Ringu Nag Sacred Forest: హిమాచల్ ప్రదేశ్‌లో కాంతారా దేవత...చెట్టును ముట్టుకోవాలంటే అనుమతి తప్పనిసరి
Ringu Nag Sacred Forest: కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమాలో అడవిని, అక్కడి సంస్కృతిని కాపాడే దైవ శక్తిని చూశాం.
Ringu Nag Sacred Forest
Ringu Nag Sacred Forest: కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమాలో అడవిని, అక్కడి సంస్కృతిని కాపాడే దైవ శక్తిని చూశాం. సరిగ్గా అలాంటి అద్భుతమే హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో నేటికీ కనిపిస్తోంది. సైంజ్ లోయలోని సుమారు 62.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 'రింగు వన్' అడవిని 'రింగు నాగ్' అనే నాగ దేవత రక్షిస్తోందని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ అటవీ శాఖ చట్టాల కంటే దేవత ఆజ్ఞలే అత్యున్నతమైనవి. దేవత ఆజ్ఞను మీరి ఎవరూ అడవిలోకి ప్రవేశించరు. ఒకవేళ అడవిలోకి వెళ్లాలి అంటే కఠినమైన నియమాలు పాటించాల్సిందే. ఆ ప్రాంతం నుంచి ఒక్క కట్టెముక్కను తీసుకురావాలన్నా అమ్మవారి అనుమతి అవసరం.
దేవత సొంత భూమి: 'నగ్యాడ్'
సైంబజ్ వ్యాలీలోని బంజార్ పరిథిలో ఉన్న ఈ అడవిని స్థానిక ప్రజలు నగ్యాడ్ అని పిలుస్తారు. నగ్యాడ్ అంటే దేవత సొంత భూమి అని అర్థం. మనకు ఇంటి స్థలం, రైతులకు పొలాలు ఉన్నట్టుగానే అక్కడి దేవతకు నగ్యాడ్ ఉంటుంది. దేవతకు సొంతమైన ఈ భూమిలో చెట్లు నరకడం, పుల్లలు ఏరుకోవడం, అగ్నిని వెలిగించడం చేయకూడదు. ఇక్కడ ఇవి పూర్తిగా నిషేధం. ఇనుప పరికరాలు అస్సలు వాడరాదు. ఈ నియమాలు ఉల్లంఘిస్తే దేవత శిక్షిస్తుందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఎన్నోమార్లు ఇది రుజువైంది కూడా. ఇక స్థానికుల కథనం ప్రకారం రింగ్ నాగ్ దేవత పాము, సింహం, పొట్టేలు రూపంలో దర్శనమిస్తుందని, అడవిలో ఏదైనా తప్పులు జరిగితే వారిని శిక్షిస్తుందని అంటారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్బాల్లో అంటే నాగపంచమి, వైశాఖమాసంలో మాత్రమే భక్తులకు అడవిలోకి ప్రవేశం లభిస్తుంది. ఈ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. ఉపవాసం చేస్తూ, పవిత్ర స్నానం చేసిన తరువాత అడవిలోకి ప్రవేశిస్తారు.
యునెస్కోను సైతం అబ్బురపరిచిన పచ్చదనం
2012లో యునెస్కో ప్రతినిధులు 'గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్' పరిశీలనకు వచ్చినప్పుడు ఒక వింతను గమనించారు. చుట్టుపక్కల కొండలన్నీ ఎండిపోయి ఉన్నా, రింగు వన్ మాత్రం అద్భుతమైన పచ్చదనంతో కళకళలాడుతోంది. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాన్ని తెలుసుకున్న నిపుణులు, అడవుల సంరక్షణలో ప్రభుత్వాల కంటే స్థానిక విశ్వాసాలే శక్తివంతమైనవని ప్రశంసించారు. యునెస్కో ప్రత్యేక గుర్తింపుతో ఈ ప్రాంతం మరింత ప్రాచూర్యం పొందింది. ఎంత ప్రాచూర్యం లభించినప్పటికీ అనుమతి లేకుండా ఎవరూ కూడా అడవిలోకి అడుగుపెట్టలేరు.
అభివృద్ధి ప్రాజెక్టులకు బ్రేక్
ఈ ప్రాంతంలో పలు అభివృద్ది ప్రాజెక్టులను చేపట్టాలని గతంలో చాలామంది ప్రయత్నించారు. 2004లో ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ప్రతిపాదించిన రూ. 1,500 కోట్ల స్కీ రిసార్ట్ ప్రాజెక్టును, అలాగే ఇటీవలి బిజ్లీ మహాదేవ్ రోప్‌వే పనులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రకృతికి హాని కలిగించే ఏ ప్రాజెక్టునైనా దేవతల ఆజ్ఞ మేరకు ప్రజలు వ్యతిరేకిస్తారు. దేవతల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని స్థానికులు పేర్కొన్నారు. నియమాలను సామాన్యులే కాదు, అధికారులు, నాయకులు, వ్యాపారులు ఎవరూ కూడా మీరేందుకు అవకాశం లేదు.
కాలంలో ఎన్ని మార్పులు జరిగినా, ఎంత ఆధునీకత సంతరించుకున్న రింగ్ వన్ పరిధిలో అరుదైన దేవదారు, రాఖల్ చెట్లు నేటికీ సురక్షితంగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం రింగ్‌నాగ్ పట్ల ప్రజలకున్న భయభక్తులే. తెలిసో తెలియకో ఏదైనా జంతువు లేదా పశువు పొరపాటున రింగ్‌వన్ ప్రాంతంలోకి వెళ్తే దానిని వెతికేందుకు ఎవరూ వెళ్లరు. రింగ్ వన్ దేవత సేవ కోసం పశువు వెళ్లిందని భావిస్తారు. ప్రభుత్వాలు విధించే ఏ చట్టాలు ఇక్కడ పనిచేయవు.




