Kakanmath Temple Mystery: శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్న కాకన్మఠ్ ఆలయం...రాత్రివేళ ఆలయం నుంచి వింతశబ్దాలు
Kakanmath Temple Mystery: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో ఉన్న కాకన్మఠ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.
Kakanmath Temple Mystery
Kakanmath Temple Mystery: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో ఉన్న కాకన్మఠ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం, నిర్మాణ శైలితోనే శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వినిపించే వింత శబ్దాలు ఈ ఆలయాన్ని మరింత మర్మమైనదిగా మార్చాయి.
ఆలయ నిర్మాణం
క్రీ.శ. 1015 ప్రాంతంలో కుష్వాహ వంశానికి చెందిన రాజు కీర్తిరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆయన భార్య కాకనవతి దేవి మహా శివుడికి అపారమైన భక్తురాలు కావడంతో, ఆమె కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆమె పేరుమీదగానే ఈ ఆలయానికి “కాకన్మఠ్” అనే పేరు వచ్చింది. అయితే స్థానికంగా మరో విశేషమైన కథనం ప్రచారంలో ఉంది. ఒక రాత్రిలోనే దెయ్యాలు ఈ ఆలయాన్ని నిర్మించాయని ప్రజలు నమ్ముతారు. రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న రాళ్లను తీసుకువచ్చి అద్భుతమైన క్రమపద్ధతిలో ఆలయాన్ని నిర్మించాయని, తెల్లవారేలోపే పూర్తి చేయాలనుకున్నప్పటికీ పూర్తికాకపోవడంతో...చివరికి అసంపూర్తిగా వదిలి వెళ్లిపోయాయని చెబుతారు. అందుకే ఆలయం కొంత భాగం అసంపూర్తిగా కనిపిస్తుందని భావిస్తారు.
ఈ ఆలయ నిర్మాణమే దీని గొప్ప ప్రత్యేకత. సుమారు 120 అడుగుల ఎత్తు ఉన్న ఈ నిర్మాణంలో ఎక్కడా సున్నం లేదా ఇతర బంధక పదార్థాలు ఉపయోగించలేదు. భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి సమతుల్యంగా అమర్చి నిర్మించారు. ఈ రాళ్ల మధ్య ఏదైనా చిన్న కదలిక జరిగినా మొత్తం నిర్మాణం కూలిపోతుంది. అయినప్పటికీ వెయ్యేళ్ల కాలం గడిచినా ఆలయం ఇప్పటికీ నిలబడి ఉండటం ఒక అద్భుతమే.
విదేశీయుల దండయాత్ర
13వ శతాబ్దంలో విదేశీ దండయాత్రల సమయంలో ఈ ఆలయం కొంతవరకు ధ్వంసమైంది. అయినప్పటికీ ప్రధాన నిర్మాణం ఇంకా నిలిచివుండటం విశేషం. కాలం మారినా, ప్రకృతి విపత్తులు సంభవించినా ఈ ఆలయాన్ని కదిలించలేకపోవడం శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ఈ నిర్మాణం వెనుక ఉన్న శిల్పకళ, గణిత సూత్రాలు అంతుచిక్కని విధంగా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆలయంలోని గర్భాలయం నుంచి రాత్రివేళ వింత వింత శబ్దాలు వస్తుంటాయి. విచిత్రమైన శబ్దాలను చాలా మంది గ్రామస్తులు గమనించారు. అప్పటి నుంచి సాయంత్రం కాగానే ఆలయం వైపు వెళ్లడం మానేశారు. ఇలా వస్తున్న శబ్దాలకు కారణమేంటన్నది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అద్భుతమైన ఆలయ నిర్మాణం, చరిత్ర, శిల్పకళ, మర్మం కలిసి ఈ ఆలయాన్ని రహస్యమైన ఆలయంగా మార్చేశాయి. ఆలయంలోని ఒక్కరానికి కదిలించినా 120 అడుగుల ఎత్తైన నిర్మాణం ఎందుకు ఊగిపోతుందో...రాత్రివేళ ఎందుకు శబ్దాలు వస్తాయో ఎవరికీ అంతుపట్టలేదు. ఇదే ఈ ఆలయం రహస్యం. స్వామిని దర్శించుకొని పూజించినవారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని స్థానికుల విశ్వాసం.


