Karthika Purnima 2026: తలరాతను మార్చే కార్తీక పౌర్ణమి... అష్టైశ్వరాలు పొందాలంటే ఇదే మార్గం

2026 కార్తీక పౌర్ణమి నవంబర్ 24న జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రోజున చేయాల్సిన 5 ముఖ్యమైన పూజలు, దీపదానం, శివారాధన, అన్నదానం విశేషాలను తెలుసుకుందాం.

Rudrachander
Published on: 22 Nov 2026 11:29 AM IST
Karthika Purnima 2026: తలరాతను మార్చే కార్తీక పౌర్ణమి... అష్టైశ్వరాలు పొందాలంటే ఇదే మార్గం
X

Karthika Purnima 2026: కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు విశేషమైన ఈ రోజును భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇంట్లో దీపాలు వెలిగించడం నుంచి పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలు, అన్నదానాలు చేయడం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే దీపదానం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, దానధర్మాలతో జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని హిందూ సంప్రదాయం చెబుతోంది. 2026 నవంబర్ 24న కార్తీక పౌర్ణమి పర్వదినం జరుపుకోనున్నారు. ఈ రోజుకు త్రిపురారి పౌర్ణమి, దేవ దీపావళి అనే పేర్లు కూడా ఉన్నాయి. పురాణ కథనం ప్రకారం, త్రిపురాసురుడి అకృత్యాలను అంతం చేస్తూ పరమశివుడు త్రిపురాంతకుడిగా అవతరించిన సందర్భాన్ని ఈ పర్వదినంతో అనుసంధానిస్తారు. శివుడి విజయానికి గుర్తుగా దేవతలు దీపాలు వెలిగించి ఆనందోత్సవాలు జరుపుకున్నారని పురాణాలు వివరిస్తాయి. అందుకే ఈ రోజున దీపారాధనకు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది.

కార్తీక పౌర్ణమి 2026 తిథి, పూజా సమయాలు

పంచాంగ వివరాల ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 23 రాత్రి 11:42 గంటలకు ప్రారంభమై, నవంబర్ 24 రాత్రి 8:23 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 24న ఉదయం 5:03 నుంచి 5:57 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. సాయంత్రం 5:01 గంటలకు చంద్రోదయం కాగా, 5:08 నుంచి 7:47 గంటల మధ్య దీపదానం చేయడానికి అనుకూల సమయంగా పేర్కొన్నారు. స్థానిక పంచాంగం ప్రకారం సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అయితే, కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

తెల్లవారుజామున పవిత్ర స్నానం, సూర్యారాధన

ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడం సంప్రదాయం. నదీ స్నానం చేసే అవకాశం ఉంటే మంచిది. లేదంటే ఇంట్లోనే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు. రాగి పాత్రలో నీటిని తీసుకుని ఎర్రటి పూలు, అక్షతలు కలిపి సూర్యుడికి సమర్పిస్తూ 'ఓం సూర్యాయ నమః' అని జపించాలి. ఇది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.

లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజ

కార్తీక పౌర్ణమి రోజున గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. అనంతరం మహావిష్ణువుకు తులసి దళాలు, పండ్లు సమర్పించి, లక్ష్మీదేవికి పుష్పాలతో పూజ చేయాలి. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం, పరస్పర ప్రేమ, ప్రశాంతత నెలకొనాలని ప్రార్థించాలి.

శివలింగానికి అభిషేకం

త్రిపురారి పౌర్ణమి కావడంతో శివారాధనకు ఈ రోజున విశేష ప్రాధాన్యత ఉంటుంది. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలి. వీలుంటే పాలు, పంచామృతంతో అభిషేకం నిర్వహించవచ్చు. బిల్వపత్రాలు సమర్పిస్తూ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి.

ఆకలితో ఉన్నవారికి అన్నదానం

పండుగ అంటే కేవలం పూజలు, అలంకరణలు మాత్రమే కాదు. తోటి మనుషులకు సహాయం చేయడం కూడా ధర్మంలో భాగమే. అందువల్ల ఈ రోజున పేదలకు భోజనం పెట్టడం, బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు అందించడం మంచిది. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి దుస్తులు, దుప్పట్లు ఇవ్వవచ్చు.

సాయంత్రం దీపదానం, గోసేవ

సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం, తులసి కోట, పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి. నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేయవచ్చు. ఆలయాల్లో, నదీ తీరాల్లో సంప్రదాయబద్ధంగా దీపదానం నిర్వహిస్తారు. వీలైతే గోవులకు పచ్చగడ్డి అందించి సేవ చేయాలి.

దేవ దీపావళిగా కార్తీక పౌర్ణమి ఎందుకు ప్రసిద్ధి?

కార్తీక పౌర్ణమి రోజున వారణాసిలోని గంగా ఘాట్ల వద్ద వేలాది దీపాలను వెలిగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గంగానది ఒడ్డున వెలిగే దీపాల కాంతి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది. శివుడి త్రిపురాసుర సంహారంతో పాటు విష్ణుమూర్తి ఆరాధనకు కూడా ఈ రోజున ప్రాధాన్యత ఉంది. గురునానక్ జయంతి కూడా కొన్ని సంవత్సరాల్లో ఈ పర్వదినానికి సమీపంగా లేదా ఇదే రోజున వస్తుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు