతీయ ప్రాముఖ్యత, రాష్ట్రాల వారీగా ఉన్న గణాంక విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం.
దేశంలో ఆలయాల ఆవిర్భావం ... చారిత్రక పరిణామం
వేదకాలం నుంచి మన దేశంలో దైవారాధన కొనసాగుతున్నప్పటికీ, క్రీస్తుశకం 800 నుండి 1200 మధ్యకాలంలోనే అత్యధికంగా విశిష్ట శిల్పకళా నిలయాలైన దేవాలయాలు నిర్మితమయ్యాయి. మధ్యయుగంలో, బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆలయాల నిర్మాణం కొంత మందగించినప్పటికీ, స్వతంత్ర భారతదేశంలో సనాతన ధర్మ పునరుద్ధరణ వేగవంతమైంది.
రాష్ట్రాల వారీగా ప్రతి లక్ష మందికి ఉన్న ఆలయాల సంఖ్య
ఐఐటీ బాంబే అధ్యయనం ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు అందుబాటులో ఉన్న ఆలయాల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి లక్ష మందికి 62 మంది ఉండగా... చండీగడ్‌లో ప్రతి లక్ష మందికి 22, పంజాబ్‌లో 16, హర్యానాలో 35, ఉత్తరాఖండ్‌లో 35, దిల్లీలో 36, ఉత్తరప్రదేశ్‌లో 16, రాజస్థాన్‌లో 49, మధ్యప్రదేశ్‌లో 33, గుజరాత్‌లో 71, బీహార్‌లో 24, జార్ఖండ్‌లో 38, చత్తీస్‌గడ్‌లో 32, బెంగాల్‌లో 54, సిక్కింలో 13, అస్సాంలో 15, అరుణాచల్‌ప్రదేశ్‌లో 6, మేఘాలయలో 4, త్రిపురలో 14, మిజోరాంలో 3, మణిపూర్‌లో 14, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 70, మహారాష్ట్రలో 62, తెలంగాణలో 75, ఆంధ్రప్రదేశ్‌లో 89, కర్ణాటకలో 91, తమిళనాడులో 103, కేరళలో 64, గోవాలో 118, డయ్యూదామన్‌లో 16 చొప్పున ఉన్నట్టు డేటాను బట్టి తెలుస్తోంది.
అత్యధిక... అత్యల్ప ఆలయాలు ఉన్న రాష్ట్రాలు
ఆలయాల పరంగా చూసుకుంటే తమిళనాడులో 79,154 ఆలయాలుంటే, మహారాష్ట్రలో అత్యధికంగా 77,283 ఆలయాలున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 39,518 ఆలయాలు మాత్రమే ఉన్నట్టు లెక్కలను డేటాను బట్టి తెలుస్తోంది. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్‌లో 42,152 ఆలయాలుంటే... తెలంగాణలో 28,132 ఆలయాలున్నాయి. దేశంలో అత్యధిక ఆలయాలు తమిళనాడులో ఉంటే అత్యల్పంగా మిజోరాంలో కేవలం 32 ఆలయాలు మాత్రమే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా దేశంలో 6.60 లక్షల ఆలయాలు ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి.
అయోధ్యలో శ్రీరాముని దివ్య మందిర నిర్మాణం కోసం జరిగిన 500 సంవత్సరాల సుదీర్ఘ ఆధ్యాత్మిక పోరాటం భారతీయ సమాజపు పునాదులు ధర్మంపైనే నిర్మితమయ్యాయని నిరూపిస్తోంది. గ్రామ గ్రామాన వెలసిన ఈ ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక సదాచారాలకు నిలయాలుగా భాసిల్లుతున్నాయి.




