Rasagola Dibasa: జగన్నాథుడిపై లక్ష్మీదేవి అలక...పూరీలో జరిగే అద్భుత వేడుక వెనుకనున్న కథ ఇదే
పూరీ జగన్నాథుడి ఆయలంలో రథయాత్ర తరువాత నీలాద్రి విజే కార్యక్రమం అంగరంగ వైభవంగా, ప్రణయ కలహంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో రసగుల్లా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Rasagola Dibasa: భార్యకు చెప్పకుండా ఊరెళ్తే ఏ భర్తకైనా తిప్పలు తప్పవు.. అది సామాన్యుడికైనా, ఆ బ్రహ్మాండ నాయకుడైన పూరీ జగన్నాథుడికైనా సరే! తనను వెంటబెట్టుకుని వెళ్లకుండా, తోబుట్టువులతో కలసి గుండిచా ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చిన జగన్నాథుడికి మహాలక్ష్మి ఆలయ ద్వారాలు మూసివేసి గడియ పెట్టింది. జగన్నాథుడి రథయాత్ర ముగింపు ఘట్టమైన ‘నీలాద్రి విజే’ అంటే ఆలయ ప్రవేశం రోజున పూరీ క్షేత్రంలో జరిగే ఈ దివ్య ప్రణయ కలహ వేడుక ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ దివ్య ఘట్టం వెనుక ఉన్న అద్భుత ఆధ్యాత్మిక విశేషాలు రసగుల్లా తియ్యటి కథను తెలుసుకుందాం.
నీలాద్రి విజే .... జగన్నాథుడి రథయాత్ర ముగింపు
పూరీ రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవితో కలిసి తిరిగి పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకునే ఘట్టాన్ని 'నీలాద్రి విజే' అంటారు. రథాల నుంచి మూర్తులను ఒక్కొక్కటిగా రత్నసింహాసనం వైపు తీసుకెళ్లేందుకు 'గోటి పహండి' శోభాయాత్ర నిర్వహిస్తారు. బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయంలోకి వెళ్లినా, జగన్నాథుడిని మాత్రం జయ-విజయ ద్వారం వద్ద మహాలక్ష్మి అడ్డుకుంటుంది. తలుపులు మూసివేసిన లక్ష్మీదేవి అలక చెందుతుంది. స్వామివారు ఎంత వేడుకున్నా శరణు వేడని జగన్నాథుడిపై లక్ష్మీదేవి కోపం చల్లారదు.
రసగుల్లాతో చల్లారిన లక్ష్మీదేవి కోపం!
భార్య అలక తీర్చడానికి జగన్నాథుడు ఒక తియ్యటి ఉపాయం ఆలోచించాడు. ఒడిశా శైలిలో ప్రత్యేకంగా తయారు చేసిన నోరూరించే రసగుల్లాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసన్నం చేసుకున్నాడు. తియ్యటి రసగుల్లా రుచి చూసిన అమ్మవారి కోపం కరిగిపోయి, స్వామివారికి ఆలయ ప్రవేశం కల్పించింది. ఈ దివ్య సంఘటనకు గుర్తుగా ఒడిశా వ్యాప్తంగా ‘రసగుల్లా దివస్’ వైభవంగా జరుపుకుంటారు. 12వ శతాబ్దం నాటి ఈ సాంప్రదాయంలో భాగంగా భక్తులు రసగుల్లాలను స్వామివారికి నివేదించి పరస్పరం పంచుకుంటారు. నీలాద్రి విజే వేడుకలను చూసి తీరాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రణయ వేడుక.
ఒడిశా రసగుల్లా ప్రత్యేకత
ఒడిశా రసగుల్లాకు 2019 జులై 29న కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు మంజూరు చేసింది. పశ్చిమ బెంగాల్ రసగుల్లాతో పోలిస్తే ఒడిశా రసగుల్లా చాలా మెత్తగా, నమిలేందుకు వీలుగా ఉంటుంది. ఒడిశా రసగుల్ల చక్కెర పాకం పాకం పట్టే విధానం వల్ల ఇది లేత గోధుమ రంగులో మెరుస్తూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది. దేవుడికి భక్తుడిపై ఉండే వాత్సల్యానికి, స్వామికి అమ్మవారికి మధ్య ఉండే దివ్య ప్రణయ కలహానికి ప్రాతిపదిక అయిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేస్తుంది.




