Puri Jagannath: జగన్నాథుడి రథంపై 9 కుండల రహస్యం... అధరపాన కుండలను ఎందుకు పగలగొడతారో తెలుసా?

రథయాత్రలో భాగంగా జగన్నాథుడి రథాలపై 9 అధరపాన కుండలను ఉంచి పగలగొడతారు. ప్రసాదంగా వితరణ చేయకుండా అందులోని పానియాన్ని ఎందుకు నేలపాలు చేస్తారో తెలుసా?

Balachander
Published on: 27 July 2026 9:35 AM IST
Puri Jagannath: జగన్నాథుడి రథంపై 9 కుండల రహస్యం... అధరపాన కుండలను ఎందుకు పగలగొడతారో తెలుసా?
X

Puri Jagannath: పూరీ జగన్నాథుడి ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర అనగానే మనకు గుండిచా మందిర ప్రయాణం, లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు గుర్తుకొస్తాయి. అయితే, ఈ పవిత్ర రథయాత్ర ముగింపు దశలో స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే క్రమంలో అత్యంత విశిష్టమైన 'అధరపాన' ఘట్టం జరుగుతుంది. మూడు రథాలపై మొత్తం 9 మట్టి కుండలలో సమర్పించే ఈ దివ్య పానీయాన్ని భక్తులకు ప్రసాదంగా పంచరు, సరిసమానంగా రథాలపైనే పగలగొడతారు. అసలు ఈ విచిత్రమైన ఆచారం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం.

అధరపాన అంటే ఏమిటి? సమర్పించే విధానం ఇదే

'అధర' అంటే పెదవి అని అర్థం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల పెదవుల ఎత్తుకు సరిపడేలా ప్రత్యేకంగా తయారుచేసిన పొడవైన మట్టి కుండలలో ఈ పానీయాన్ని సమర్పిస్తారు కాబట్టి దీనికి 'అధరపాన' అని పేరు వచ్చింది. రథోత్సవంలో ఏర్పాటు చేసిన మూడు రథాల్లోకి మూడు మూడు చొప్పున మొత్తం 9 మట్టి కుండలను ఉంచుతారు. ఇక మూడు రథాల్లో మూడు మూడు కుండలను ఎవరు ఏర్పాటు చేయాలి అన్నదానిపై కూడా శాస్త్ర నియమం ఉంది. ఒక కుండను శ్రీ జగన్నాథుడి ఆలయ యాజమాన్యం ఏర్పాటు చేస్తే, రెండో కుండను బడా ఒడియా మఠం ఏర్పాటు చేస్తుంది. ఇక మూడో కుండను రాఘవ దాస్‌ మఠం సిద్ధం చేస్తుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పెద్ద మట్టి కుండల్లో పాలు, పెరుగు, ఛేనా అంటే పాకం తీసిన జున్ను, చక్కెర, నెయ్యి, అరటిపళ్ళు, కర్పూరం, సుగంధ ద్రవ్యాలను కలగలిపి 'మహాసుఆరా' అనే ఈ పానీయాన్ని తయారు చేస్తారు. 'పానియా సేవాయత్‌లు' ఛౌనీ మఠం నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని దీనికి ఉపయోగిస్తారు.

కుండలను ఎందుకు పగలగొడతారు?

ఈ దివ్య పానీయాన్ని పూజానంతరం భక్తులకు ప్రసాదంగా పంచకుండా, రథాల పైననే పగలగొట్టి నేలపాలు చేస్తారు. దీని వెనుక అత్యంత ఆధ్యాత్మికమైన లోతైన తత్వశాస్త్రం దాగి ఉంది. రథయాత్ర సమయంలో జగన్నాథుని దర్శనార్థం దేవతలు, యక్షులు, గంధర్వులు, దిక్పాలకులు మాత్రమే కాక ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించలేని అనేక అదృశ్య శక్తులు, తిరుగుతున్న ఆత్మలు రథం వెంట వస్తాయి. వారికి తృప్తి, ముక్తిని కలిగించడానికే ఈ అధరపానను సమర్పించి, రథంపై కుండలను పగలగొడతారు. ఇక ఈ రథంపై ప్రవహించిన ఈ పానీయం గజపతి మహారాజు భవనం ప్రాంగణం వరకు చేరుకుంటుంది. ఇలా చేరుకోవడంతో ఈ అధరపాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. జగన్నాథుని కరుణ కేవలం మనుషులకు, ఆలయంలోకి వచ్చేవారికే పరిమితం కాదు. ఈ సృష్టిలోని ప్రతి కనిపించే, కనిపించని జీవరాశికి, దేహము లేని ఆత్మలకు కూడా ఆయన కృపాకటాక్షాలు లభిస్తాయని ఈ 'అధరపాన' ఘట్టం మనకు చాటిచెబుతోంది. ఇది ఈ కుండల రహస్యం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story