Kashi Miracle: భక్తులు ఏం కోరినా అమ్మవారు ఇచ్చేస్తుంది... ఈ కాశీకథే నిదర్శనం
కాశీకి చెందిన ఓ భక్తుడు అమ్మవారిని నమ్మి పూజిస్తే... ఆ తల్లి అతడు పెట్టిన పరీక్షను ఎలా ఎదుర్కొన్నదో...ఇచ్చిన మాటను ఎలా నిలుపుకున్నదో ఈ కథే ఓ నిదర్శనం.
Kashi Miracle: సనాతన ధర్మంలో భక్తి అనేది కేవలం ఒక ఆచారం కాదు. అది భక్తునికి, భగవంతునికి మధ్య ఉండే దివ్యమైన అనుబంధం. మనముందు ఉన్న విగ్రహం కేవలం రాతి రూపాంతరం కాదు, ప్రత్యక్ష దైవస్వరూపం అని నమ్మి పూజిస్తే ఆ తల్లి నిత్యం మన వెంటే ఉంటుంది. భక్తుని నమ్మకాన్ని నిలబెట్టడానికి, అతని మాటను నిజం చేయడానికి జగన్మాత ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది అనడానికి పవిత్ర కాశీ క్షేత్రంలో జరిగిన ఈ అద్భుత ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
జమిందారు సవాలు ... గంగానదిలో అద్భుతం
స్వాతంత్య్రానికి పూర్వం కాశీలోని గంగానది ఘాట్ సమీపంలో సుదర్శన్ అనే పరమ భాగవతోత్తముడు నివసించేవాడు. అతడు దుర్గాదేవిని తన కన్నతల్లిగా భావించి పూజించేవాడు. ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో గంగలో స్నానమాచరించి, నీటిలో ఒంటికాలిపై నిలబడి జపం చేయడం అతని నిత్యకృత్యం. ఒకరోజు ఉదయం అతడు నీటిలో జపం చేసుకుంటుండగా, అక్కడకు పడవలో వచ్చిన ఒక జమిందారు గర్వంతో "నీళ్లకుంభంలో నీకేం కనిపిస్తోంది?" అని వెటకారంగా అడిగాడు.
సుదర్శన్ అమాయకంగా, నిశ్చలమైన నమ్మకంతో "నీటి అడుగున నాకు రెండు సజీవమైన కుందేళ్లు కనిపిస్తున్నాయి" అని సమాధానమిచ్చాడు. ఆ మాటలకు కోపగించిన జమిందారు తన పనివాళ్లను పిలిచి, నదిలో మూడు సార్లు వల విసరమని, కుందేళ్లు దొరక్కపోతే భక్తుడిని తీవ్రంగా శిక్షిస్తానని హెచ్చరించాడు. రెండుసార్లు వల విసిరినప్పుడు ఏమీ దొరకలేదు. అయినా సుదర్శన్ చిరునవ్వుతో "అమ్మ నన్ను చేయి విడవదు, మూడోసారి వల వేయండి" అన్నాడు. మూడవసారి వల వేసి పైకి లాగగా, అందరూ ఆశ్చర్యపోయేలా వలలో రెండు సజీవమైన కుందేళ్లు లభించాయి! జమిందారు తన తప్పు తెలుసుకుని భక్తుడి పాదాలపై పడ్డాడు.
తల్లి వాత్సల్యం ... హృదయ విదారక సత్యం
ఈ సంఘటన ముగిసాక సుదర్శన్ కాశీ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువతి ప్రత్యక్షమై అతని చెంపపై కొట్టింది. ఆశ్చర్యపోయిన సుదర్శన్ వైపు చూస్తూ ఆ అమ్మవారు "నాకు చెప్పకుండా అంత పెద్ద హామీ ఎలా ఇచ్చావు? నీ మాట నిలబెట్టడానికి నేను అడవిలోకి వెళ్లి, ముళ్ల పొదల్లో నలిగి రెండు కుందేళ్లను తెచ్చి నదిలో ఉంచాల్సి వచ్చింది" అని తన దివ్య హస్తాలను చూపించింది. ఆ చేతులకు ముళ్లు గుచ్చుకుని రక్తం కారుతోంది. తన మాట కోసం సాక్షాత్తు జగజ్జనని శ్రమించి గాయపడిందని గ్రహించిన సుదర్శన్ కన్నీళ్లు కారుస్తూ అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. భక్తుడు నిజమైన ప్రేమతో పిలిస్తే ఆ తల్లి సమస్తాన్ని త్యజించి రక్షణగా నిలుస్తుందనడానికి ఈ పుణ్యకథే నిదర్శనం. కాలం ఏదైనా సరే హృదయంలో నిజమైన భక్తి ఉంటే భగవంతుడు ఏదోఒక రూపంలో కరుణించి రక్షిస్తాడన్నది వాస్తవం.




