Kanchi Paramacharya: కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం...పెరియ స్వామి రహస్యం
కంచి కామకోటి పీఠం అంటేనే ఒక పవిత్ర ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఆ పీఠానికి వన్నె తెచ్చిన మహనీయులు, సాక్షాత్తు పరమశివుని స్వరూపంగా భావించే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి.
Kanchi Paramacharya: కంచి కామకోటి పీఠం అంటేనే ఒక పవిత్ర ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఆ పీఠానికి వన్నె తెచ్చిన మహనీయులు, సాక్షాత్తు పరమశివుని స్వరూపంగా భావించే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. జటాజూటం లేని ఈశ్వరుడిగా, నడయాడే దైవంగా భక్తుల నీరాజనాలు అందుకున్న కంచి పరమాచార్యులు, 87 సంవత్సరాల పాటు పీఠాధిపతిగా ఉండి, కాలి నడకనే దేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన అపర శంకరావతారంగా భక్తులు ఆరాధిస్తారు.
నిండు నూరేళ్ల ఆధ్యాత్మిక వెలుగు
ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో కంచి కామకోటి పీఠం అత్యంత విశిష్టమైనది. ఈ పీఠానికి 68వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఆధ్యాత్మిక జగత్తులో ఒక ధ్రువతార. 1894 మే 20న జన్మించిన ఆయన, కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే సన్యాస దీక్షను స్వీకరించారు. 1994లో శివైక్యం చెందే వరకు, అంటే సరిగ్గా 100 ఏళ్ల పాటు ఆయన ఈ భూమిపై ధర్మ స్వరూపంగా జీవించారు.
నియమ నిష్ఠలు - పాదయాత్రల పరమార్థం
సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం సన్యాసులు వాహనాల్లో ప్రయాణించకూడదు. ఈ నియమాన్ని పరమాచార్య అక్షరాలా పాటించారు. తన వందేళ్ల జీవిత కాలంలో ఆయన దేశవ్యాప్తంగా మూడుసార్లు పాదయాత్ర చేశారు. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు కాలినడకనే తిరుగుతూ, కుగ్రామాల్లో సైతం ధర్మ ప్రచారం చేశారు. పెరియ స్వామివారికి 23 భాషల్లో ప్రావీణ్యం ఉంది. ప్రపంచంలో ఏ విషమంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే నడయాడే విజ్ఞాన సర్వస్వం ఆయన. పరమాచార్యుల వారు తన జీవితకాలంలో 87 చాతుర్మాస్య వ్రతాలు చేశారు. భూమిపై మనిషిగా జన్మించినవారిలో ఆయనదే అగ్రస్థానం. అంతేకాదు, కంచి పీఠానికి కోట్లాదిమంది భక్తులు ఉన్నా... రాజులు, ప్రధానులు ఆయన పాదాల వద్ద కూర్చున్నా... ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఓ సామాన్య సన్యాసిలా తాటాకు పాకల్లో లేదా పాత గోడల మధ్యనో నివశించేవారు. శరీరానికి శుఖం అలవాటు చేయకూడదంటారు ఆయన. పాకలో, పూరిగుడిసెల్లో ఉన్నప్పుడు శరీరం చైతన్యవంతంగా మారుతుందంటారు.
ఒక్క నిమిషం చూపు.. అనంతమైన శాంతి
మహాస్వామి వారిని భక్తులు 'పెరియవా' అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయనను చూస్తే తలపై చంద్రుడు లేని శివుడిని చూసినట్లే ఉంటుందని పండితులు చెబుతుంటారు. గారడీ విద్యలకు, ప్రదర్శనలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు. కేవలం ఆయన చిత్రపటాన్ని ఒక్క నిమిషం పాటు ప్రశాంతంగా చూసినా, మస్తిష్కంలోని ఆందోళనలన్నీ తొలగిపోయి ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. వేద రక్షణ, గో సంరక్షణే శ్వాసగా బతికిన మహాపురుషుడు పరమాచార్య. లక్షలాది కుటుంబాలను వైదిక మార్గంలోకి మళ్లించి, సనాతన ధర్మం అనే వటవృక్షానికి నీరు పోసిన మహానుభావుడు. ఆయన జీవితం మనందరికీ ఒక మార్గదర్శి, ఆయన ఆశీస్సులు ఒక రక్షణ కవచం.




