Kamika Ekadashi 2026: కామిక ఏకాదశి రోజున ఈ ఒక్కపని చేస్తే... మీ అదృష్టం మారిపోతుంది
ఆగస్టు 9న వచ్చే ఏకాదశి రోజున ఉపవాసంతో పాటు ఈ చిన్న పని చేస్తే లక్ష్మీనారాయణుల కరుణాకటాక్షం మీ సొంతం అవుతుంది.
Kamika Ekadashi 2026: కామిక ఏకాదశి అంటే కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు. మన పాపాలను ప్రక్షాళన చేసుకుని, అదృష్టాన్ని వరించే ఒక అద్భుతమైన పవిత్ర సమయం. హిందూ సాంప్రదాయంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఆషాఢం చివరి, ఆగస్టులో వచ్చే మొదటి ఏకాదశి కామిక ఏకాదశి. ఈ ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ ఏడాది 2026 ఆగస్టు 9వ తేదీ, ఆదివారం నాడు కామిక ఏకాదశి వస్తోంది. ఆగస్టు 8వ తేదీ ఉదయం 09:29 గంటలకు తిథి ప్రారంభమై, ఆగస్టు 9వ తేదీ ఉదయం 06:34 గంటలకు ముగుస్తుంది. ఇక ఉపవాస విరమణ సమయం ఆగస్టు 10వ తేదీ ఉదయం 05:35 నుండి 08:37 గంటల వరకు ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీమహావిష్ణువును శ్రీధర రూపంలో పూజిస్తే, గంగా నదిలో పవిత్ర స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఒక్క దీపం... సకల పాపహరణం
కామిక ఏకాదశి విశిష్టతను స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక గ్రామంలో బలవంతుడైన ఒక జమీందారు ఉండేవాడు. తొందరపాటు, ఆవేశం ఎక్కువ ఉన్న ఆ జమీందారు, ఒక రోజు కోపంలో ఊరిలోని ఒక బ్రాహ్మణుడితో గొడవపడి, అజ్ఞానంతో అతడిని హతమార్చాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపపడ్డాడు.
బ్రహ్మహత్యా పాతకం చుట్టుముట్టడంతో జమీందారు మనశ్శాంతిని కోల్పోయాడు. శ్రాద్ధ కర్మలు చేయడానికి సిద్ధపడగా, ఆ ఊరి పండితులు అతడి ఇంటి భోజనాన్ని తిరస్కరించారు. పాపభారంతో కుంగిపోయిన ఆ జమీందారు ఒక మహర్షిని ఆశ్రయించి, "స్వామి నా ఆవేశం నన్ను మహాపాపిని చేసింది. ఈ పాపం నుండి నన్ను రక్షించే మార్గం చూపండి" అని వేడుకున్నాడు.
అప్పుడు ఆ మహర్షి... "శ్రావణ మాసంలో (ఉత్తర భారత పంచాంగం ప్రకారం) వచ్చే కామిక ఏకాదశి నాడు శ్రీహరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు. శ్రీ మహా విష్ణువు ముందు నువ్వులు లేదా నెయ్యితో దీపం వెలిగించి, ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉండు" అని సలహా ఇచ్చాడు. జమీందారు మహర్షి చెప్పినట్లే భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పశ్చాత్తాపానికి, నిష్కల్మష భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, అతడి బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించి, మోక్షాన్ని ప్రసాదించాడు.
కామిక ఏకాదశి రోజున మీరు చేయాల్సిన ఆ ఒక్క పని
ఈ పవిత్రరోజున శ్రీహరి ఆరాధనతో పాటు తులసి పూజ చేయడం అత్యంత ముఖ్యమైన పని. కామిక ఏకాదశి నాడు శ్రీకృష్ణుడికి లేదా విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం అంటే, బంగారం, వెండి లేదా రత్నాలను దానం చేసినదానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా కామిక ఏకాదశి రోజున ఓం శ్రీ తులస్యై నమః వంటి తులసి నామాలను స్మరిస్తూ, నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోజున ధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోకుండా, కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ నియమబద్ధంగా ఈ వ్రతం ఆచరిస్తే... శ్రీహరి అనుగ్రహంతో మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి, మూసివున్న అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ కామిక ఏకాదశి రోజును ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకుండా ఈ పనిచేయండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకోండి.




