Kashi: కాశీ పరిక్రమం చేస్తున్నారా... ఈ 56 వినాయకులను తప్పక దర్శించాలి... ఎందుకో తెలుసా?

కాశీ పరిక్రమలో దర్శించాల్సిన 56 వినాయకుల విశిష్టత, ఏడు రక్షణ వలయాల రహస్యం, పంచక్రోశ యాత్రలో గణపతి ఆరాధన ప్రాధాన్యతను తెలుసుకుందాం.

Balachander
Published on: 9 Sept 2026 9:05 AM IST
Kashi: కాశీ పరిక్రమం చేస్తున్నారా... ఈ 56 వినాయకులను తప్పక దర్శించాలి... ఎందుకో తెలుసా?
X

Kashi: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మోక్ష క్షేత్రంగా భాసించే కాశీ పట్టణంలో విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారితో పాటు నగర రక్షణ కోసం వెలసిన 56 గణపతి రూపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాశీ పరిక్రమ చేసే భక్తులు ఈ 56 వినాయకులను దర్శించుకోవడం వల్ల కష్టాలన్నీ తొలిగి, పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

అష్టదిక్కుల రక్షణ ... ఏడు వలయాల రహస్యం

అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసినట్లే, కాశీ పట్టణం చుట్టూ చేసే యాత్రను పంచక్రోశ యాత్ర అంటారు. ఈ పరిక్రమ పూర్తి కావడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో విశ్వనాథ మందిరాన్ని రక్షిస్తూ ఏడు రక్షణ వలయాల్లో గణనాథులు దర్శనమిస్తారు. మొదటి వలయంలో ఎనిమిది మంది వినాయకులు మనకు దర్శనం ఇస్తారు. క్షేత్ర వెలుపలి భాగంలో ఉండి అర్క, దుర్గా, భీమచండ, డేహ్లి, ఉద్దండ, పాశపాణి, ఖర్వ, సిద్ధ వినాయకులు నాస్తికులను శిక్షిస్తూ, భక్తులకు సిద్ధులను ప్రసాదిస్తారు. అదేవిధంగా రెండో వలయంలో ఎనిమిది మంది వినాయకులైన లంబోదర, కూటదంత, శాలకంటక, కూష్మాండ, ముండ, వికటదంత, రాజపుత్ర, ప్రణవ వినాయకులు కాశీవాసుల విఘ్నాలను తొలగిస్తారు. అదేవిధంగా మూడో వలయంలో వక్రతుండ, ఏకదంత, త్రిముఖ, పంచాశ్వ, హేరంబ, విఘ్నరాజ, వరద, మోదకప్రియ గణపతులు నగరానికి పూర్తి రక్షణ అందిస్తారు.

ఇక నాలుగో వలయంలో అభయప్రద, సింహతుండ, కూడితాక్ష, క్షిప్రప్రసాద, చింతామణి, దంతహస్త, పిఛిండల, ఉద్దండముండ వినాయకులు యాత్రికుల యోగక్షేమాలు చూసుకుంటారు. ఐదో వలయంలో స్థూలదంత, కాళీప్రియ, చాతుర్దంత, ద్విదంత, జ్యేష్ఠ, గజ, కాళ, నాగేశ వినాయకులు యాత్రాఫలాన్ని కలిగిస్తారు. అలాగే ఆరో వలయంలో మణికర్ణి, ఆశ, సృష్టి, యక్ష, గజకర్ణ, చిత్రఘంట, మిత్ర, మంగళ వినాయకుల నామస్మరణతోనే ముక్తి లభిస్తుంది. ఇక చివరిదైన ఏడో వలయంలో ఐదుమంది వినాయకులు రక్షణ కల్పిస్తుంటారు. మొద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, గణనాథ వినాయకులు సిద్ధి ప్రదాతలుగా ఉంటూ రక్షణ దుర్భేద్యంగా ఉంటారు. పరిక్రమ సమయంలో ఈ వినాయకులను తప్పకుండా దర్శించుకోవాలి.

అవిముక్త క్షేత్రంలోని ప్రధాన గణపతులు

ఈ ఏడు వలయాల్లోని 53 వినాయకులతో పాటు మరో మూడు ముఖ్య గణపతులు కాశీ యాత్రకు పరిపూర్ణతను ఇస్తారు. జ్ఞాన వినాయకుడు భక్తులకు జ్ఞానప్రదాతగా ఉండగా, కాశీ ముఖ ద్వారంలో ద్వార వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడు. ఇక చివరిగా కాశీ క్షేత్రానికి తలమానికమైన శ్రీ అవిముక్త వినాయకుడు కాశీని ఒక్కటిగా ఉంచుతూ కాపాడుతుంటాడు. యోగులు, సిద్ధులు మాత్రమే ఆచరించే ఈ కాశీ పరిక్రమంలో ఉన్న 56 గణేశ విగ్రహాలను దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి జన్మ చరితార్థమవుతుందని కాశీఖండం స్పష్టం చేస్తోంది. కాశీ వెళ్లినవారు కనీసం తొమ్మిది రోజులు గడపాలనే నియమం ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం ఐదు రోజులు ఈ పరిక్రమ చేసేందుకు సమయం కేటాయించడం ఉత్తమం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story