Kaal Sarp Dosha: వివాహాలు ఆలస్యమవ్వడానికి కాలసర్పదోషాలే కారణమా? పండితులు ఏం చెబుతున్నారంటే

కాలసర్పదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుందా? కాలసర్ప యోగం అంటే ఏమిటి, 12 రకాల యోగాలు, వివాహంపై ప్రభావం, పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 25 Sept 2026 8:46 AM IST
Kaal Sarp Dosha: వివాహాలు ఆలస్యమవ్వడానికి కాలసర్పదోషాలే కారణమా?  పండితులు ఏం చెబుతున్నారంటే
X

Kaal Sarp Dosha: వివాహం ఆలస్యమవుతోంది.. ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడం లేదు.. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆటంకాలు వస్తున్నాయి.. ఇలా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు జాతకంలో ఉన్న ‘కాలసర్పదోషం’నే కారణంగా భావించే వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈ దోషం పేరు వినగానే ఆందోళన చెందడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే జాతకంలో కాలసర్ప యోగం ఉందని మాత్రమే భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ యోగాన్ని పూర్తిగా జాతకంలోని ఇతర గ్రహస్థితులతో కలిపి పరిశీలించిన తర్వాతే దాని ప్రభావాన్ని అంచనా వేయాలని సూచిస్తున్నారు.

అసలు కాలసర్ప యోగం అంటే ఏమిటి?

జ్యోతిష్య సంప్రదాయంలో రాహు, కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య ఒక నిర్దిష్ట క్రమంలో ఉన్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుందని పండితులు వివరిస్తారు. దీన్ని ప్రధానంగా సవ్య కాలసర్ప యోగం, అపసవ్య కాలసర్ప యోగంగా రెండు విధాలుగా పేర్కొంటారు. సవ్య యోగంలో రాహువు ముందుభాగంలో, కేతువు ఏడో స్థానంలో ఉండగా మిగిలిన గ్రహాలు వాటి మధ్య ఉంటాయి. అదే అపసవ్య యోగంలో కేతువు లగ్నంలో, రాహువు సప్తమ స్థానంలో ఉండి ఇతర గ్రహాలు మధ్యలో ఉన్న పరిస్థితిని సూచిస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. కాలసర్ప యోగం ఉందంటే తప్పనిసరిగా చెడు ఫలితాలే వస్తాయని చెప్పలేమని పండితులు అంటున్నారు. రాహు, కేతువులు ఏ రాశిలో ఉన్నారు? ఇతర గ్రహాల బలం ఎలా ఉంది? లగ్నాధిపతి, సప్తమాధిపతి పరిస్థితి ఏమిటి? వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

12 రకాలుగా కాలసర్ప యోగం

జాతకంలోని రాహు, కేతువుల స్థానాలను బట్టి కాలసర్ప యోగాన్ని 12 రకాలుగా వివరిస్తారు. లగ్నంలో రాహువు, ఏడో స్థానంలో కేతువు ఉంటే అనంత కాలసర్పదోషంగా పేర్కొంటారు. రెండో స్థానంలో రాహువు, ఎనిమిదో స్థానంలో కేతువు ఉంటే గుళిక కాలసర్పదోషంగా చెబుతారు. మూడో-తొమ్మిదో స్థానాల్లో రాహు-కేతువులు ఉంటే వాసుకి, నాలుగు-పది స్థానాల్లో ఉంటే శంఖపాల, ఐదు-పదకొండు స్థానాల్లో ఉంటే పద్మ, ఆరు-పన్నెండు స్థానాల్లో ఉంటే మహాపద్మ కాలసర్ప యోగాలుగా పేర్కొంటారు.

ఇక ఏడో స్థానంలో రాహువు, లగ్నంలో కేతువు ఉంటే తక్షక, ఎనిమిదో-రెండో స్థానాల్లో ఉంటే కర్కోటక, తొమ్మిది-మూడో స్థానాల్లో ఉంటే శంఖచూడ, పది-నాలుగు స్థానాల్లో ఉంటే ఘటక, పదకొండు-ఐదు స్థానాల్లో ఉంటే విషదాన, పన్నెండు-ఆరు స్థానాల్లో ఉంటే శేషనాగ కాలసర్ప యోగాలుగా జ్యోతిష్య సంప్రదాయంలో పేర్కొంటారు.

మరి వివాహం ఆలస్యం కావడానికి ఇదొక్కటే కారణమా?

ఇదే ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రధాన సందేహం. కేవలం కాలసర్పదోషం ఉందని చెప్పి వివాహం ఆలస్యం అవుతుందని నిర్ణయించకూడదని పండితులు చెబుతున్నారు. వివాహానికి సంబంధించిన ఏడో భావం, ఏడో స్థానాధిపతి, శుక్రుడు, గురువు, దశా-భుక్తులు తదితర అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల జాతకంలో కాలసర్ప యోగం కనిపించిందని వెంటనే భయపడటం లేదా వివాహం విషయంలో ప్రతికూల నిర్ణయానికి రావడం సరికాదని సూచిస్తున్నారు.

కొన్ని స్థానాల్లో ప్రభావం తగ్గుతుందని వివరణ

రాహు, కేతువులు కొన్ని అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు కాలసర్ప యోగ ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. ముఖ్యంగా రాహువు వృషభంలో, కేతువు వృశ్చికంలో ఉండటం వంటి కొన్ని స్థితులను పండితులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆయా గ్రహాల బలం, రాశి స్థానం, ఇతర గ్రహాల సంబంధాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.

పరిహారాలు ఏంటి?

కాలసర్ప యోగం ఉందని భయపడకుండా దైవచింతన, నియమబద్ధమైన జీవనం, ఆధ్యాత్మిక సాధన కొనసాగించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. రాహు-కేతువులకు సంబంధించిన శాంతి పూజలు చేయించుకోవడం, నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వంటి పరిహారాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా జాతకంలో ఒకే యోగాన్ని చూసి జీవితంపై నిర్ణయానికి రాకుండా, మొత్తం జాతకాన్ని పరిశీలించడమే ప్రధానమని పండితుల సూచన. కాలసర్పదోషం పేరు వినగానే భయపడటం కంటే, దాని స్థానం, ప్రభావం, ఇతర గ్రహాల బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఇదే ఈ అంశంలో గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.