Kedarnath: కేదార్నాథ్‌ను ఎలా నిర్మించారో తెలిస్తే ఆశ్చపోవాల్సిందే... వెయ్యేళ్లుగా ఎలా నిలిచిందో తెలుసా?
ఎప్పుడు ఎవరు నిర్మించారో తెలియని ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునఃర్నిర్మించినట్టుగా చెబుతారు. ఆ తరువాత కాలంలో 400 మంచులో కూరుకుపోయినా...ఆలయం చెక్కుచెదరకపోవడం విశేషం.
Kedarnath: సముద్ర మట్టానికి సరిగ్గా 3,583 మీటర్ల అత్యున్నత ఎత్తులో, హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన కేదార్‌నాథ్ ధామం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. అపారమైన దైవిక శక్తికి, ప్రాచీన భారతీయ దివ్య నిర్మాణ నైపుణ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాశస్త్యమైన ఈ ఆలయం శతాబ్దాలుగా ఎన్నో ప్రకృతి విపత్తులను, మంచు తుఫానులను తట్టుకుని నిటారుగా నిలబడటం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, తాత్త్విక రహస్యాలు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
మహాభారత నేపథ్యం ... ఆదిశంకరుల పునర్నిర్మాణం
పురాణ కథనాల ప్రకారం మహాభారత యుద్ధానంతరం పాండవులు తమ పాప ప్రక్షాళన కోసం శివానుగ్రహం కోరి హిమాలయాలకు రాగా, పరమశివుడు వృషభ రూపంలో దర్శనమిచ్చిన పవిత్ర స్థలమే ఈ కేదార్‌నాథ్. అయితే, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని ప్రతీతి. కాగా, కేదార్‌నాథ్, ఖరచ్‌కుండ్, భరత్‌కుండ్ అనే మూడు దివ్య పర్వతాల మధ్య, మందాకిని, మధుగంగ, క్షీరగంగ, సరస్వతి, స్వరందరి అనే ఐదు పవిత్ర నదుల తీరాన ఈ క్షేత్రం ప్రకాశిస్తోంది.
శాస్త్రవేత్తలు విస్తుపోయే నిర్మాణ రహస్యాలు
కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం వెనుక ఆధునిక ఇంజనీరింగ్ సైతం ఊహించని సాంకేతికత దాగి ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సిమెంట్ గానీ, సున్నం గానీ ఉపయోగించలేదు. భారీ రాళ్లను ఒకదానితో ఒకటి లాక్ అయ్యేలా కత్తిరించి అమర్చారు. ఈ ప్రత్యేక సాంకేతికత వల్ల భూకంపాలు వచ్చినా రాళ్లు విడిపోకుండా స్థిరంగా ఉంటాయి. దీనినే ఆష్టర్ పద్దతి అంటారు. ఇకపోతే, సాధారణంగా ఆలయాలు తూర్పు-పడమర దిశగా ఉంటాయి. కానీ కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రత్యేకంగా ఉత్తర-దక్షిణ దిశగా నిర్మించారు. ఈ అమరిక వల్ల హిమపాతాలు, వరద నీటి ప్రవాహం ఆలయాన్ని నేరుగా ఢీకొట్టకుండా పక్కకు తప్పుకుంటాయి.
400 ఏళ్ల మంచులోనే... 2013లో మహాద్భుతం
శాస్త్రవేత్తలు నిర్వహించిన లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షల్లో 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు అంటే దాదాపు 400 సంవత్సరాల పాటు ఈ ఆలయం పూర్తిగా దట్టమైన మంచు పొరల కింద కూరుకుపోయి ఉందని తేలింది. అయినా ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. అంతేకాకుండా, 2013లో సంభవించిన భారీ వరదల్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా, ఆలయం వెనుక స్వయంగా ప్రత్యక్షమైన 'భీమశిల' వల్ల ప్రధాన ఆలయం చెక్కుచెదరకుండా సురక్షితంగా నిలిచింది. ఇది కేవలం మానవ నైపుణ్యం మాత్రమే కాదు, ఆ కేదారేశ్వరుడి సాక్షాత్ దివ్య రక్షణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మహాశివుడి లీలకు సాక్ష్యంగా నిలిచిన భీమశిలను నేటికి మనం కేదారేశ్వరుడి ఆలయం వెనుకగా చూడవచ్చు.




