Jwala Thoranam: నరక బాధల నుంచి విముక్తి కలిగించే జ్వాలా తోరణం... కార్తీక పౌర్ణమిరోజునే ఎందుకు చేయాలంటే
కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం ఎందుకు దాటాలి? త్రిపురాసుర సంహారం, హాలాహల విషం వెనుక ఉన్న పురాణ కథలు, జ్వాలా తోరణం ఏర్పాటు చేసే విధానం, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Jwala Thoranam: కార్తీక మాసంలో శివాలయాలు దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఈ మాసంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటే.. కార్తీక పౌర్ణమి మాత్రం మరింత విశిష్టమైనది. ముఖ్యంగా ఈ రోజున శివాలయాల్లో నిర్వహించే జ్వాలా తోరణం ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో గడ్డి, కర్రలతో ఏర్పాటు చేసిన తోరణాన్ని అగ్నితో వెలిగించి, దాని కింద నుంచి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్తారు. అనంతరం భక్తులు కూడా ఆ జ్వాలా తోరణం కింద నుంచి దాటుతారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగి, అపమృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు, భక్తుల విశ్వాసాలు చెబుతున్నాయి. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న కథ ఏమిటి? కార్తీక పౌర్ణమి రోజునే ఈ వేడుకను ఎందుకు నిర్వహిస్తారు?
త్రిపురాసుర సంహారంతో ముడిపడిన జ్వాలా తోరణం
జ్వాలా తోరణం వెనుక ప్రధానంగా రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మొదటిది త్రిపురాసుర సంహారానికి సంబంధించినది. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు తమ శక్తితో లోకాలను పీడించేవారు. వారి ఆగడాలను అరికట్టేందుకు దేవతలంతా పరమశివుడిని ప్రార్థించారు. అప్పుడు మహాదేవుడు ఒకే బాణంతో త్రిపురాలను దహనం చేసి రాక్షసులను సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగా కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా కూడా పిలుస్తారు. యుద్ధం ముగించుకుని వచ్చిన పరమశివుడికి ఎలాంటి దిష్టి ప్రభావం కలగకూడదనే ఉద్దేశంతో పార్వతీదేవి అగ్నితో తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక పురాణ కథనం వివరిస్తుంది. అప్పటి నుంచి జ్వాలా తోరణం ఆచారం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారు.
హాలాహల విషాన్ని మింగిన శివుడికి స్వాగతంగా..
రెండో కథనం క్షీరసాగర మథనంతో ముడిపడి ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథించినప్పుడు ముందుగా హాలాహల విషం ఉద్భవించింది. ఆ విషం ప్రభావంతో సృష్టి మొత్తం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. లోకాలను కాపాడేందుకు పరమశివుడు ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో నిలిపాడు. దీంతో ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ మహత్తర ఘట్టం అనంతరం శివపార్వతులు జ్వాలా తోరణం గుండా మూడుసార్లు వెళ్లినట్లు మరో కథనం చెబుతుంది.
జ్వాలా తోరణాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?
కార్తీక పౌర్ణమి రోజున సూర్యాస్తమయం తర్వాత శివాలయాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో రెండు పొడవైన కర్రలను నిలబెట్టి, వాటి మధ్య అడ్డంగా మరో కర్రను ఏర్పాటు చేస్తారు. దానికి ఎండుగడ్డిని చుట్టి అగ్నితో వెలిగిస్తారు. అలా ఏర్పడిన అగ్ని తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో తీసుకొచ్చి జ్వాలా తోరణం కింద నుంచి మూడుసార్లు దాటిస్తారు. అనంతరం భక్తులు కూడా భక్తిశ్రద్ధలతో ఆ తోరణం కింద నుంచి వెళ్తారు. ఈ సమయంలో శివనామస్మరణ చేస్తూ తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తారు.
జ్వాలా తోరణం దాటితే కలిగే ఫలితాలేమిటి?
కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని దర్శించడం, దాని కింద నుంచి వెళ్లడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా అపమృత్యు దోషాలు తొలగి, ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయని పురాణ విశ్వాసాలు పేర్కొంటాయి. జ్వాలా తోరణం నుంచి లభించే భస్మాన్ని పవిత్రంగా భావించి నుదుటన ధరిస్తారు. దీనివల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తొలగుతుందని కొందరి విశ్వాసం. జ్వాలా తోరణంలోని అసలు ఆధ్యాత్మిక సందేశం: అగ్ని అనేది పవిత్రతకు, చెడును దహించే శక్తికి ప్రతీక. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, చెడు ఆలోచనలను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని ఈ ఆచారం అందిస్తుంది. అందుకే కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహించే జ్వాలా తోరణం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం, ఆత్మశుద్ధికి ప్రతీకగా నిలుస్తోంది.




