Kamakhya: నరకం నుంచి విముక్తి కలిగించే మెట్లు... కామాఖ్యలో ఇవే ప్రత్యేకం
కామాఖ్య ఆలయంలో ఇప్పటికీ కనిపించే అసంపూర్తి మెట్ల వెనుక కథేంటి? నరకాసురుడు ఒక్క రాత్రిలో నిర్మించిన ఈ మెట్లకు సంబంధించిన ఆసక్తికరమైన పురాణ విశేషాలను తెలుసుకుందాం.
Kamakhya: ఒక ఆలయం.. ఎన్నో విశేషాలు. అందులోనూ ఇప్పటికీ పూర్తికాని కొన్ని మెట్లు. వాటిని నిర్మించింది మరెవరో కాదు.. పురాణాల్లో రాక్షసుడిగా చెప్పుకునే నరకాసురుడే. ఒక్క రాత్రిలోనే ఈ మెట్లను నిర్మించాలన్న సవాలు.. తెల్లవారిందని నమ్మించేలా అమ్మవారు వేసిన ఎత్తుగడ.. చివరకు అసంపూర్తిగా మిగిలిపోయిన మెట్లు. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయానికి సంబంధించిన ఈ కథ ఇప్పటికీ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ మెట్లను దర్శిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందని స్థానికంగా ఒక విశ్వాసం కూడా ఉంది.
కామాఖ్య...మన్మథుడు నిర్మించిన ఆలయం
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నీలాచల్ పర్వతంపై ఉన్న కామాఖ్య దేవాలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని సాధారణ విగ్రహ రూపంలో కాకుండా శక్తి స్వరూపానికి ప్రతీకగా పూజిస్తారు. ప్రతి ఏడాది జరిగే అంబుబాచి జాతర సమయంలో దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా సాధువులు, తాంత్రికులు ఈ సమయంలో కామాఖ్యను దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
కామాఖ్య ఆలయానికి సంబంధించిన పురాణ కథల్లో మన్మథుడు, సతీదేవి, నరకాసురుడి కథలు ముఖ్యమైనవి. సతీదేవి దేహత్యాగం అనంతరం శివుడు తీవ్ర తపస్సులోకి వెళ్లాడని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో దేవతల కోరిక మేరకు మన్మథుడు శివుడి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రంతో మన్మథుడిని భస్మం చేస్తాడు.
తర్వాత రతీదేవి వేడుకోవడంతో మన్మథుడికి ప్రాణం లభించినా, అతని పూర్వ రూపం, శక్తులు తిరిగి రావు. దీంతో మన్మథుడు శివుడిని ప్రార్థిస్తాడు. సతీదేవి శరీర భాగం పడిన పవిత్ర ప్రదేశంలో ఆలయం నిర్మిస్తే తన పూర్వ వైభవం తిరిగి వస్తుందని శివుడు సూచించినట్లు పురాణ కథనం. ఆ మేరకు నీలాచల్ పర్వతంపై మన్మథుడు ఆలయాన్ని నిర్మించాడని, దాంతో అతనికి తన రూపం, శక్తులు తిరిగి వచ్చాయని విశ్వాసం.
నరకాసురుడి ఓటమి...మెట్ల నిర్మాణం
ఇక అసలు ఆసక్తికరమైన కథ నరకాసురుడి దగ్గర మొదలవుతుంది. కామాఖ్య అమ్మవారి సౌందర్యానికి ఆకర్షితుడైన నరకాసురుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అతడి పట్టుదల నుంచి తప్పించుకోవడానికి అమ్మవారు ఒక షరతు పెడుతుంది. ఒక్క రాత్రిలో నీలాచల్ పర్వతంపై ఆలయానికి చేరుకునేలా మెట్ల నిర్మాణం పూర్తి చేస్తే అతడిని వివాహం చేసుకుంటానని చెబుతుంది. నరకాసురుడు సవాలును స్వీకరిస్తాడు. రాత్రంతా వేగంగా మెట్లు నిర్మించడం ప్రారంభిస్తాడు. పని పూర్తయ్యే సూచనలు కనిపించడంతో అమ్మవారు ఒక ఉపాయం ఆలోచిస్తుంది. తెల్లవారకముందే ఓ కాకితో కోడి కూత వేయిస్తుంది. కోడి కూత వినిపించడంతో తెల్లవారిందని భావించిన నరకాసురుడు నిర్మాణాన్ని ఆపేస్తాడు. తర్వాత అది అమ్మవారి పన్నాగమని తెలుసుకున్న నరకాసురుడు ఆ కాకిని చంపాడని పురాణ కథనం. ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని ‘కుకుర్కట’గా పిలుస్తారని చెబుతారు. అక్కడ ఇప్పటికీ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని స్థానిక విశ్వాసం.
నరకం నుంచి విముక్తి
ఇలా నరకాసురుడు నిర్మించిన మెట్ల నిర్మాణం పూర్తికాకుండానే ఆగిపోయిందని కథనం. కాలం మారినా ఈ అసంపూర్తి మెట్లకు సంబంధించిన పురాణ గాథ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ మెట్లను దర్శిస్తే నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు. అది విశ్వాసమే అయినప్పటికీ.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఈ అసంపూర్తి మెట్లు మాత్రం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.




