Kaal Bhairav Jayanti 2026: భయాలు, ఆటంకాలు తొలగించే కాలభైరవుడి పూజ...డిసెంబర్‌ 1 ఒక్కరోజే అవకాశం

2026 కాలభైరవ జయంతి డిసెంబర్ 1న జరుపుకుంటారు. అష్టమి తిథి సమయాలు, కాలభైరవుడి పూజా విధానం, మంత్రం, ఆచారాలు మరియు విశేషాలను తెలుసుకుందాం.

Rudrachander
Published on: 27 Nov 2026 12:13 PM IST
Kaal Bhairav Jayanti 2026: భయాలు, ఆటంకాలు తొలగించే కాలభైరవుడి పూజ...డిసెంబర్‌ 1 ఒక్కరోజే అవకాశం
X

Kaal Bhairav Jayanti 2026: హిందూ సంప్రదాయంలో కాలభైరవ జయంతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పరమశివుడి ఉగ్రరూపంగా భావించే కాలభైరవుడిని ఈ రోజున పూజిస్తే భయాలు తొలగి, జీవితంలోని అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున ఈ జయంతిని నిర్వహిస్తారు. 2026లో డిసెంబర్‌ 1వ తేదీన కాలభైరవ జయంతి రానుంది. ఈ సందర్భంగా స్వామివారిని పూజించడం, ఆయనకు సంబంధించిన పురాణగాథను తెలుసుకోవడం భక్తులకు విశేషమైన అనుభూతిని కలిగిస్తుంది.

కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు?

పురాణ కథనాల ప్రకారం.. ఒకసారి బ్రహ్మదేవుడికి తన సృష్టిశక్తిపై గర్వం పెరిగింది. ఈ విశ్వంలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించడంతో పాటు, పరమశివుడి ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నించాడని చెబుతారు. బ్రహ్మదేవుడి ఈ అహంకారాన్ని అణచివేయడానికి శివుడి కోపం, దివ్యశక్తి నుంచి కాలభైరవుడు ఆవిర్భవించినట్లు పురాణాలు వివరిస్తాయి. కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించాడని కథనం. ఈ సంఘటనతో ఆయనకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుందని చెబుతారు. ఆ పాపం నుంచి విముక్తి పొందేందుకు బ్రహ్మదేవుడి తెగిన తల చేతిలో ఉండగానే కాలభైరవుడు మూడు లోకాల్లో సంచరించాడు. చివరకు కాశీ నగరానికి చేరుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న బ్రహ్మ కపాలం కింద పడిపోయిందని పురాణగాథ చెబుతుంది. దీంతో కాలభైరవుడు పాపవిముక్తి పొందాడు. అప్పటి నుంచి కాశీ క్షేత్రానికి రక్షకుడిగా, నగర పాలకుడిగా ఆయనను భక్తులు కొలుస్తున్నారు. అందుకే కాశీ విశ్వనాథుడి దర్శనంతో పాటు కాలభైరవ స్వామిని దర్శించుకోవడం కూడా ముఖ్యమని భావిస్తారు.

కాలభైరవ జయంతి 2026 పూజా సమయం

హిందూ పంచాంగం ప్రకారం 2026 డిసెంబర్‌ 1న మార్గశిర మాస కృష్ణ పక్ష అష్టమి తిథి వస్తోంది. అష్టమి తిథి డిసెంబర్‌ 1 అర్ధరాత్రి 12:11 గంటలకు ప్రారంభమౌతుంది. ఇక తిథి డిసెంబర్‌ 1 రాత్రి 11:13 గంటలకు వరకు ఉంటుంది. ఈ తిథి సమయంలో భక్తులు కాలభైరవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించవచ్చు.

జయంతి రోజున పాటించాల్సిన పూజా విధానాలు

కాలభైరవ జయంతి సందర్భంగా సాయంత్రం స్వామివారి పేరుతో ఆవాల నూనెతో దీపం వెలిగించడం మంచిదని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కుక్కకు ఆహారం పెట్టడం కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందే సంప్రదాయంగా భావిస్తారు. ఆలయానికి వెళ్లే అవకాశం ఉంటే నల్ల నువ్వులు, పూలు సమర్పించి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ రోజున 'ఓం కాలభైరవాయ నమః' మంత్రాన్ని 108 సార్లు ప్రశాంతమైన మనసుతో జపించాలని చెబుతారు. దీనివల్ల మనసులో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తుల నమ్మకం. వీలైనంత వరకు పేదలకు సహాయం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కూడా ఈ పర్వదినం ఇచ్చే ముఖ్యమైన సందేశం. కాలభైరవ జయంతి కేవలం పూజలకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. అహంకారాన్ని విడిచిపెట్టి, ధైర్యంగా జీవన సవాళ్లను ఎదుర్కోవాలని గుర్తుచేసే ఆధ్యాత్మిక సందర్భం కూడా. ఎదుటివారికి హాని చేయకుండా, మంచి పనులు చేస్తూ జీవించడమే నిజమైన దైవభక్తి అనే భావనను ఈ పర్వదినం తెలియజేస్తుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు