Krishna Kurukshetra food story: శ్రీకృష్ణుడు ఆడించిన నాటకం...కురుక్షేత్రంలో భీముడిని వంటగాళ్లు
కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 రోజుల పాటు దాదాపు 50 లక్షల మంది సైనికులకు ఒక్క మెతుకు కూడా వృథా కాకుండా భోజనం పెట్టిన అద్భుత ఘట్టం వెనుక ఉడిపి మహారాజు నరేషుడు, శ్రీకృష్ణుడి లీలా విశేషాలు దాగి ఉన్నాయి.
Krishna Kurukshetra food story
Krishna Kurukshetra food story: కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 రోజుల పాటు దాదాపు 50 లక్షల మంది సైనికులకు ఒక్క మెతుకు కూడా వృథా కాకుండా భోజనం పెట్టిన అద్భుత ఘట్టం వెనుక ఉడిపి మహారాజు నరేషుడు, శ్రీకృష్ణుడి లీలా విశేషాలు దాగి ఉన్నాయి. చరిత్రలో జరిగిన యుద్ధంలో అతిపెద్దదైనదిగా చెప్పబడే ఈ కురుక్షేత్రంలో ఇరు పక్షాల సైనికులకు ఆహారం అందించడం సాధారణమైన విషయం కాదు. అతిపెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ఉడిపి మహారాజుకు అప్పగించాడంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆకలి యుద్ధం
కురుక్షేత్ర యుద్ధం అంటే కేవలం అస్త్రశస్త్రాల ప్రయోగం మాత్రమే కాదు, అంతటి అపార సైన్యానికి ఆకలి తీర్చడం కూడా ఒక యజ్ఞమే. ఇంతటి బాధ్యతను శ్రీకృష్ణ పరమాత్ముడు ఉడిపి మహారాజు నరేషుడికి అప్పగించారు. అయితే, ప్రతిరోజూ యుద్ధంలో వేలాది మంది మరణిస్తుంటే, సాయంత్రానికి ఎంత మంది మిగిలారో తెలుసుకోవడం సామాన్య మానవుడికి సాధ్యం కాని పని. వంట ఎక్కువైతే అన్నం వృథా అవుతుంది, తక్కువైతే సైనికులు ఆకలితో అలమటిస్తారు. కానీ, ఉడిపి మహారాజు నిర్వహించిన వంటశాలలో 18 రోజుల పాటు ఒక్క మెతుకు కూడా వృథా కాలేదు. యుద్ధం ముగిశాక ధర్మరాజు ఆశ్చర్యపోయి దీని గుట్టు అడగగా, నరేషుడు కన్నయ్య ఆడిన నాటకాన్ని వివరించాడు. జగన్నాటక సూత్రధారి పక్కన ఉండగా ఇదేమంత పెద్ద విషయం కాదని అంటాడు నరేషుడు.
కన్నయ్య 'పెసరకాయల' లెక్క
కురుక్షేత్రంలో లక్షలాదిమంది సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధం సమయంలో ఎంతమంది మరుసటిరోజుకు బతికి ఉంటారో...ఎంతమంది మరణిస్తారో తెలుసుకోవడం కష్టం. దీనికి శ్రీకృష్ణుడే దారి చూపించాడు. ప్రతిరోజు కన్నయ్య వంటశాలకు వచ్చి అక్కడ తనకు ఇష్టమైన పెసరకాయలను తినేవాడట. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు తింటే...సరిగ్గా దానికి వెయ్యి రెట్ల మంది సైనికులు మరణించేవారు. ఈ రహస్యాన్ని అర్ధం చేసుకున్న నరేషుడు మరుసటి రోజు యుద్ధభూమిలో ఎంతమంది ఉంటారో తెలుసుకొని వారికి మాత్రమే వంట చేయించేవాడట. ఇలా 18 రోజులపాటు జరిగిందని, కన్నయ మాయాజాలంతో తన పనిని సులువు చేశారని నరేషుడు వినయంగా చెప్పాడు. యుద్ధానికి ముందే ఉడిపి మహారాజుకు శ్రీకృష్ణుడు హామీ ఇచ్చాడట. తాను ఉడిపిలో కొలువుదీరుతానని, ఉడిపి పేరుతో వెలిసే పాకశాలలు జగత్ప్రసిద్ధి పొందుతాయని దీవించారు. అందుకే నేటికీ ఉడిపి భోజనానికి, ఆ వంటకాల్లోని రుచికి అంతటి ప్రాశస్త్యం ఉంది. భగవంతుని శరణు వేడితే, అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం అవుతుందని చెప్పడానికి ఈ గాథే నిదర్శనం.




