Kashi Vishwanath: కాశీ వెళ్లినపుడు ఎంతగా భక్తితో ఉండాలంటే...ఆ బంగారు పల్లెమే చెబుతోంది
కాశీ విశ్వేశ్వరుడి బంగారు పళ్లెం కథలోని ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? నిజమైన భక్తి, మానవసేవ ప్రాముఖ్యత, దైవానుగ్రహం వెనుక ఉన్న నీతిని తెలుసుకుందాం.
Kashi Vishwanath: దేవుడి ముందు గంటల తరబడి పూజలు చేయడం, అభిషేకాలు నిర్వహించడం, ఖరీదైన కానుకలు సమర్పించడం మాత్రమే భక్తి కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం, నిస్సహాయుల కన్నీళ్లు తుడవడం కూడా దైవారాధనలో భాగమే. మనిషి హృదయంలో ఎంత దయ ఉందో అదే అతడి భక్తికి అసలైన కొలమానం. ఈ విషయాన్ని కాశీ విశ్వేశ్వరుడి బంగారు పళ్లెం కథ ఎంతో ఆసక్తికరంగా వివరిస్తుంది.
కాశీ ఆలయంలో ప్రత్యక్షమైన బంగారు పళ్లెం
పురాణగాథగా చెప్పుకునే ఈ కథలో ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో అర్చకుడు నిత్యపూజలు నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల ఏదో పడిన శబ్దం వినిపించింది. ఏమిటో చూద్దామని బయటకు వచ్చిన పూజారికి అక్కడ ఒక అద్భుతమైన బంగారు పళ్లెం కనిపించింది. దాని మెరుపు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ పళ్లెంపై ‘నా నిజమైన భక్తుని కోసం’ అని రాసి ఉంది. ఆ మాటలు చదివిన పూజారికి ఒక ఆలోచన వచ్చింది. ‘నేను ప్రతిరోజూ స్వామికి పూజలు చేస్తున్నాను. ఆలయ సేవలో ఉంటున్నాను. ఇంతకంటే గొప్ప భక్తి ఏముంటుంది?’ అని భావిస్తూ ఆ పళ్లెంను చేతితో తాకాడు. అంతే! క్షణాల్లో ఆ బంగారు పళ్లెం సాధారణ మట్టి పాత్రగా మారిపోయింది. అది చూసి పూజారి నివ్వెరపోయాడు. తన భక్తిలో ఏదో లోపం ఉందేమోనని భావించి దాన్ని పక్కన పెట్టాడు.
రాజు భక్తిని కూడా పరీక్షించిన స్వామి
ఈ వింత విషయం కొద్దిసేపటికే నగరమంతా వ్యాపించింది. ఆలయానికి వచ్చినవారంతా ఆ పళ్లెంను చూడటానికి ఆసక్తి చూపారు. కొందరు తమ భక్తి గొప్పదని భావించి దాన్ని తాకారు. కానీ ప్రతిసారీ అది మట్టి పాత్రగానే మిగిలిపోయింది. దీంతో అక్కడికి వచ్చినవారు నిరాశతో వెనుదిరిగారు. ఈ వార్త కాశీ రాజు చెవిన కూడా పడింది. ఆలయానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నానని, శివుడిపై తనకు అపారమైన భక్తి ఉందని ఆయన భావించేవాడు. తనకంటే గొప్ప భక్తుడు మరొకరు ఉండరని అనుకుంటూ ఆలయానికి వచ్చి ఆ పళ్లెంను తాకాడు. అయితే అది బంగారంగా మారకపోగా, మరింత నల్లగా కనిపించింది. రాజు తలదించుకున్నాడు. సంపద ఉండటం, ఆలయానికి సేవలు చేయడం మాత్రమే నిజమైన భక్తికి నిదర్శనం కాదని అతడికి అర్థమైంది.
ఒక వృద్ధుడి చిన్న సహాయం.. గొప్ప భక్తికి నిదర్శనం
కొన్ని రోజుల తర్వాత ఒక వృద్ధుడు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆలయానికి వచ్చాడు. అతడు ప్రతిరోజూ స్వామిని దర్శించుకోవడం అలవాటుగా పెట్టుకున్నాడు. అయితే ఆలయ మెట్ల దగ్గరకు చేరుకోగానే అక్కడ ఉన్న నిరుపేదలు, చూపులేనివారు, నడవలేనివారు అతడి కంటపడ్డారు. వారి దీనస్థితిని చూసి వృద్ధుడి మనసు కరిగిపోయింది. ‘స్వామీ! వీరికి అండగా నిలువు. వీరి కష్టాలను తొలగించు’ అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. తన దగ్గర ఉన్న కొంత సొమ్మును వారికి అందించి, తనకు చేతనైన సాయం చేశాడు. ఆ తర్వాత ప్రశాంతమైన మనసుతో ఆలయంలోకి వెళ్లి విశ్వేశ్వరుడిని దర్శించుకున్నాడు. దర్శనం ముగించుకుని బయటకు వస్తుండగా ఆలయం దగ్గర పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడి ఉండటం గమనించాడు. విషయం ఏమిటని అడగగా, పూజారి బంగారు పళ్లెం గురించి వివరించాడు. వృద్ధుడి భక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో దాన్ని తాకమని కోరాడు. వృద్ధుడు ఎలాంటి గొప్పలు చెప్పుకోలేదు. స్వామిపై భారం వేసి వినయంగా పళ్లెంను తాకాడు. అద్భుతం! మట్టిగా మారిన ఆ పాత్ర ఒక్కసారిగా బంగారు కాంతులతో మెరిసిపోయింది. అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూశారు.
మానవసేవే మాధవసేవ
అప్పుడు స్వామి సందేశం అందరికీ అర్థమైంది. దేవుడికి చేసే పూజలు, సమర్పించే కానుకలకంటే ముఖ్యమైనది మనసులోని స్వచ్ఛత. ఇతరుల బాధను తన బాధగా భావించి సహాయం చేసేవారే నిజమైన భక్తులు అనే సందేశం ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథలోని బంగారు పళ్లెం ఒక పాత్ర మాత్రమే కాదు. మన భక్తిని మనమే ప్రశ్నించుకునే ఒక సంకేతం. దేవుడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరడం సహజమే. కానీ మన చుట్టూ బాధపడుతున్నవారిని పట్టించుకోకుండా కేవలం మన కోరికలు తీరాలని ప్రార్థించడం వల్ల భక్తి పరిపూర్ణం కాదు.




