Kalkaji Mata Temple: అక్బర్‌ పూజించిన కల్కాజీమాత.... పాండవుల విజయానికి ఇదే కారణం

దిల్లీలోని 3,000 ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మాత ఆలయ విశేషాలు, పాండవుల పూజ, అక్బర్ సమర్పించిన 84 గంటలు, 12 ద్వారాలు, నవరాత్రి మహోత్సవాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 28 Aug 2026 11:26 AM IST
Kalkaji Mata Temple: అక్బర్‌ పూజించిన కల్కాజీమాత.... పాండవుల విజయానికి ఇదే కారణం
X

Kalkaji Mata Temple: భారతదేశంలో అరుదుగా లభించే దివ్య సిద్ధపీఠాలలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ మాత ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఆరావళి పర్వత శ్రేణిలోని సూర్యకూట్ పర్వతంపై కొలువైన ఈ మహాకాళీ పీఠం సుమారు 3,000 సంవత్సరాల పురాతన చరిత్రను కలిగి ఉంది. కురుక్షేత్ర మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులతో కలసి ఇక్కడ పూజలు నిర్వహించడమే కాకుండా, మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఈ క్షేత్ర మహిమకు మైమరిచి 84 విశేషమైన గంటలను సమర్పించడం ఇక్కడి దివ్యత్వానికి నిదర్శనం. సకల పాపాలను, సంకటాలను నివారించే ఈ దివ్య సిద్ధపీఠపు విశేషాలు, పౌరాణిక ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.

పాండవుల విజయ రహస్యం ... సిద్ధపీఠ ఆవిర్భావం

పౌరాణిక గాథల ప్రకారం, కురుక్షేత్ర యుద్దంలో విజయం సాధించడం కోసం శ్రీకృష్ణుడు పాండవులను సూర్యకూట్ పర్వతానికి తీసుకెళ్లి మహాకాళీ అమ్మవారిని ఆరాధింపజేశారు. భగవతి మాత దివ్య ఆశీస్సులతోనే పాండవులు ధర్మయుద్ధంలో రక్షణ పొందారని విశ్వసిస్తారు. తదనంతరం శ్రీ కల్కాజీ మాత పరమ భక్తుడైన బాబా బాలక్‌నాథ్ ఇక్కడ తపస్సు ఆచరించి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొంది ఆలయాన్ని పునర్నిర్మించారు.

అక్బర్ సమర్పించిన 84 గంటలు ...మరాఠాల నిర్మాణం

క్రీస్తుశకం 1764లో మరాఠాలు ఈ ఆలయ పాత నిర్మాణాన్ని పునరుద్ధరించారు. అదేవిధంగా అక్బర్ చక్రవర్తి అమ్మవారి శక్తులకు ప్రభావితుడై ఈ ఆలయానికి 84 విశేష గంటలను బహుకరించాడు. ఈ గంటల ప్రత్యేకత ఏమిటంటే ...ఒక్కో గంట మోగినప్పుడు ఒక్కో విభిన్నమైన ధ్వని వస్తుంది. నేటికీ ఆ విశేషాలను ఆలయంలో చూడవచ్చు.

12 ద్వారాల పిరమిడ్ నిర్మాణం ... 300 ఏళ్లనాటి హవన కుండం

గర్భాలయం పిరమిడ్ ఆకారంలో ఉండగా, మిగిలిన ప్రాంగణం లోటస్ ఆకృతిలో నిర్మించబడింది. ప్రధాన ఆలయానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఈ 12 ద్వారాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీకలు. ప్రతి ద్వారం వద్ద మాతృదేవత వేర్వేరు దివ్య రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. అంతేకాదు, ఆలయంలో సుమారు 300 సంవత్సరాల పురాతనమైన పవిత్ర హవన కుండం ఉంది. ఇక్కడ ప్రతిరోజూ నిరంతరాయంగా హవనం జరుగుతుంది.

గ్రహణ కాలంలోనూ తెరిచే అరుదైన గర్భగుడి

సాధారణంగా గ్రహణ సమయంలో దేశమంతటా ఆలయ ద్వారాలు మూసివేస్తారు. కానీ కల్కాజీ మాత క్షేత్రంలో మాత్రం గ్రహణ సమయంలో ఆలయం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు ఆచరిస్తారు.

16 రకాల అలంకారాలు ... నవరాత్రి మహోత్సవాలు

నిత్యం అమ్మవారికి రెండు పూటలా అద్భుతమైన అలంకారాలు జరుగుతాయి. ఉదయం వేళ పూలు, వస్త్రాలతో 16 రకాల శృంగార అలంకారం, సాయంత్రం దివ్య ఆభరణాలతో అర్చనలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ 150 కిలోల తాజా పుష్పాలతో అమ్మవారిని అలంకరించి, ఆ తర్వాతి రోజు ఆ పుష్పాలను ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. నవరాత్రులలో రోజుకు 1,50,000 నుండి 2,00,000 మంది భక్తులు ఈ మహాకాళీ దేవిని దర్శించుకుని ధన్యులవుతారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story