Bhagavathy Temple: ఇక్కడ అమ్మవారికి తిట్లతోనే పూజలు...ఏడోరోజు రక్తపాతమే
కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయంలో భరాణి ఉత్సవం ఎందుకు ప్రత్యేకం? అమ్మవారిని తిట్లతో పూజించడం, కత్తులతో ఆచారాలు, రాళ్లు విసరడం వెనుక ఉన్న సంప్రదాయాలు, భక్తుల నమ్మకాల గురించి తెలుసుకుందాం.
Bhagavathy Temple: అమ్మవారిని పూలతో పూజించడం, దీపాలు వెలిగించడం, భక్తి పాటలు పాడటం మనకు సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ కేరళలోని ఒక ఆలయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని తిట్లతోనే కొలుస్తారు. కొందరు భక్తులు కత్తులు పట్టుకుని ఉత్సవంలో పాల్గొంటారు. శరీరానికి గాయాలైనా పట్టించుకోకుండా భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. మరికొందరు ఆలయంపైకి రాళ్లు విసురుతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా భక్తులు విశ్వసిస్తున్నారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడుంగల్లూర్ పట్టణంలో ఉన్న కొడుంగల్లూర్ భగవతి ఆలయం ఈ విభిన్నమైన ఆచారాలకు ప్రసిద్ధి. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని భగవతి అమ్మవారిగా పూజిస్తారు. శ్రీ కురుంబ భగవతి అని కూడా పిలుస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా పూజలు జరుగుతాయి. అయితే సంవత్సరంలో జరిగే భరాణి ఉత్సవం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
తిట్లతో పాటలు.. చేతుల్లో కత్తులు
భరాణి ఉత్సవం ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొడుంగల్లూర్‌కు చేరుకుంటారు. ఉత్సవంలో పాల్గొనే కొందరు భక్తులు చేతుల్లో కత్తులు పట్టుకుని ఆలయానికి వస్తారు. తలపై స్వల్పంగా గాయాలు చేసుకోవడం, రక్తస్రావం కావడం వంటి ఆచారాలు కూడా కనిపిస్తాయి. అంతేకాదు.. అమ్మవారిని ఉద్దేశించి సాధారణంగా వినిపించని విధంగా తిట్లతో కూడిన పాటలు పాడటం ఈ ఉత్సవంలోని ప్రత్యేకత. బయటివారికి ఇది వింతగా అనిపించినా, భక్తుల దృష్టిలో మాత్రం ఇది అమ్మవారిపై తమ భక్తిని వ్యక్తం చేసే సంప్రదాయ పద్ధతి. ఉత్సవ సమయంలో కొందరు భక్తులు ఆధ్యాత్మిక భావోద్వేగంలో మునిగిపోయి అమ్మవారు తమపై ఆవహించారని భావిస్తారు.
రాళ్లు ఎందుకు విసురుతారు?
భరాణి ఉత్సవంలో మరో ఆశ్చర్యకరమైన ఆచారం కూడా ఉంది. కొందరు భక్తులు ఆలయంపైకి రాళ్లు విసురుతారు. ఇలా చేయడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయని స్థానిక విశ్వాసం. ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం, చరిత్రపై భిన్నమైన కథనాలు ఉన్నప్పటికీ.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయంగా ఇవి కొనసాగుతున్నాయి. అమ్మవారు శక్తికి ప్రతిరూపమని భక్తులు విశ్వసిస్తారు. భరాణి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చెడు ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.
ఏడు రోజుల తర్వాత ఆలయం మూసివేత
భరాణి ఉత్సవం ముగిసిన వెంటనే ఆలయాన్ని సాధారణంగా మరో ఏడు రోజుల పాటు మూసివేస్తారు. ఉత్సవ సమయంలో ఏర్పడిన రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లను పూర్తిగా తొలగించి ఆలయాన్ని శుభ్రపరుస్తారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో సంప్రోక్షణ నిర్వహించి తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఇదే ఆలయంలో మీనా భరణి ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఇది మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అందువల్ల ఏడాది పొడవునా కొడుంగల్లూర్ భగవతి ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది.
కేరళ సంస్కృతికి ప్రతిబింబంగా ఆలయం
కొడుంగల్లూర్ భగవతి ఆలయ నిర్మాణంలో కేరళ సంప్రదాయ స్థాపత్య శైలి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి చెర సామ్రాజ్య కాలంతో సంబంధం ఉందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. చెరామాన్ పెరుమాళ్ కాలంలో ఈ ఆలయం నిర్మితమైందనే విశ్వాసం కూడా ఉంది. భక్తులకు ఇది కేవలం ఒక ఆలయం కాదు. కేరళలోని పాత సంప్రదాయాలు, ఆచారాలు, జానపద విశ్వాసాలు, శక్తి ఆరాధన కలిసిన ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు.
భక్తులకు దర్శన వేళలు
కొడుంగల్లూర్ భగవతి ఆలయంలో సాధారణంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది. కొచ్చి విమానాశ్రయం నుంచి ఆలయం సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలోనే రైల్వే సదుపాయం కూడా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం సులభంగా ఉంటుంది. అందుకే కొడుంగల్లూర్ భగవతి ఆలయం ఒకవైపు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూనే.. మరోవైపు కేరళలో తరతరాలుగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయాలను పరిచయం చేసే ప్రదేశంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏడు రోజుల భరాణి ఉత్సవం సమయంలో కనిపించే ఆచారాలు ఈ ఆలయాన్ని దేశంలోని ఇతర శక్తి ఆలయాల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.




