Karthika Pournami Giripradakshina: కార్టీక పౌర్ణమి గిరిప్రదక్షిణ...జీవితంలో ఒక్కసారైనా ఇలా చేయాలి
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరిప్రదక్షిణ ఎందుకు చేయాలి? 14 కిలోమీటర్ల ప్రదక్షిణ విశిష్టత, అష్టలింగాల దర్శనం, పాటించాల్సిన నియమాలు, అరుణాచలేశ్వరుడి ఆధ్యాత్మిక మహిమ గురించి తెలుసుకుందాం
Karthika Pournami Giripradakshina: కార్తీక మాసం అనగానే శివారాధన, దీపారాధనతో పాటు గుర్తుకొచ్చే మరో పవిత్రమైన ఆచారం అరుణాచల గిరిప్రదక్షిణ. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున తిరువణ్ణామలైలో కనిపించే భక్తజన సందోహం మాటల్లో చెప్పలేనిది. రాత్రింబవళ్లు వేలాది మంది భక్తులు చెప్పులు లేకుండా శివనామస్మరణ చేస్తూ 14 కిలోమీటర్ల మేర విస్తరించిన అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి గిరిప్రదక్షిణ చేయాలని భక్తులు కోరుకుంటారు. అయితే ఈ ప్రదక్షిణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
అగ్నిస్తంభంగా వెలసిన అరుణాచలేశ్వరుడు
తమిళనాడులోని తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్ని లింగానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. పురాణ గాథల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారనే ప్రశ్న తలెత్తింది. వారి అహంకారాన్ని తొలగించేందుకు పరమశివుడు అంతులేని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ జ్యోతి ఆది, అంతాలను కనుగొనడం ఇద్దరు దేవతలకూ సాధ్యం కాలేదు. అనంతరం ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. 'అరుణం' అంటే ఎరుపు లేదా అగ్ని కాంతి అని, 'అచలం' అంటే కదలని పర్వతం అని అర్థం. అందుకే అరుణాచలం శివుడి జ్యోతిస్వరూపంగా భక్తులచే పూజలందుకుంటోంది. ఈ పర్వతాన్ని దర్శించడం, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తూ పరమశివుడిని ఆరాధించడంతో సమానమని భక్తుల విశ్వాసం.
24 ఎకరాల్లో విస్తరించిన అద్భుత ఆలయం
అరుణాచలేశ్వర ఆలయం సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఆలయంలో 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న రాజగోపురం సుమారు 217 అడుగుల ఎత్తుతో, 11 అంతస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మని అమ్మాళ్, తిరుమంజనం, పేయి గోపురాలు కూడా ఆలయ నిర్మాణ వైభవాన్ని చాటుతాయి. శిల్పకళ, విశాలమైన మండపాలు, ఉపాలయాలు ఈ క్షేత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
కార్తీక దీపోత్సవం ఎందుకంత ప్రత్యేకం?
అరుణాచలంలో జరిగే కార్తీక దీపోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులను ఆకర్షిస్తుంది. కార్తీక మాసంలో సుమారు 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన రోజున అరుణాచల పర్వత శిఖరంపై మహాదీపాన్ని వెలిగిస్తారు. పెద్ద లోహ పాత్రలో నెయ్యి పోసి, ప్రత్యేకమైన వత్తితో వెలిగించే ఈ జ్యోతి శివుడి అనంతమైన తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆలయంలో భరణి దీపం వెలిగించడం కూడా ఈ ఉత్సవంలో విశేషమైన ఘట్టం.
14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణలో ఎనిమిది దిక్కుల ప్రత్యేకత
అరుణాచల గిరిప్రదక్షిణ మొత్తం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఎనిమిది దిక్కులకు సంబంధించిన అష్టలింగ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య దిక్కులకు సంబంధించిన లింగాలను దర్శించుకుంటూ భక్తులు ముందుకు సాగుతారు. మార్గమధ్యంలో ఆది అన్నామలై ఆలయం కూడా దర్శించుకోవచ్చు. గిరిప్రదక్షిణను ఎక్కడ ప్రారంభిస్తారో తిరిగి అక్కడికే చేరుకోవాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు భావిస్తారు. ప్రతి అడుగులోనూ శివనామస్మరణ చేస్తూ, ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగడం ఈ ఆచారంలోని ప్రధాన ఉద్దేశం. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
గిరిప్రదక్షిణ సమయంలో పాటించాల్సిన నియమాలు
సాధ్యమైనంత వరకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయాలి. రహదారికి ఎడమవైపు నడుస్తూ ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ప్రయాణమంతా శివనామస్మరణ చేస్తూ ప్రశాంతంగా సాగాలి. అష్టలింగ క్షేత్రాలను భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలి. ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా పెద్దగా అరవడం, తోపులాట చేయడం వంటివి నివారించాలి. శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. రమణ మహర్షి బోధనల్లోనూ అరుణాచల గిరి మహిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఆశ్రమానికి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణను భక్తితో, నిశ్శబ్దంగా, వినయంతో చేయాలని సూచించేవారు. కార్తీక పౌర్ణమి గిరిప్రదక్షిణలోని అసలైన విశేషం ఏమంటే... 14 కిలోమీటర్ల దూరం నడవడం మాత్రమే కాదు.. అహంకారాన్ని విడిచిపెట్టి, మనసును దైవచింతనలో లగ్నం చేయడం. అందుకే అరుణాచల గిరిప్రదక్షిణను భక్తులు జీవితంలో మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి ఆ శివజ్యోతి క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు.




