Kanaka Dasa Story: భగవంతుడు మెచ్చిన కనకదాసు కథ...యుముడు దిగి వచ్చినా..శ్రీవారే వరం ఇచ్చినా...

సామాన్య మానవుడు భగవంతుడిని వెతుక్కుంటూ ఆలయానికి వెళ్లడం సహజం. కానీ, ఒక భక్తుడి కోసం సాక్షాత్తు ఆ పరమాత్ముడే తన దిశను మార్చుకుని దర్శనమిచ్చిన అద్భుత ఘట్టం కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది.

Balachander
Published on: 5 May 2026 1:49 PM IST
Kanaka Dasa Story: భగవంతుడు మెచ్చిన కనకదాసు కథ...యుముడు దిగి వచ్చినా..శ్రీవారే వరం ఇచ్చినా...
X

Kanaka Dasa Story: సామాన్య మానవుడు భగవంతుడిని వెతుక్కుంటూ ఆలయానికి వెళ్లడం సహజం. కానీ, ఒక భక్తుడి కోసం సాక్షాత్తు ఆ పరమాత్ముడే తన దిశను మార్చుకుని దర్శనమిచ్చిన అద్భుత ఘట్టం కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. ఆ మహా భక్తుడే కనకదాసు. అహంకారాన్ని వీడి, అచంచలమైన విశ్వాసంతో దైవాన్ని వేడుకుంటే, కులమతాలకు అతీతంగా ఆ హరి ఏ విధంగా అండగా నిలుస్తాడో చెప్పడానికి కనకదాసు జీవితమే ఒక నిలువుటద్దం.

అల్లరి అబ్బాయి నుంచి ఆరాధ్యుడి వరకు..

కనకదాసు అసలు పేరు తిమ్మప్ప. తొలినాళ్లలో అక్షరజ్ఞానం లేక, అల్లరి చిల్లరగా తిరుగుతూ యుద్ధ విద్యలపై మక్కువ చూపేవాడు. భగవంతుడు తన లీలతో ఆయన తల్లిదండ్రులను, భార్యను దూరం చేసి, తిమ్మప్పను ఒంటరిని చేశాడు. జీవితంపై విరక్తి కలిగిన తరుణంలో, వ్యాసరాయలనే గురువు వద్దకు చేరాడు. అయితే వర్ణ వివక్ష కారణంగా గురువు ఆయనను హేళన చేస్తూ, వదిలించుకోవడానికి ‘దున్నపోతు’ నామాన్ని మంత్రంగా ఇచ్చి జపించమన్నాడు. గురువుపై నమ్మకంతో తిమ్మప్ప చేసిన ఆ జపానికి సాక్షాత్తు యమధర్మరాజు దున్నపోతు వాహనంపై దిగివచ్చాడు. యముడు వరం ఇస్తానన్నా తృణీకరించి, గురువు గారికి ఏం కావాలో అడగమన్న మహోన్నత వ్యక్తి తిమ్మప్ప.

అంతటా ఆయనే..

ఒకసారి గురువుగారు శిష్యులకు పరీక్ష పెడుతూ, "ఎవరూ చూడని చోట ఈ పండును తినండి" అని మామిడి పండ్లను ఇచ్చారు. అందరూ చాటుగా వెళ్లి తిని వచ్చారు కానీ, తిమ్మప్ప మాత్రం తినలేదు. "గురువుగారు.. నేను ఎక్కడికి వెళ్లినా భగవంతుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన లేని చోటు నాకు కనిపించలేదు" అని చెప్పి తనలోని అత్యున్నత భక్తిని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ‘కనకదాసు’గా ప్రసిద్ధి చెందారు.

తిరుమల కొరడా దెబ్బలు - ఉడిపి కిటికీ దర్శనం

కనకదాసు తిరుమల వెళ్లినప్పుడు సామాన్యుడని భావించిన మహంతు, ఆయనను దూరం పెట్టడమే కాకుండా దొంగతనం నెపంతో కొరడా దెబ్బలు కొట్టించాడు. కానీ శ్రీవేంకటేశ్వరుడు మహంతు కలలోకి వచ్చి హెచ్చరించడంతో, అందరూ ఆయన పాదాలకు నమస్కరించి స్వామి దర్శనం చేయించారు. ఇక్కడే కనకదాసు జీవితం మలుపుతిరిగింది. ఉడిపిలో శ్రీకృష్ణుడిని దర్శించుకునే అవకాశం కులం పేరుతో నిరాకరించబడినప్పుడు, కనకదాసు ఆలయం వెనుక ఉన్న గోడ కిటికీ వద్ద నిలబడి కన్నీటితో వేడుకున్నాడు. భక్తుడి ఆర్తిని చూసి, గర్భాలయంలోని శ్రీకృష్ణ విగ్రహం వెనక్కు తిరిగి ఆ కిటికీ గుండా దర్శనమిచ్చింది. నేటికీ ఉడిపిలో ఆ కిటికీని ‘కనకన కిండి’ దీనినే తెలుగులో కనకదాసు కిటికీ అని పిలుస్తారు.

కనకదాసు జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే.. భగవంతుడికి కావాల్సింది బాహ్య రూపం లేదా కులం కాదు, కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే. యముడు దిగివచ్చినా, శ్రీవారే వరం ఇచ్చినా.. లోక కల్యాణాన్నే కోరుకున్న ఆయన నిష్కామ భక్తి నేటి తరానికి ఆదర్శం. ఆయన అడుగుజాడల్లో నడిచి మనసును దైవంపై లగ్నం చేస్తే, ఆ హరి మన చెంతకే వస్తాడనడంలో సందేహం లేదు. ఇలాంటివి ఎన్నో మనకు సజీవ సత్యాలుగా నేటికీ మనకు కనిపిస్తుంటాయి. భగవంతునివైపు అడుగులు వేయమని మనల్ని పిలుస్తుంటాయి. సున్నితంగా హెచ్చరిస్తుంటాయి. ఒక్కసారి అటువైపుగా అడుగులు పడితే చాలు...ఆ భగవంతుడే మనల్ని ఆ వైపుకు లాగుతాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story