Krishnashtami: శ్రీకృష్ణుడు చెప్పిన పద్నాలుగేళ్ల రహస్యం...కౌసల్యగురించి ప్రశ్నించిన దేవకి

శ్రీకృష్ణుడు దేవకికి చెప్పిన 14 ఏళ్ల రహస్యం ఏమిటి? కైకేయి, కౌసల్య, యశోద, దేవకిల పూర్వజన్మ అనుబంధం, కర్మఫల సిద్ధాంతం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 1 Sept 2026 9:31 AM IST
Krishnashtami:  శ్రీకృష్ణుడు చెప్పిన పద్నాలుగేళ్ల రహస్యం...కౌసల్యగురించి ప్రశ్నించిన దేవకి
X

Krishnashtami: శ్రీకృష్ణ భగవానుని అవతార లీలల్లో కర్మ సిద్ధాంతం అత్యంత పరమపవిత్రమైనది. సాక్షాత్తు భగవంతుడైనా సరే కర్మ నియమానికి అతీతుడు కాడని నిరూపించే ఒక అద్భుతమైన సత్యం శ్రీకృష్ణుడు తన కన్నతల్లి దేవకికి వివరించిన అంతరార్థంలో దాగి ఉంది. కంసుని సంహరించిన అనంతరం 14 సంవత్సరాల తర్వాత కారాగారంలో ఉన్న తల్లిదండ్రులను విడిపించిన వేళ, తల్లి దేవకి, శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ శ్రీరామావతారానికి, శ్రీకృష్ణావతారానికి ఉన్న పూర్వజన్మ అనుబంధాన్ని, మానవ జీవితానికి అవసరమైన కర్మఫల సత్యాన్ని ప్రబోధిస్తోంది.

కారాగార విముక్తి ... దేవకి ఆవేదన

కంస సంహారం పూర్తయిన వెంటనే శ్రీకృష్ణుడు మథురలోని చెరసాలకు వెళ్లి కన్నతల్లి దేవకిని, తండ్రి వసుదేవుడిని బంధనాల నుండి విడిపించాడు. ఇన్నేళ్ల తర్వాత తన కంటిపాపను చూసుకున్న దేవకి ఆనందబాష్పాలతో ముద్దులు కురిపించింది. అయితే, తన కుమారుడు సర్వశక్తిమంతుడైన జగన్నాథుడని తెలిసిన దేవకికి ఒక సందేహం కలిగింది. "నాయనా! నీవు సాక్షాత్తు భగవంతుడవు కదా! మరి నన్ను, నీ తండ్రిని ఈ కంసుడి చెర నుండి విడిపించడానికి 14 సంవత్సరాల సమయం ఎందుకు తీసుకున్నావు?" అని ప్రేమగా ప్రశ్నించింది.

14 ఏళ్ల వనవాసం ... కైకేయి స్మృతులు

ఆ ప్రశ్నకు కృష్ణపరమాత్మ చిరునవ్వు చిందిస్తూ ... "అమ్మా! నన్ను క్షమించు. కానీ పూర్వజన్మలో నీవే నన్ను 14 సంవత్సరాలు అడవులకు పంపావు కదా!" అని గోముగా బదులిచ్చాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన దేవకి తాను నిన్ను అడవికి పంపడమేమిటని ప్రశ్నించగా, స్వామివారు ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని గుర్తుచేశారు. "తల్లీ! త్రేతాయుగంలో నీవే 'కైకేయివి', నీ భర్త దశరథ మహారాజు. నాడు నీవు తండ్రి మాట ద్వారా నన్ను 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపావు" అని శ్రీకృష్ణుడు వివరించాడు.

కౌసల్యాదేవి వాత్సల్యం ... యశోదగా పునర్జన్మ

దేవకీదేవి మరింత ఆశ్చర్యంతో ... "అయితే నాటి శ్రీరాముని కన్నతల్లి కౌసల్య ఎవరయ్యా?" అని అడిగింది. దానికి వాసుదేవుడు ... "నాటి కౌసల్యాదేవియే ఈ జన్మలో నన్ను పెంచిన 'యశోదమ్మ'. త్రేతాయుగంలో 14 ఏళ్ల పాటు కన్నప్రేమకు, పుత్ర వాత్సల్యానికి దూరమైనందున, ఈ కృష్ణావతారంలో ఆ 14 సంవత్సరాల మాతృప్రేమను పొందే భాగ్యాన్ని ఆమెకు అందించాను" అని అంతరార్థాన్ని తెలియజేశాడు.

కర్మఫల సిద్ధాంతం

ఈ దివ్య లీల ద్వారా శ్రీకృష్ణుడు లోకానికి అందించిన సందేశం అత్యంత అద్భుతమైనది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. దేవతలు, అవతార పురుషులు సహా ఏ జీవి అయినా తాను చేసిన పూర్వకర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. త్రేతాయుగంలో కైకేయిగా చేసిన ఒక చిన్న పొరపాటు, ద్వాపరయుగంలో దేవకిగా 14 ఏళ్లు కొడుకు వియోగాన్ని అనుభవించేలా చేసింది. దీని అంతర్యం ఏమంటే....మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ నిత్యం తమ ప్రవర్తనపై, చేసే పనులపై ఎరుకతో ఉండాలి. చెడు ఆలోచనలు, దుష్కర్మలు భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ స్వార్థాన్ని వీడి, సత్ప్రవర్తనతో నిష్కామ సుకర్మలు ఆచరించడమే మోక్షానికి, ప్రశాంత జీవితానికి మూలమార్గమని ఈ పవిత్ర ఘట్టం బోధిస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story