Indira Ekadashi 2026: ఇందిర ఏకాదశి విశిష్టత... పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశి రోజున ఏం చేయాలంటే

ఇందిర ఏకాదశి 2026 అక్టోబర్ 6న జరుపుకోనున్నారు. పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశి విశిష్టత, ఉపవాసం, దీపదానం, పూజా విధానం, తిథి సమయాలు, పితృదేవతల కోసం చేయాల్సిన ఆచారాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 29 Sept 2026 8:46 AM IST
Indira Ekadashi 2026: ఇందిర ఏకాదశి విశిష్టత... పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశి రోజున ఏం చేయాలంటే
X

Indira Ekadashi 2026: హిందూ సంప్రదాయంలో సంవత్సరానికి సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశినే ఇందిర ఏకాదశిగా పిలుస్తారు. ఆశ్వయుజ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఈ పవిత్రమైన రోజును విష్ణుభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఇందిర ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు పితృదేవతలను స్మరించుకోవడం, దానధర్మాలు చేయడం, దీపదానం చేయడం వంటి ఆచారాలకు ప్రాధాన్యం ఉంది. పూర్వీకుల కోసం భక్తితో చేసే పూజలు, తర్పణాలు వారికి శాంతిని చేకూరుస్తాయని విశ్వాసం. అలాగే పితృదోష నివారణకు ఈ ఏకాదశి వ్రతం ఉపకరిస్తుందని హిందూ ధార్మిక గ్రంథాలు పేర్కొంటాయి.

అక్టోబర్ 6న ఇందిర ఏకాదశి

2026లో ఇందిర ఏకాదశి అక్టోబర్ 6, మంగళవారం నాడు జరుపుకోనున్నారు. ఏకాదశి తిథి అక్టోబర్ 6న తెల్లవారుజామున 2:07 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 7న అర్ధరాత్రి 12:34 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తులు మరుసటి రోజు ద్వాదశి తిథిలో పారణ చేస్తారు. 2026లో పారణ సమయం అక్టోబర్ 7న ఉదయం 6:17 గంటల నుంచి 8:38 గంటల వరకు ఉంటుంది.

దీపదానానికి ప్రత్యేక స్థానం

ఇందిర ఏకాదశి రోజున చేసే ఆచారాల్లో దీపదానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నూనెతో దీపాన్ని వెలిగించి భగవంతుడికి సమర్పించడాన్ని దీపదానం అంటారు. పితృపక్షాల్లో పూర్వీకులను స్మరించుకుంటూ దీపదానం చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటారు. ఈ రోజున భక్తులు తమ శక్తికి అనుగుణంగా అన్నదానం, వస్త్రదానం, ధనదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా దానం చేసేటప్పుడు ఆడంబరానికి కాకుండా భక్తి, శ్రద్ధలకు ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దలు చెబుతారు.

ఏడు తరాల పితృదేవతలకు పుణ్యఫలం?

ఇందిర ఏకాదశి వ్రతం గురించి పద్మ పురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావన ఉన్నట్లు ధార్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. పూర్వీకులను ఉద్దేశించి ఏకాదశి రోజున ఉపవాసం, దానం, పూజా కార్యక్రమాలు చేస్తే వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ వ్రత ఫలితాన్ని పితృదేవతలకు అర్పించడం ద్వారా ఏడు తరాల వారికి కూడా పుణ్యఫలం చేకూరుతుందని పురాణ విశ్వాసం. పూర్వీకుల్లో ఎవరైనా తమ కర్మఫలంతో బాధలను అనుభవిస్తున్నట్లయితే, వారి కోసం భక్తితో చేసే ఇందిర ఏకాదశి వ్రతం వారికి విముక్తి కలిగిస్తుందని కూడా ధార్మిక కథనాలు పేర్కొంటాయి. విష్ణుభక్తితో చేసే ఈ వ్రతం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

ఇంద్రసేనుడి కథ ఏం చెబుతోంది?

ఇందిర ఏకాదశి వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ కూడా ఉంది. సత్యయుగంలో మహిష్మతి రాజ్యాన్ని పాలించిన ఇంద్రసేనుడు ధర్మబద్ధమైన రాజుగా, విష్ణుభక్తుడిగా పేరొందాడు. ఒకరోజు నారద మహర్షి అతని వద్దకు వచ్చి, అతని తండ్రి యమలోకంలో బాధలు అనుభవిస్తున్నాడని తెలిపారు. తండ్రికి విముక్తి కలగాలంటే ఇందిర ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించాలని నారదుడు సూచించాడు. దీంతో రాజు ఏకాదశి రోజున నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, పితృదేవతల కోసం శ్రాద్ధాది కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ వ్రతం, పూజల పుణ్యఫలాన్ని తండ్రికి అర్పించడంతో ఆయనకు విముక్తి లభించిందని పురాణ గాథ చెబుతోంది. తరువాత ఇంద్రసేనుడు కూడా తన జీవితకాలం పూర్తయ్యాక దైవలోకాన్ని చేరుకున్నాడని కథనం.

అందుకే పితృపక్షాల్లో వచ్చే ఇందిర ఏకాదశిని కేవలం ఉపవాస దినంగా కాకుండా పూర్వీకులను స్మరించుకునే పవిత్రమైన అవకాశంగా భక్తులు భావిస్తారు. ఆ రోజు విష్ణు నామస్మరణ, దీపదానం, దానధర్మాలు, పితృదేవతలకు సంబంధించిన కర్మలను శ్రద్ధతో నిర్వహించడం ఈ పర్వదినానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.