Kurukshetra War: ఆ ఒక్కమాటే కురుక్షేత్ర యుద్ధ స్వరూపాన్ని మార్చేసింది... శ్రీకృష్ణుడిలా మీరుకూడా మీ రంగాల్లో కీలకం కావాలంటే
ధర్మరాజుతో శ్రీకృష్ణుడు పలికించిన ఆ ఒక్కమాట కురుక్షేత్ర యుద్ధం స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. మనం కూడా మన రంగాల్లో ఎదగాలంటే...శ్రీకృష్ణుడిలా మాయ చేస్తుండాలి. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తుండాలి.
Kurukshetra War: ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటి కురుక్షేత్ర యుద్ధం. లక్షలాదిమంది మరణించినట్టుగా మనకు మహాభారతం చదివితే అర్ధమౌతుంది. ఆ యుద్ధం యావత్తు శ్రీకృష్ణ పరమాత్ముని కనుసన్నల్లోనే జరుగుతుంది. ఈ యుద్ధంలో ఆయన చూపిన లీలలు, చేసిన మాలు అన్నీఇన్నీకావు. ఇక కురు, పాండవుల్లో ధర్మాత్ముడు ఎవరు అంటే ధర్మరాజు అనే చెబుతాం. ప్రాణం పోయినాసరే అబద్దమాడరాదని ఆయన భావం. కానీ, అత్యవసరమైనపుడు అనృతమాడవచ్చని చెప్పి, సాక్షాత్తు ధర్మానికి ప్రతీకగా నిలిచిన ధర్మరాజు చేతనే ఓ మాటను పలికిస్తాడు. ఆ మాటే కురుక్షేత్ర యుద్ధం స్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తుంది. ఈ యుద్ధాన్నే కాదు మహాభారతం మొత్తాన్ని అన్నీ తానై నడిపించాడు శ్రీకృష్ణుడు. మహాభారతం నుంచి మనం తెలుసుకోవలసింది ఇదే. మనం ఏ రంగంలో ఉన్నా... శ్రీకృష్ణుడిలా అన్నింటినీ చక్కబెట్టేలా ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా ప్రవర్తించాలి.
ధర్మరాజు చెప్పిన మాట
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తుంది. కౌరవ సైన్యానికి ద్రోణాచార్యుడు సైన్యాధిపతిగా ఉన్నాడు. కురుపాండవులకు విద్యను బోధించిన గురువు ద్రోణుడు. ఆయన ఉన్నంత వరకు పాండవులకు విజయం దక్కదు. ఆయన చేతిలో వేలమంది పాండవ సైన్యం బలౌతూ వస్తున్నది. ఆయన్ను ఆపకుంటే యుద్ధంలో పాండవులకు పరాజయం తప్పదు. ఇక్కడే శ్రీకృష్ణుడు పాచిక వేశాడు. ద్రోణుడి బలహీనత ఆయన కుమారుడే. కుమారుడిపై ఉన్న అపారమైన ప్రేమ అతడిది. కుమారుడి కోసం ఏమైనా చేస్తాడు. ముందుగా భీముడిని పిలిచి ఇంద్రవర్మ రాజు, అతని ఏనుగుపై దాడిచేయమని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భీముడు అశ్వత్థామ ఏనుగును వధిస్తాడు. వెంటనే ద్రోణుడి వద్దకు వెళ్లి అశ్వత్థామ మరణ వార్తను చెప్పమని ధర్మరాజుకు చెబుతాడు. ధర్మరాజు చెబితే ద్రోణుడు నమ్ముతాడని కన్నయ్యకు తెలుసు. కానీ, ధర్మరాజు సందేహిస్తాడు.
ధర్మం కోసమే అబద్దం... విజయం కోసం వ్యూహం
ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగా... పెద్ద ధర్మం కోసం చిన్న అసత్యం. ఏనుగు చనిపోయింది...కాబట్టి చెబుతున్నది పూర్తి అబద్ధం కాదు..కేవలం అర్ధభేదం మాత్రమే అని చెబుతాడు. ధర్మరాజు పైకి అంగీకరించినా...మనస్సాక్షి అందుకు బాధపడుతుంది. ఇలా ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో అప్పుడే ఆయన రథం నేలను తాకుతుంది. పూర్తిగా ధర్మంపై నిలిచిన ధర్మరాజు రథం అందరిలా నేలపై కాకుండా నాలుగు అంగుళాల ఎత్తులో ప్రయాణిస్తుండేది. సత్యానికి ఉన్న మహిమ అది. ద్రోణుడు యుద్ధభూమిలో భీభత్సం సృష్టిస్తున్న సమయంలో ధర్మరాజు పెద్దగా అశ్వత్థామ హతః..అంటాడు...వెంటనే చాలా చిన్నగా తనకు మాత్రమే వినిపించేలా కుంజరః అని చెబుతాడు. అశ్వత్థామ హతః అని పలికినపుడు నిశ్శబ్ధం తాండవిస్తుంది. కుంజరః అని చెప్పేలోగా శ్రీకృష్ణుడు తన లీలను చూపి పెద్దగా శంఖాలు, భేరీలు మోగించేలా చేస్తాడు. కుంజరః అనే మాటను ద్రోణుడికి వినిపించకుండా చేస్తాడు. దీంతో ద్రోణుడు కుప్పకూలిపోతాడు. ఈ ఒక్కమాటే కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అదేవిధంగా ఏ సంస్థలో అయినా పనిచేసేవాళ్లు ఎంతమంది ఉన్నా...వారందర్నీ శ్రీకృష్ణుడిలా గైడ్ చేస్తేనే ఆ కంపెనీ లేదా ఆయా రంగాలు వృద్దిలోకి వస్తాయి.




