Mazhuvanchery Mahadeva Temple: ఈ ఆలయానికి వెళ్తే సీడీలు, పుస్తకాలే చేతిలో పెడతారు...కారణమేంటో తెలుసా?
కేరళలోని త్రిసూర్ మహువాంచెరి మహాదేవ ఆలయంలో పులిహోర, లడ్డులకు బదులుగా పుస్తకాలు, సీడీలను ప్రసాదంగా ఇస్తారు.
Mazhuvanchery Mahadeva Temple: సాధారణంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి మూలవిరాట్‌ని దర్శించుకున్న తరువాత అక్కడ భక్తులకు ఇచ్చే పులిహోర, దద్ద్యోజనం లేదా లడ్డు ప్రసాదం ఇస్తారని ఆశిస్తాం. స్వామివారికి నివేదించిన ప్రసాదం కావడంతో వాటిపై మనకు ఇష్టం ఎక్కువ ఉంటుంది. కానీ, భారతదేశంలోని ఓ వింత ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తరువాత మన చేతిలో ప్రసాదంగా పుస్తకాలు, సీడీలు, డీవీడీలు పెడతారు. వినడానికి కాస్త వింతగానే ఉన్నా, దీని వెనుక ఉన్న రహస్యం చాలా పెద్దది. ఆత్మజ్ఞానాన్ని పంచడమే నిజమైన దైవత్వం అని చెప్పడం కోసమే ఇలా చేస్తారు. ఇంతకీ ఈ వింత ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా... కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం పేరు మహువాంచెరి మహాదేవ ఆలయం.
భౌతిక సుఖాలు కాదు.. జ్ఞానమే ముఖ్యం!
మనం దేవుడి దగ్గరకు వెళ్లేదే అజ్ఞానాన్ని వీడి, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవడానికి. అలాంటప్పుడు నోటికి రుచినిచ్చే భౌతికమైన ప్రసాదాల కంటే, జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని ప్రసాదంగా ఇవ్వడమే ఉత్తమమని ఇక్కడి పండితులు నమ్ముతారు. అందుకే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి భగవద్గీత, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక విషయాలు కలిగిన పుస్తకాలతో పాటు, స్తోత్రాలు, భక్తిపాటలు ఉన్న సీడీలు, డీవీడీలను ఉచితంగా అందజేస్తున్నారు.
మారుతున్న కాలంతో పాటు మారిన 'ప్రసాదం'
మారుతున్న 21వ శతాబ్దపు సాంకేతిక కాలానికి అనుగుణంగా యువతకు భగవంతుడిని దగ్గరచేస్తూ, వారిలో భక్తిభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఆలయం ముఖ్యోద్దేశం. ఇక్కడికి వచ్చే భక్తులకు పుస్తక ప్రసాదాన్ని ఉచితంగా పంచిపెడుతుంది. ప్రతిరోజూ ఈ ఆలయాన్ని వందలాదిమంది భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు. వచ్చినవారందరికీ ఇలా పుస్తక ప్రసాదం, డీవీడీలు, సీడీలు ఇస్తుంటుంది. నోటిద్వారా తీసుకునే ప్రసాదం కాసేపట్లోనే అరిగిపోతుంది. కానీ, బుద్దిని వికసింపజేసే జ్ఞాన ప్రసాదం జీవితాంతం తోడుంటుందని పండితులు చెబుతున్నారు. కేరళ వెళ్లే భక్తులు కేవలం ప్రకృతి అందాలనే కాకుండా, మనుషుల్లోని అజ్ఞానపు చీకట్లను తొలగించే ఈ మహువాంచెరి మహాదేవ ఆలయాన్ని కూడా తప్పక సందర్శిస్తుంటారు.




