Kali Yuga Secrets: పాండవులను భయపెట్టిన కల్కి...కలియుగంలో నిజంగానే ఇలా జరుగుతుందా?

ద్వాపరయుగం చివరి దశలో కలిపురుషుడు పాండవులకు ఎదురై మూడు ప్రశ్నలు ప్రశ్నిస్తాడు. ఆ మూడు ప్రశ్నలు ఏమిటో...ఎందుకు ప్రశ్నించాడో తెలుసుకుందాం.

Balachander
Published on: 31 Aug 2026 7:51 AM IST
Kali Yuga Secrets: పాండవులను భయపెట్టిన కల్కి...కలియుగంలో నిజంగానే ఇలా జరుగుతుందా?
X

Kali Yuga Secrets: మహాభారతంలో ద్వాపర యుగం అంతమొందే వేళ, కలియుగ అడుగుజాడలను సూచిస్తూ పాండవులకు కలిపురుషుడు ఎదురైన ఘట్టం అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది. పర్వతాల వంటి కష్టాలనైనా ఎదిరించగల పంచపాండవులను సైతం కలిపురుషుడు అడిగిన మూడు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు నేటి కలియుగ యథార్థ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మరి ఆ ప్రశ్నలు ఏమిటి? కలియుగంలో జరుగుతున్న అంశాలు ఏమిటో తెలుసుకుందాం.

మొదటి ప్రశ్నః కన్నవారి బాధ్యత .... ఏడు చిన్న బావులు

గుర్రం యజమాని రూపంలో ఉన్న కలిపురుషుడు సహదేవుడిని అడిగిన మొదటి ప్రశ్న అడుగుతాడు. "ఒక పెద్ద బావిలోని నీటితో ఏడు చిన్న బావులను నింపవచ్చు, కానీ ఆ ఏడు చిన్న బావుల నీటితో పెద్ద బావిని ఎందుకు నింపలేము?" అని ప్రశ్నిస్తాడు. సహదేవుడు చెప్పలేని ప్రశ్నను ధర్మరాజు సమాధానంగా వివరిస్తాడు. పెద్ద బావి అంటే కన్నతండ్రి, కన్నతల్లి. చిన్న బావులు అంటే వారి సంతానం. తల్లిదండ్రులు తమకున్న పరిమిత వనరులతో ఎంతమంది పిల్లలనైనా పెంచి పెద్ద చేస్తారు. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధులయ్యాక, ఆ ఏడుగురు పిల్లలు కలిసి కూడా కన్నవారికి నీడనివ్వలేక భారంగా భావిస్తారనే కలియుగ నైజాన్ని ఇది సూచిస్తోందని ధర్మరాజు చెబుతాడు.

రెండవ ప్రశ్నః సూది రంధ్రం ...ఏనుగు తోక

నకులుడిని అడిగిన రెండవ ప్రశ్న.... "సూది రంధ్రం గుండా పెద్ద ఏనుగు అవతలి వైపుకు వెళ్ళిపోయింది కానీ, దానికి ఉన్న చిన్న తోక మాత్రం ఇరుక్కుపోయింది ఎందుకు?" అని ప్రశ్నిస్తాడు. అయితే, దీనికి కూడా ధర్మరాజు తన విచక్షణా జ్ఞానంతో సమాధానం చెబుతాడు. ఇక్కడ ఏనుగు అంటే మహా అవినీతిపరులు, పెద్ద శక్తులు. తోక అంటే చిన్నపాటి తప్పులు చేసే సామాన్యులు. కలియుగంలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడే ధనవంతులు చట్టాలలోని లోసుగులు లనే రంధ్రాల గుండా సులువుగా తప్పించుకుంటారు. కానీ చిన్నపాటి తప్పులు చేసిన సామాన్యులు మాత్రం వ్యవస్థల చిక్కుల్లో బలైపోతారని దీని అంతరార్థం అని చెబుతాడు.

మూడవ ప్రశ్నః గట్టుల రక్షణలో మాయమైన ధాన్యం

భీముడికి ఎదురైన మూడవ ప్రశ్న... "పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్లు రక్షణగా ఉన్నప్పటికీ, పండిన ధాన్యం మొత్తం ఎలా మాయమైంది?" అని ప్రశ్నించగా... ధర్మరాజు ఇలా విశ్లేషించి చెబుతాడు. పొలంలో ధాన్యం అంటే ప్రజల కష్టం, వారికి దక్కాల్సిన ఫలాలు. చుట్టూ ఉన్న గట్లు అంటే పాలకులు, అధికారులు, రక్షకులు. రక్షణగా ఉండాల్సిన అధికారులే ప్రజలకు చెందాల్సిన సంక్షేమాన్ని, ఫలాలను స్వాహా చేస్తారనే యథార్థానికి ఇది ప్రతీక అని చెబుతాడు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించిన ధర్మరాజు, ఇవి రాబోయే కలియుగ ధర్మ నాశనానికి సంకేతాలని గ్రహించి భయపడ్డారు. భగవద్గీతలో తెలిపినట్లుగా, ఎంతటి కలియుగ ప్రభావం ఉన్నప్పటికీ భగవంతుని నామస్మరణ, సత్యం, ధర్మం అనే మార్గంలో నడిచే భక్తులను ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడుతాడనేది ఈ ఘట్టం మనకు అందించే పవిత్ర సందేశం. ధర్మాన్ని అనుసరించి కలియుగంలో నడుచుకుంటే ఆ పరమాత్మనే మన వెంట ఉండి మనల్ని రక్షిస్తాడు. ఆపదల నుంచి కాపాడతాడు. ఎలాంటి విపత్తులు ఎదురైనా మొగ్గలోనే తుంచేస్తాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story